Bengaluru: 74 ఏళ్ల వయసులో గర్ల్‌ ఫ్రెండ్‌ కోసమే ఇదంతా... నెటిజన్లు ఫిదా

30 Mar, 2022 08:38 IST|Sakshi
పట్టాభి రామన్‌(PC: Nikita Iyer)

బెంగళూరులో పట్టాభి రామన్‌ 74 ఏళ్ల వయసులో ఆటో నడుపుతాడు. గొప్ప ఇంగ్లిష్‌ మాట్లాడతాడు. గర్ల్‌ ఫ్రెండ్‌ కోసమే ఈ వయసులో కూడా ఆటో నడుపుతాను అంటాడు. గర్ల్‌ ఫ్రెండా? ఆశ్చర్యపోకండి. ‘నా భార్యను నేను గర్ల్‌ఫ్రెండ్‌ అనే పిలుస్తాను. భార్యను ఎప్పుడూ ప్రియురాలిగానే చూసుకోవాలి. సేవకురాలిగా కాదు’ అంటాడు.

ప్రయివేట్‌ కాలేజీలో ఇంగ్లిష్‌ లెక్చరర్‌గా పని చేసిన రామన్‌ పిల్లల మీద ఆధారపడకుండా గత 14 ఏళ్లుగా ఆటో నడుపుతున్నాడు. భార్య అంటే ప్రేమ, గౌరవం... ఫిర్యాదులు లేని జీవితానందం ఉన్న రామన్‌ కథ ఒక పాసింజర్‌ ద్వారా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

కొన్ని జీవన పాఠాలు పుస్తకాలు చదవడం వల్ల తెలుస్తాయి. మరికొన్ని జీవిత పాఠాలు నిలువెత్తు పుస్తకాలుగా తిరిగే మనుషుల వల్ల తెలుస్తాయి. మొన్నటి గురువారం బెంగళూరులో నికితా అయ్యర్‌ అనే ఉద్యోగిని ఇలాగే ఒక సజీవ జీవనపాఠాన్ని కలుసుకుంది. ఆ తర్వాత ఆమె ఆ పరిచయాన్ని లింక్డ్‌ఇన్‌లో పంచుకుంది. అంతే. ఆ పోస్ట్‌ వేలాదిమందిని ఆకట్టుకుంటోంది. ఇంతకూ ఆ పోస్ట్‌లో ఏముంది? ఆమె ఇలా రాసింది.

ఆ రోజున... ఆ రోజున నేను ఉదయాన్నే పని మీద బయలు దేరాను. నేను బుక్‌ చేసుకున్న ఊబర్‌ ఆటోడ్రైవర్‌ నన్ను రోడ్డు మధ్యలో వదిలి వెళ్లిపోయాడు. అప్పటికే నాకు ఆఫీసుకు లేట్‌ అయ్యింది. నా ఆఫీసు ఊరికి ఆ చివర ఉంది.  నా ముఖం కంగారుతో నిండి ఉంది. అది గమనించాడో ఏమో ఒక పెద్దాయన తన ఆటో ఆపి ‘ఎక్కడికి వెళ్లాలి’ అని ఇంగ్లిష్‌లో అడిగాడు. నేను ఆయన వయసు వాలకం చూసి జంకుతూనే చెప్పాను. ‘రండి మేడమ్‌. మీరు ఏమి ఇవ్వాలనుకుంటే అది ఇవ్వండి’ అన్నాడు మళ్లీ అంతే మంచి ఇంగ్లిష్‌లో. 

నేను ఆశ్చర్యపోయి ఆటో ఎక్కాను. ‘ఇంత మంచి ఇంగ్లిష్‌ మీకు ఎలా వచ్చు?’ అని అడిగాను. ఆయన ‘నేను గతంలో ఇంగ్లిష్‌ లెక్చరర్‌ని’ అన్నాడు. ఆ తర్వాత ఆయనే ‘ఇప్పుడు మీరు నన్ను మరి ఆటో ఎందుకు నడుపుతున్నావు అని అడగాలనుకుంటున్నారు కదూ’ అన్నాడు. ‘అవును. దయచేసి చెప్పండి’ అన్నాను. ఆయన నాతో ప్రయాణం పొడుగునా 45 నిమిషాల పాటు తన కథ చెప్పాడు.

