తొలి ట్రిలియనీర్‌గా చరిత్ర సృష్టించబోతోందెవరు..?

10 Apr, 2021 00:18 IST|Sakshi
ఎలాన్‌ మస్క్, బిజినెస్‌ మాగ్నెట్‌ (నికర ఆస్తి 176 బిలియన్‌ డాలర్లు) జెఫ్‌ బెజోస్, అమెజాన్‌ (నికర ఆస్తి 192 బిలియన్‌ డాలర్లు) బిల్‌ గేట్స్, మైక్రోసాఫ్ట్‌ (నికర ఆస్తి 143 బిలియన్‌ డాలర్లు) నికర విలువ 2021 ఏప్రిల్‌ 9 నాటికి 

తొలి ట్రిలియనీర్‌

ఫోర్బ్స్‌ ఎప్పుడూ టాప్‌ 10  ‘బిలియనీర్‌’లు  అనే జాబితాను మాత్రమే ఇస్తుంటుంది? ట్రిలియనీర్‌ల జాబితాను ఇవ్వదు. ఎందుకు? ఎందుకంటే ఈ భూమి మీద ట్రలియనీర్‌లే లేరు!! బిలియనీర్‌ అంటే కనీసం వెయ్యి మిలియన్‌ల విలువైన నికర ఆస్తులు కలిగి ఉన్న వ్యక్తి. ట్రిలియనీర్‌ అంటే కనీసం వెయ్యి బిలియన్‌ల విలువైన నికర ఆస్తి ఉన్న వ్యక్తి. ఫోర్బ్స్‌మ్యాగజీన్‌లో తరచు కనిపించే జెఫ్‌ బెజోస్, ఎలాన్‌ మస్క్, బిల్‌ గేట్స్, మార్క్‌ జుకర్‌బర్గ్‌ వీళ్లంతా కూడా (డాలర్‌ల లెక్కలో) బిలియనీర్‌లే. ట్రిలియనీర్‌లు కారు. భవిష్యత్తులో వీళ్లే ట్రిలియనీర్‌లు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరైతే వీళ్లలో ఎవరు తొలి ట్రిలియనీర్‌గా చరిత్ర సృష్టించవచ్చు? బిలియనీర్‌లుగా ఇప్పుడు తొలి రెండు స్థానాలలో ఉంటూ వస్తున్న జెఫ్‌ బెజోసా? లేకా ఎలాన్‌ మస్కా? వీళ్లిద్దరూ కాకుండా మిగతావాళ్లెవరైనా?! ఊహించగలరా? 

మన ఊహలన్నీ పైపైన అంచనాలుగా ఉండొచ్చు. మన అంచనాలు నిజం కూడా అవొచ్చు. అయితే ప్రస్తుతం ఈ భూమండలం మీద ఉన్న బిలియనీర్‌లలో ఎవరికి మొదటిసారి ‘ట్రిలియనీర్‌’ అనే గుర్తింపు దక్కుతుందా అని లెక్కలు వేసిన కొందరు.. ఎలాన్‌ కానీ, జెఫ్‌ బెజోస్‌ కానీ అంటున్నారు. వాళ్లిద్దరిలో కచ్చితంగా ఎవరో, వాళ్లిద్దరూ కాకుండా మిగతా వాళ్లలో ఎవరో చెప్పలేమని కూడా చేతులు ఎత్తేస్తున్నారు! చేతులు ఎత్తేయడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. స్టాక్‌ మార్కెట్‌ను బట్టి రాత్రికి రాత్రి బిలియనీర్‌ల పొజిషన్‌ల మారిపోతున్నప్పుడు.. తొలి ట్రిలియనీర్‌ను ఎవరో సరిగ్గా వేసిన అంచనా కూడా ఆఖరి నిముషంలో తలకిందులు అవొచ్చు! అయితే అందరికన్నా ముందు ‘ట్రిలియన్‌’కు ఎవరైతే టచ్‌ అవుతారో వారే చరిత్రలో ఎప్పటికీ ‘తొలి ట్రిలియనీర్‌గా’గా ఉండిపోతారు. మర్నాడే ఇంకొకరు ట్రిలియన్‌ మార్క్‌ని రీచ్‌ అయినా ‘తొలి ట్రిలియనీర్‌’ అన్న రిచ్‌నెస్‌ ఎక్కడికీ పోదు. ఆ ఎక్కడికీ పోనీ రికార్డు అయితే ఎలాన్‌ మస్క్‌దే అవుతుందని ప్రముఖ వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ బిలియనీర్‌ చామంత్‌ పలిహపతయ నమ్ముతున్నారు. అంటే.. కాబోయే తొలి ట్రిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ అన్నమాట! ఆయన నమ్మితే సరిపోతుందా? చామంత్‌  ఊరికే నమ్మడం లేదు. మనల్ని నమ్మమని చెప్పడం లేదు. ఆయన లెక్కలు ఆయనకు ఉన్నాయి.

