తూములూరు రుచులు ఊరు

6 Jun, 2023 03:13 IST|Sakshi

మొదట అక్కడ సేంద్రియ వ్యవసాయం మొదలైంది. తర్వాత స్త్రీలు సేంద్రియ తినుబండారాలు మొదలుపెట్టారు. రేకుల షెడ్డే వారి వంటశాల. అరవై పైబడిన బసవ పూర్ణమ్మ వారి మేస్త్రి. రాగి లడ్డు, జొన్నలడ్డు, నల్ల అరిసెలు, నువ్వుండలు... ఆ కారం... ఈ పచ్చడి... ఎక్కడా రసాయనాల ప్రస్తావన ఉండదు. ఆముదం, కాటుక, కుంకుమ కూడా తయారు చేస్తున్నారు. వీరికి ఆర్డర్లు భారీగా ఉన్నాయి. గుంటూరు జిల్లాలోని ఒక చిన్న ఊరు స్త్రీల వల్ల కరకరలాడుతోంది. కళకళలాడుతోంది.

2018లో మొదలైంది ఈ కథ.
‘అమ్మా... మేము పండిస్తున్న సేంద్రియ పంటలకు మంచి డిమాండ్‌ వస్తోంది. కాని ఇవే సేంద్రియ పదార్థాలతో చిరుతిండ్లు చేయించి అమ్మమని అందరూ అడుగుతున్నారు. నువ్వు తయారు చేస్తావా?’ అని అడిగాడు అవుతు వెంకటేశ్వర రెడ్డి తన తల్లి బసవ పూర్ణమ్మతో. ఆమెకు పల్లెటూరి పిండి వంటలు చేయడం వచ్చు. పండగలకు పబ్బాలకు పల్లెల్లో ఎవరు మాత్రం చేయరు? ‘అదెంత పనిరా చేస్తాను’ అంది.

అలా గుంటూరు జిల్లాలోని కొల్లిపరకు ఆనుకుని ఉండే తూములూరు అనే ఊళ్లో సేంద్రియ చిరుతిళ్ల తయారీ మొదలైంది. బసవ పూర్ణమ్మ ఇంటిలో వేపచెట్టు కింద ఉండే పశువుల కొట్టాం కాస్తా వంటల షెడ్డుగా మారింది. ఊళ్లో వంటలు చేయడం ఆసక్తి ఉన్న స్త్రీలకు ఇదొక ఉపాధిగా ఉంటుందని వారిని తోడుకమ్మని ఆహ్వానించింది బసవ పూర్ణమ్మ. అలా ‘విలేజ్‌ మాల్‌’ అనే బ్రాండ్‌తో ‘కొల్లిపర మండల వ్యవసాయదారుల సంఘం’ అనే లేబుల్‌ కింద తూములూరు చిరుతిండ్ల తయారీ మొదలైంది.

రసాయనాలు లేని తిండి
‘మా అబ్బాయీ, ఇంకొంత మంది రైతులు 2015 నుంచి కొల్లిపర చుట్టుపక్కల ఊళ్లలో సేంద్రియ పద్ధతిలో వరి, పసుపు,అరటి, నిమ్మ పండించడం మొదలుపెట్టారు. వీళ్లకు ‘గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘం’ అనే సంఘం ఉంది. రైతులంతా కలిసి ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటూ పంటను మంచి రేటుకు అమ్ముతున్నారు. ఆ సమయంలోనే మార్కెట్‌లో కల్తీ నూనెలతో, పిండ్లతో తయారై వస్తున్న పిండి వంటలు తినలేక సేంద్రియ పిండివంటల కోసం కొందరు ప్రయత్నిస్తున్నారని తెలిసింది.

మా అబ్బాయి ప్రోత్సాహంతో రంగంలోకి దిగాను. మొదట వేరుశనగ ఉండలు చేశాం. నిడదవోలు, మాండ్య లాంటి చోట్ల నుంచి సేంద్రియ బెల్లం తెప్పించి చేశాం. రుచి భలే ఉండటంతో డిమాండ్‌ వచ్చింది. అలా ఒక్కోటి పెంచుకుంటూ వెళ్లాం. ఇవాళ 30 రకాల చిరుతిళ్లు తయారు చేస్తున్నాం’ అని చెప్పింది బసవపూర్ణమ్మ. రాగిలడ్డు, జొన్న లడ్డు, నల్లబియ్యం అరిసెలు, నువ్వుండలు, పప్పుండలు, జంతికలు, కొబ్బరి లడ్డు, చెక్కలు ఇవి కాకుండా కరివేపాకు కారం, మునగాకు కారం వీరు తయారు చేస్తున్నారు.

