'ఆ సామర్థ్యాలున్నాయని 78శాతం మంది యూత్‌ నమ్ముతున్నారు'

9 Nov, 2022 18:28 IST|Sakshi

ఈజిప్ట్‌ వేదికగా జరుగుతున్న వాతావరణ సదస్సు ‘కాప్‌– 27’తో భూతాపం, పర్యావరణంలో జరుగుతున్న మార్పులు, అడవుల పరిరక్షణ... మొదలైన విషయాలపై నాలుగు మాటలు గట్టిగానే వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్‌ ముఖచిత్రమైన యువతలో వాటి పట్ల ఆసక్తి ఏ మేరకు ఉంది? అనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది.
గత కాలం సంగతి ఎలా ఉన్నా... ఈతరం మాత్రం పర్యావరణానికి సంబంధించిన విషయాలపై ఆసక్తి ప్రదర్శించడం, అవగాహన పెంచుకోవడం మాత్రమే కాదు ‘గ్రీన్‌కాలర్‌ జాబ్‌’ చేయడానికి ప్రాధాన్యత ఇస్తోంది...

సోషల్‌మీడియా విస్తృతి వల్ల వాతావరణ సంక్షోభం గురించిన అవగాహన, చర్చ అనేవి అంతర్జాతీయ సదస్సులు, జర్నల్స్‌కు మాత్రమే పరిమితం కావడం లేదు. క్షేత్రస్థాయిలో పర్యావరణ సంక్షోభంపై మాటాముచ్చట పెరుగుతోంది. ఈ క్రమంలో యువతరంలో కొంతమంది పర్యావరణహిత ఉపాధి అవకాశాలపై అధిక ఆసక్తి చూపుతున్నారు.

ముంబైకి చెందిన దిశా సద్నాని పర్యావరణ ప్రేమికురాలు. రెగ్యులర్‌ జాబ్‌ కాకుండా పర్యావరణ పరిరక్షణలో భాగం అయ్యే ఉద్యోగం చేయాలనేది దిశ కల. ప్రస్తుతం ఒక కార్పోరెట్‌ సంస్థలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న దిశ నీటి నుంచి పారిశుధ్యం వరకు రకరకాల ప్రాజెక్ట్‌లలో పనిచేస్తోంది.

పంజాబ్‌లోని లుథియానాకు చెందిన 25 సంవత్సరాల శౌర్య శర్మ మేనేజ్‌మెంట్‌ గ్రాడ్యుయేట్‌. క్లైమెట్‌ కన్సల్టెన్సీకి సంబంధించిన ఉద్యోగం చేయాలనేది శర్మ కల. అయితే‘పేరు గొప్ప ఊరు దిబ్బ’లాంటి ఉద్యోగాలు, నాలుగు గోడల మధ్య ఉపన్యాసాలకే పరిమితం అయ్యే ఉద్యోగాలు చేయడం అతడికి ఇష్టం లేదు. ఊరూవాడా తిరగాలి. ప్రజలతో కలిసి పనిచేయాలి. పర్యావరణ పరిరక్షణలో నిర్మాణాత్మక అడుగు వేయాలనేది అతడి కల.

బ్రిటిష్‌ ఇంటర్నేషనల్‌ ఇంటర్‌నెట్‌–బేస్డ్‌ మార్కెట్‌ రీసెర్చ్‌ అండ్‌ డాటా ఎనలటిక్స్‌ సంస్థ ‘యూ గోవ్‌’ పర్యావరణ స్పృహకు సంబంధించిన అంశాలపై 18–35 ఏళ్ల వయసు ఉన్న వారిపై యూకే, యూఎస్, ఇండియా, పాకిస్థాన్, ఘనా... మొదలైన దేశాల్లో ఒక అధ్యయనం నిర్వహించింది.

పర్యావరణ సంక్షోభానికి సంబంధించిన పరిష్కారాలు వెదికే శక్తిసామర్థ్యాలు తమ తరానికి ఉన్నాయని యూత్‌లో 78 శాతం మంది నమ్ముతున్నారు. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే ‘గ్రీన్‌ జాబ్‌’ చేయడానికి 74 శాతం మంది ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ రంగంలో పనిచేస్తున్న యువత సంఖ్య తక్కువగా ఉంది. భవిష్యత్‌ మాత్రం ఆశాజనకంగా ఉంది.

