ప్రపంచ రికార్డు: 50 ఏళ్ల వయసు, 500 రోజులు ఒక్కత్తే.. గుహలో...

16 Apr, 2023 00:17 IST|Sakshi
గుహలో బీట్రస్‌; (గుహ నుంచి బయటకు వస్తున్న బీట్రస్‌)

స్పెయిన్‌ అథ్లెట్‌ 50 ఏళ్ల బీట్రస్‌ ఒక ఆరోగ్య ప్రయోగంలో భాగంగా 500 రోజులు గుహలో ఒక్కత్తే గడిపి మొన్న (శుక్రవారం) బయటకు వచ్చింది. బయట నుంచి మాత్రమే నిపుణుల పర్యవేక్షణ ఉన్నా 260 అడుగుల లోతు గుహలో అదరక బెదరక జీవించింది. ఎక్కువ రోజులు గుహలో ఒంటరిగా జీవించిన ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్న బీట్రస్‌ కథా కమామీషు...

‘లోపలకు వెళ్లాక రెండు నెలల వరకూ లెక్క బెట్టాను. ఆ తర్వాత రోజుల్ని లెక్క బెట్టుకోవడం మానేశాను. సహాయక బృందం లోపలికి వచ్చి నన్ను బయటకు తెచ్చే వరకు ఏ 160 రోజులో ఉన్నాననుకున్నాను. కాని 500 రోజులు ఉన్నాను. కాలం ఇట్టే గడిచిపోయింది’ అంది బీట్రస్‌ ఫ్లెమినీ.

తన 48వ ఏట నవంబర్‌ 21, 2021 తేదీన స్పెయిన్‌లోని గ్రనాడా పట్టణం సమీపంలో ఉన్న ఒక గుహలోకి బీట్రస్‌ అడుగుపెట్టింది. మళ్లీ 50వ ఏట ఏప్రిల్‌ 14, 2023న బయటకు వచ్చింది. ఒకటిన్నర సంవత్సరం గుహలో ఒక్కత్తే గడిపింది. ‘ఈ కాలంలో బయట ఏం జరిగిందో నాకు తెలియదు’ అందామె.

గ్రనడా యూనివర్సిటీ, అల్మేరియా యూనివర్సిటీలోని శాస్త్ర నిపుణులు గుహలలో, పర్వతారోహణలో ఒక్కరిగా చిక్కుకుపోయినప్పుడు మనిషి ‘సర్కేడియన్‌ రిథమ్‌’ (వెలుతురు, చీకటిని బట్టి మానవ శరీర, మానసిక స్థితుల్లో 24 గంటల్లో వచ్చే మార్పు) అధ్యయనం చేయడానికి బీట్రస్‌ను గుహలోకి పంపారు.

క్యాలెండర్, గడియారం ఏమీ ఇవ్వలేదు. 60 పుస్తకాలు, వెయ్యి లీటర్ల నీరు, స్టవ్, ఆమె కదలికలను బయటి నుంచి గమనించడానికి సెన్సర్స్‌ను తీసుకొని ఆమె లోపలికి వెళ్లింది. ‘నేను నాతో మాట్లాడుకుంటూ గడిపాను, వ్యాయామం, టోపీలు అల్లడం, పుస్తకాలు చదవడం, బొమ్మలు వేయడం... వీటితో టైమ్‌ సరిపోయింది. ఒక్కోసారి భ్రాంతి కలిగేది’ అని తెలిపింది. ఆమె ద్వారా వచ్చిన రీడింగ్స్‌ను శాస్త్రజ్ఞులు ఇప్పుడు క్రోడీకరించే పనిలో పడ్డారు.

మరిన్ని వార్తలు