ఇక మామిడి, గోంగూర పచ్చడి గుంటూరు జిల్లా ప్రత్యేకం. అవీ చేస్తున్నారు. ‘సేంద్రియ నూనె పేరుతో అమ్ముతున్న నూనెలు కూడా కరెక్ట్‌గా లేవు. చాలా నూనెలు ట్రై చేసి రాజస్థాన్‌లో ఒక చోట నుంచి మంచి సేంద్రియ నూనె తెప్పించి ఈ పిండివంటలకు వాడుతున్నాం’ అని తెలిపింది బసవ పూర్ణమ్మ. ఆమె అజమాయిషీలో సాగే వంటశాలకు వెళితే చెట్టు కింద కట్టెలపొయ్యి మీద ఆముదం గింజలు కుతకుత ఉడికిస్తుంటారు కొందరు. వరండాలో జీడిపాకం ఆరబెట్టి, ఉండలు చుడుతుంటారు కొందరు. చిరుధాన్యాలతో లడ్డూలు, నల్లబియ్యంతో అరిసెలు చేస్తారు మరికొందరు. అంతా కళకళగా ఉంటుంది.

ఆముదం, కుంకుమ
‘మార్కెట్‌లో సిసలైన ఆముదం దొరకడం లేదు. మా చిన్నప్పుడు ఎవరి ఆముదం వారే తయారు చేసుకునేవాళ్లం. అందుకనే ఆముదం కూడా తయారు చేస్తున్నా. లీటరు 800 పెట్టినా ఎగరేసుకుని పోతున్నారు. పసుపు నుంచి కుంకుమ తయారు చేసే పద్ధతి ఉంది. అలా స్వచ్ఛమైన కుంకుమ తయారు చేస్తున్నా. ఆముదం గింజల నుంచే కాటుక తయారు చేయవచ్చు. అదీ చేస్తున్నా. మా చిరుతిండ్ల కంటే వీటిని ఎక్కువమంది మెచ్చుకుని కొనుక్కుంటున్నారు’ అని తెలిపింది బసవపూర్ణమ్మ. ఈ మొత్తం పనిలో పదిహేను మంది ప్రత్యక్షంగా మరో పదిహేనుమంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు.

కోటి టర్నోవర్‌కు...
వచ్చే మార్చికంతా కోటి టర్నోవర్‌కు ఈ పిండి వంటల పరిశ్రమ చేరుకోవచ్చని అంచనా. తూములూరు పిండి వంటలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చాలా కేంద్రాల్లో అమ్ముడుపోతున్నాయి. కొందరు సరుకు తీసుకుని తమ బ్రాండ్‌ వేసుకుని అమ్ముకుంటున్నారు. సరుకు రవాణ మొత్తం ఆర్‌.టి.సి. కార్గొ మీద ఆధారపడటం విశేషం. గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల సంఘం నగరాల్లో నిర్వహించే ప్రదర్శనల్లో తూములూరు పిండివంటల స్టాల్‌ కచ్చితంగా ఉంటోంది.

ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం నిర్వహించే సమావేశాలకూ ఈ పిండివంటలనే ఆర్డరు చేస్తున్నారు. ‘ఈ రోజుల్లో ఆడవాళ్లకు పిండివంటలు చేసుకోవటం కష్టమవుతోంది. దీనికితోడు రసాయన అవశేషాలు లేని ఆహారపదార్థాలు దొరకటం దుర్లభంగా తయారైంది. అందుకే మాకు డిమాండ్‌ వస్తోంది. మరింతమంది రైతులను కలుపుకుని సేంద్రియ పంటలతో పిండివంటలను పరిశ్రమ స్థాయికి చేర్చాలనే ఆలోచన సంఘ సభ్యుల్లో ఉంది. అప్పుడు మా వంటశాలను విస్తరించాల్సి వస్తుంది’ అని తెలిపింది బసవ పూర్ణమ్మ.

– బి.ఎల్‌.నారాయణ, సాక్షి, తెనాలి

మరిన్ని వార్తలు