Canada: నమ్మి మోసపోయిన షర్మిణి.. ఇంతకీ ఆమెను చంపింది ఎవరు? ఆ దుర్మార్గుడేనా!

1 Nov, 2022 16:52 IST|Sakshi
షర్మిణి ఆనందవేల్‌ (PC: Toronto Life)

మోసం ఎప్పుడూ అవకాశం కోసమే ఎదురు చూస్తుంది. అవసరం ఎప్పుడూ గుడ్డినమ్మకంతో దూసుకుపోతుంది. ఈ విషాదగాథలో అదే జరిగింది. ఎందరికో కనువిప్పు కలిగించే పాఠంగా మిగిలింది.

అది 1999, కెనడాలోని టొరంటో పట్టణం. 15 ఏళ్ల షర్మిణి ఆనందవేల్‌.. తన కుటుంబ ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని.. రాబోయే మిడిల్‌ స్కూల్‌ గ్రాడ్యుయేషన్‌ వేడుకకు కావాల్సిన డ్రెస్, షూస్‌ తనే కొనుక్కోవాలని నిర్ణయించుకుంది. అందుకు తగ్గ డబ్బు సంపాదించాలని ఆశపడింది. ఏదైనా చిన్న ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది.

షర్మిణి తండ్రి ఏలూర్నాయగం.. 1994తో శ్రీలంక అంతర్యుద్ధ సమయంలో ఆ దేశాన్ని వదిలి భార్యపిల్లలతో సహా కెనడాకు వలస వచ్చాడు. అప్పటికి షర్మిణికి పదేళ్లు. తనకి అన్న దినేష్, తమ్ముడు కాథీస్‌ ఉన్నారు. టొరంటోలో కొత్త జీవితాన్ని నిర్మించుకోవడానికి ఆ కుటుంబం చాలా ఇబ్బందులు పడింది. ఉదయాన్నే పేపర్స్‌ వేయడం, పిజ్జా ఆర్డర్స్‌ సప్లయ్‌ చేయడం.. ఇలా డబ్బు కోసం పిల్లలు కూడా కష్టపడ్డారు.

వుడ్‌బైన్‌ జూనియర్‌ హైస్కూల్‌లో మెరిట్‌ స్టూడెంట్‌గా షర్మిణి మంచి గుర్తింపే తెచ్చుకుంది. 1999 జూన్‌ నెలలో డబ్బు కోసం షర్మిణి చేసిన ప్రయత్నాలకు ఓ చిన్న ఉద్యోగం దొరికింది. ‘నాకు జాబ్‌ వచ్చింది. దగ్గరలోనే ఆఫీస్‌.. కేవలం అక్కడ ఫోన్‌ కాల్స్‌ లిఫ్ట్‌ చేసి మాట్లాడటమే నా పని’ అంటూ ఇంట్లో వాళ్లకి శుభవార్త చెప్పింది.

అదే నెల జూన్‌ 12న ఉదయాన్నే 9 గంటలకు షర్మిణి మొదటిసారి ఆఫీస్‌కి బయలుదేరింది. అక్కకి బై చెప్పడానికి కాథీస్‌ ఎలివేటర్‌ వరకూ వచ్చాడు. షర్మిణి ఎలివేటర్‌ బటన్‌ నొక్కింది. తలుపులు తెరుచుకున్నాయి. ఆమె లోపలికి అడుగుపెట్టి, కాథీస్‌కి బై చెప్పి, కిందకు వెళ్లేందుకు బటన్‌ నొక్కింది. తలుపులు మూసుకున్నాయి. ఆమె ప్రాణాలతో కనిపించడం అదే చివరిసారి.

ఉదయమనగా వెళ్లిన షర్మిణి.. రాత్రి అయినా తిరిగి రాకపోయేసరికి.. ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన అధికారులు.. షర్మిణి బెడ్‌రూమ్‌లో జాబ్‌ అప్లికేషన్‌ను చూసి.. అది స్కామ్‌ అయ్యి ఉంటుందని భావించారు. ‘షర్మిణి వెళ్లేటప్పుడు ఆ ఆఫీస్‌ వివరాలు, ఫోన్‌ నంబర్‌ ఇవ్వమని అడిగాం.. మరిచిపోయి వెళ్లిపోయింది’ అంటూ ఏలూర్నాయగం దంపతులు కంటతడిపెట్టుకున్నారు. అయితే షర్మిణి కావాలనే వివరాలు ఇవ్వలేదని తర్వాత అర్థమైంది.

విచారణలో భాగంగా పోలీసులు.. షర్మిణి స్నేహితుల్ని కూడా ప్రశ్నించారు. అప్పుడే ఓ షాకింగ్‌ విషయం బయటపడింది. ‘షర్మిణి.. తనకి అండర్‌కవర్‌ డ్రగ్స్‌ ఆపరేటర్‌గా జాబ్‌ వచ్చిందని మాతో చెప్పింది’ అంటూ షర్మిణి స్నేహితులు నోరువిప్పడంతో ఒక్కసారిగా ఆమె కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతి చెందారు. అంటే ఎవరో షర్మిణిని తప్పుదారి పట్టించి, జాబ్‌ వివరాలు ఇంట్లో కూడా చెప్పొద్దని నమ్మించి.. కిడ్నాప్‌ చేసి ఉంటారని డిటెక్టివ్స్‌ అంచనా వేశారు.