కంపెనీల విషయానికి వస్తే... ఒకరిని ఉద్యోగంలోకి తీసుకోవడానికి కేవలం పర్యావరణ ప్రేమ మాత్రమే ప్రమాణంగా తీసుకోవడం లేదు. సాంకేతిక సామర్థ్యానికీ పెద్దపీట వేస్తున్నాయి.

సస్టెయినబిలిటీ మేనేజర్, సేఫ్టీ మేనేజర్, వాటర్‌ రిసోర్సెస్‌ ఇంజనీర్‌ అనేవి మన దేశంలో టాప్‌–3 గ్రీన్‌జాబ్స్‌. సాఫ్ట్‌వేర్, ఐటీ సర్వీసులు, మాన్యుఫాక్చరింగ్, ఎడ్యుకేషన్‌ రంగాలు ‘గ్రీన్‌ టాలెంట్‌’కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. 

మాన్యుఫ్యాక్చరింగ్, ట్రాన్స్‌పోర్టేషన్‌ కంపెనీలు సస్టెయినబిలిటీ ఎనాలసిస్ట్, వాటర్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఎక్స్‌పర్ట్, సోలార్‌ డిజైనర్స్‌. అర్బన్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఇంపాక్ట్‌ ఆఫీసర్స్, ఎన్విరాన్‌మెంట్‌ డాటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్స్‌... మొదలైన నిపుణులకు ప్రాధాన్యత ఇస్తున్నాయి.

పునరుత్పాదకశక్తి, ఆరోగ్యం–భద్రత, సౌరశక్తి, పర్యావరణ సమతుల్యతను కాపాడడానికి సహజ వనరుల క్షీణతను నివారించడం... మొదలైనవి ‘గ్రీన్‌ స్కిల్స్‌’కు ముఖ్యకేంద్రాలుగా ఉన్నాయి. మన దేశంలోని అగ్రశ్రేణి కళాశాలలు, యూనివర్శిటీలు పర్యావరణానికి సంబంధించిన ప్రత్యేక కోర్సులు ప్రవేశ పెట్టాయి. వాటిలో కొన్ని... గ్రీన్‌ ఎకానమీ ఫర్‌ బిజినెస్, ఎన్విరాన్‌మెంటల్‌ లా, క్లైమెట్‌ చేంజ్, క్లైమెట్‌ సైన్స్‌ అండ్‌ పాలసీ, గ్రీన్‌ ఎకనామీ, గ్రీన్‌ ఇన్నోవేషన్‌ ఫ్రమ్‌ నాలెడ్జ్‌ టు యాక్షన్, వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌. యువతరం సంప్రదాయ ఉద్యోగాలకు భిన్నంగా కొత్తరకం ఉద్యోగాలపై ఆసక్తి ప్రదర్శించడం విశేషం అయితే ‘గ్రీన్‌ జాబ్‌’లు చేయాలనుకోవడం స్వాగతించ తగిన పరిణామం.

ఇది చాలదు... ఇంకా
పర్యావరణహిత ఉద్యోగాలలో కదలిక మొదలైంది. అయితే అది ఇంకా విస్తృతం కావాలి. పర్యావరణ స్పృహ అనేది జీవన విధానంగా మారాలి. క్లైమెట్‌ స్ట్రాటజీపై యువతరం దృష్టి పెట్టాలి. తమవైన పరిష్కార మార్గాల గురించి ఆలోచించాలి. వాతావరణానికి సంబంధించి ప్రస్తుత సంక్షోభ పరిస్థితులలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి కంపెనీ స్పెషల్‌ క్లైమెట్‌ యాక్షన్‌ టీమ్‌లను ఏర్పాటు చేసుకోవాలి. వాటిలో యువతరం క్రియాశీల పాత్ర పోషించాలి.
– షీతల్‌ పర్మార్, పర్యావరణ అంశాల బోధకురాలు, అహ్మదాబాద్‌

మరిన్ని వార్తలు