ఆయన పేరు పట్టాభి రామన్‌. ఎం.ఏ, ఎం.ఇడి చేశాడు. కాని బెంగళూరులో ఆయనకు ఎవరూ లెక్చరర్‌ ఉద్యోగం ఇవ్వలేదు. ‘ఎక్కడకు వెళ్లినా సామాజిక వర్గానికి చెందిన ప్రశ్న ఎదురైంది. అది చెప్పాక.. సర్లే, చెప్తాం లే అనేవారు. పిలుపు వచ్చేది కాదు. దాంతో విసిగి ముంబై వెళ్లిపోయాను’ అన్నాడాయన. ముంబైలోని పోవై కాలేజీలో 20 ఏళ్లు లెక్చరర్‌గా పని చేశాడట. 60 నిండాక తిరిగి బెంగళూరు చేరి ఆటో నడుపుతున్నాడు.

‘ప్రయివేట్‌ లెక్చరర్‌లకు పెన్షన్‌ ఉండదు. మళ్లీ టీచర్‌ ఉద్యోగం చేయాలన్నా పది– పదిహేను వేలకు మించి రాదు. అందుకని ఆటో నడుపుతున్నాను. దీనిని నడపడం వల్ల వచ్చే ఆదాయంతో నా గర్ల్‌ఫ్రెండ్‌ను హాయిగా చూసుకుంటున్నాను’ అన్నాడు.

ఆ మాటకు నాకు నవ్వు వచ్చింది. ‘గర్ల్‌ఫ్రెండా?’ అన్నాను. ‘అవును. నా భార్యను నేను గర్ల్‌ఫ్రెండ్‌ అనే పిలుస్తాను. భార్యను ఎప్పుడూ సమస్థాయిలోనే చూడాలి. భర్త అనుకోగానే భార్య రూపంలో ఆమె సేవకురాలిగా కనిపిస్తుంది. అది నాకు ఇష్టం ఉండదు. ఆమెకు ఇప్పుడు 72 సంవత్సరాలు. ఈ వయసులో కూడా ఇంటిని, నన్ను చక్కగా చూసుకుంటుంది’ అన్నాడతను.

మరి పిల్లలు?... ‘వాళ్ల జీవితం వాళ్లే. నేను, నా భార్య కారుగోడిలో సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌లో ఉంటాం. దాని అద్దె 12 వేలు నా కొడుకు కడతాడు. అంతకు మించి మా పిల్లల నుంచి మేము ఏమీ ఆశించం. మేమిద్దరం మాకు ఉన్నదానితో హాయిగా ఉంటాం’ అన్నాడతను. ‘చూడండి. నేను ఈ రోడ్డుకు రాజుని. నా ఇష్టం వచ్చినప్పుడు ఆటో తీస్తా. లేదంటే ఇంట్లో ఉంటా’ అని నవ్వాడతను.

అతనితో మాట్లాడుతున్నంత సేపు నిరాశ కాని నిస్పృహ కాని జీవితం పట్ల ఫిర్యాదు కాని లేవు. ఇలాంటి వాళ్లు నిజమైన హీరోలు. కాకుంటే వీళ్ల గురించి మనకు తెలియదు. నిజంగా ఈయన పరిచయం నాకు చాలా స్ఫూర్తినిచ్చింది.

ఆ తర్వాత?... నికితా అయ్యర్‌ ఈ అనుభవాన్ని లింక్డ్‌ఇన్‌లో ప్రచురించింది. ఆ పోస్ట్‌ వెంటనే వైరల్‌గా మారింది. 70 వేల మంది క్షణాల్లో లైక్‌ చేశారు. ఆ తర్వాత వేల మంది దానిని షేర్‌ చేశారు. ఎన్‌డిటివి, ఇతర సంస్థలు ఈ కథనాన్ని ప్రచారంలో పెట్టాయి. సింపుల్‌గా, సరళంగా, సంతోషంగా తన జీవితం తాను గడుపుతున్న ఆ ఆటో పెద్దాయన చాలామందిని ప్రభావితం చేశాడు.

లక్షలు, కోట్లు ఉంటే ఏమిటి... మానసిక ఆనందం అంటే ఏమిటో తెలుసుకోవడం ముఖ్యంగాని అంటున్నారు. అతడు భార్యను చూసుకుంటున్న పద్ధతి ప్రతి ఒక్క భర్తకు ఆదర్శం అనీ అంటున్నారు. మొత్తానికి ఈ బోయ్‌ ఫ్రెండ్‌ మంచి మార్కులు కొట్టేశాడు.

చదవండి: Ambali Health Benefits: అంబలి తాగుతున్నారా.. స్థూలకాయం, మధుమేహం.. ఇంకా
  

మరిన్ని వార్తలు