అనుమానితుడిగా స్టాన్లీ జేమ్స్‌ టిప్పెట్‌ అనే కెనడియన్‌ని అదుపులోకి తీసుకున్నారు. అతడి కారుని స్వాధీనం చేసుకున్నారు. కారు డిక్కీలో డక్ట్‌ టేప్, తాడు, జాక్‌నైఫ్, కత్తెరలు, కొలిచే టేప్, సుత్తి, పొడవైన ప్లాస్టిక్‌ తాడు దొరికాయి. దాంతో కేసు బిగుసుకుంది.

ఆగస్ట్‌ 20న ఫించ్‌ అవెన్యూ సమీపంలో డాన్‌ నది వెంబడి నడుస్తున్న హైకర్లు మానవ శరీరం అవశేషాలను కనుగొన్నారు. శరీరం కుళ్లి, సగానికి పైగా జంతువులు తినేయడంతో.. కేవలం డెంటల్‌(పళ్లు) రికార్డుల ఫోరెన్సిక్‌ పరిశోధనలో ఆ అవశేషాలు షర్మిణివేనని తేలింది. దాంతో కేసు టిప్పెట్‌ మెడకే చుట్టుకుంది. దానికి ప్రధాన కారణం.. కారులో ఆయుధాలు దొరకడంతో పాటు.. టిప్పెట్‌పై అప్పటికే ఎన్నో ఆరోపణలు ఉన్నాయి.

టిప్పెట్‌ ఎప్పుడూ కథలు బాగా చెప్పేవాడు. నిజాన్ని అబద్ధంగా.. అబద్ధాన్ని నిజంగా మార్చి చెప్పడంలో అతడు దిట్ట్ట అని అక్కడ అందరికీ తెలుసు. నిజానికి ఫ్లీ మార్కెట్‌లో కొన్న పోలీస్‌ జాకెట్‌ వేసుకుని తిరుగుతూ అక్కడుండే పిల్లల్ని మాజీ పోలీస్‌ అధికారిని అంటూ నమ్మించేవాడు. విచారణ కోసం బైక్‌ కావాలంటూ అవసరానికి కొందరి దగ్గర బైక్స్‌ తీసుకుని వెళ్తుండేవాడు.

అలాగే చాలామంది మహిళలను వెంబడించి.. లైంగిక దాడికి తెగబడేవాడు. ఒకసారి వాల్‌–మార్ట్‌ ఫెయిర్‌లో ఒక మహిళకు ఉద్యోగం ఇస్తానని నమ్మించి.. ఆమెకు చాలా బహుమతులు ఇవ్వడానికి పదే పదే ఆమె ఇంటికి వెళ్లి.. ఇబ్బందుల్లో పడ్డాడు. ఒకసారి 12 ఏళ్ల బాలికను కిడ్నాప్‌ చేసి.. స్థానికులకు అడ్డంగా దొరికేశాడు. మరోసారి నకిలీ తుపాకీని చూపించి.. బస్‌ స్టాప్‌లో ఒక మహిళను కిడ్నాప్‌ చేస్తే.. ఆమె తనకు హెచ్‌ఐవీ ఉందని అబద్ధం చెప్పి వాడి నుంచి తప్పించుకుంది.

మరోవైపు షర్మిణి అదృశ్యమైన రోజు ఆ అపార్ట్‌మెంట్‌ సమీపంలో టిప్పెట్‌ని చూశామంటూ చాలామంది సాక్ష్యం చెప్పారు. కిడ్నాప్, లైంగిక వేధింపులతో సహా ఏడు నేరారోపణలలో టిప్పెట్‌ను డిసెంబర్‌ 2009లో కోర్టు దోషిగా నిర్ధారించింది.

2011లో టిప్పెట్‌ని అత్యంత ప్రమాదకరమైన నేరస్థుడిగా గుర్తించడంతో.. ఇప్పటికీ జైలులోనే మగ్గుతున్నాడు. అయితే షర్మిణిని హత్య చేసినట్లు మాత్రం టిప్పెట్‌ ఒప్పుకోకపోవడంతో.. షర్మిణి ఎలా, ఎందుకు చనిపోయిందనేది మిస్టరీగానే మిగిలిపోయింది. షర్మిణి గాథ.. అపరిచితుల్ని నమ్మకూడదు అనేందుకు ఒక పాఠం.
-సంహిత నిమ్మన

చదవండి: Venkampalli: వెల్‌కమ్‌ టు వెంకంపల్లి.. ఒక ఊరి కథ

మరిన్ని వార్తలు