ఎలాన్‌ మస్క్‌ స్పేస్‌ ట్రావెల్, ఎలక్ట్రికల్‌ ఆటోమొబైల్స్‌ బిజినెస్‌లో ఉన్నారు. ఈ భూమి మీద మారుమూల ప్రాంతాలను సైతం కనెక్ట్‌ చేయగల ‘స్టార్‌లింగ్‌’ స్పేస్‌ ఇంటర్నెట్‌ కూడా ఆయనదే. ప్రతి ఒక్కరికీ అవసరమైనది ఇవ్వగల వ్యాపారి (ఇది చిన్నమాట) ప్రతి ఒక్కరి నుంచీ పొందగల వ్యాపారి అవుతాడు కనుక ఎలాన్‌ మస్కే మొదటి ట్రిలియనీర్‌గా ఈ భువనాధీశుడు అవుతాడు. మార్స్‌లో కాలనీని నిర్మించబోతున్నది కూడా అతడేనన్న విషయం మనం మరువకూడదు. ఇక ఎలాన్‌ మస్కే తొలి ట్రిలియనీర్‌ అవుతారని చామంత్‌ అతడిలో ఇంకా ఏం చూసి చెబుతున్నారంటే.. వాతావరణ మార్పుల్ని ‘మానవయోగ్యం’గా మెరుగు పరిచేవారు వరల్డ్స్‌ రిచెస్ట్‌ అవుతారు కనుక.. కేవలం కార్లను మాత్రమే తయారు చేయకుండా, ఎన ర్జీ కంపెనీగా కూడా ఎనర్జీని పండిస్తున్న, ఎనర్జీని స్టోర్‌ చేస్తున్న ‘టెస్లా’ అతడిని టాప్‌10 లోని మిగతా వాళ్ల కన్నా ముందు ‘ట్రిలియనీర్‌’ను చేయవచ్చట!

ఎలాన్‌ మస్క్, జెఫ్‌ బెజోస్‌లు బిజినెస్‌లో ఇప్పుడు పోటాపోటీగా ఉన్నారు. ఒకటీ రెండు స్థానాల్లో ఉన్నారు. ఈ రెండు స్థానాల్లోనే వారు పైకీ కిందికి మారుతున్నారు. ప్రస్తుతం వాళ్ల ఆస్తుల నికర విలువ ఇంచుమించు 150 బిలియన్‌ డాలర్ల దగ్గర కిందా మీదా అవుతోంది. ఇంత ‘నెక్‌ టు నెక్‌’లో ఉన్నప్పుడు జెఫ్‌ బెజోస్‌ తొలి ట్రిలియనీర్‌ కాకూడదనేముంది?! అవును ఏముంది? అవొచ్చు. 1994లో బెజోస్‌ ‘అమెజాన్‌.కామ్‌’ అనే పేరుతో ఆన్‌లైన్‌ బుక్‌స్టోర్‌ ప్రారంభించారు. ఇప్పుడు అమెజాన్‌ పేరుతో ఉన్న మొత్తం ఆస్తులు 192 బిలియన్‌ డాలర్‌లు. కరోనా వైరస్‌ అతడిని మరింత ధనికుడిని చేసింది. ఆ వైరస్‌ ప్రపంచాన్ని కమ్ముకోవడంతో కోట్లమంది వినియోగదారులు బెజోస్‌ ఆన్‌లైన్‌ వ్యాపారంపై ఆధారపడి అతడి రాబడిని ఒక్కసారిగా పెంచేశారు. ఒక్క 2020 లోనే బెజోస్‌ ఆన్‌లైన్‌ వ్యాపారం దాదాపుగా 50 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది.

ఫోర్బ్స్‌ బిలియనీర్‌ జాబితాలో ప్రస్తుతం బెజోస్‌ నికర ఆస్తుల విలువ 200 బిలియన్‌ డాలర్‌లకు దగ్గరగా ఉంది. అమెరికన్‌ వెబ్‌సైట్‌ ‘బిజినెస్‌ ఇన్‌సైడర్‌’ అంచనాల ప్రకారం 2026 నాటికి బెజోస్‌ ట్రిలియనీర్‌ అవొచ్చు. అప్పటికి ఆయనకు 62 ఏళ్లు వస్తాయి. చిన్న వ్యాపారాల ఆర్థిక సలహాల వేదిక ‘కంపారిజన్‌’ నివేదిక కూడా బెజోసే తొలి ట్రిలియనీర్‌ కావచ్చని ఊహిస్తోంది. అయితే తొలి ట్రిలియనీర్‌ అయ్యే తొలి ‘యంగెస్ట్‌ పర్సన్‌’ జుకర్‌బర్గ్‌ కావచ్చునని అంచనా వేస్తోంది. ప్రస్తుతం జుకర్‌బర్గ్‌ వయసు 36 ఏళ్లు. అతడికి 51 ఏళ్లు వచ్చేనాటికి .. అంటే మరో పదిహేనేళ్లలో అతడు ట్రిలియనీర్‌ అవొచ్చని కంపారిజన్‌ అంటోంది. 

తొలి ట్రిలియనీర్‌ అయ్యే అవకాశాలు ఉన్న వ్యక్తులలో ఎలాన్‌ మస్క్, జెఫ్‌ బెజోస్‌ తర్వాత బిల్‌ గేట్స్‌ నిలుస్తారని మరికొన్ని అంచనాలు చెబుతున్నాయి. గేట్స్‌ నికర ఆస్తుల విలువ ప్రస్తుతం అటూ ఇటుగా 140 బిలియన్‌ డాలర్‌లు. అయితే 2018 నాటి ‘ఆక్స్‌ఫామ్‌’ నివేదికను బట్టి చూస్తే మస్క్, బెజోస్‌ కన్నా ముందే గేట్స్‌ ‘ట్రిలియనీర్‌’ అవుతారు. గేట్స్‌ 2013లో తన గేట్స్‌ ఫౌండేషన్‌ ద్వారా లోక కల్యాణానికి 28 బిలియన్‌ డాలర్‌లను ధారపోశారు. ప్రస్తుతం ఆయన వయసు 65. ఈ ధారపోయడం కొనసాగకపోతే కనుక భవిష్యత్తులో ఆయన ఎవరి అంచనాలకూ అందనంత ధన సంపన్నుడు అవుతారని రెండేళ్ల క్రితం నాటి ఆక్స్‌ఫామ్‌ అంచనాలను బట్టి లెక్క వేయవచ్చు. మస్క్, బెజోస్, గేట్స్‌.. ఎవరు తొలి ట్రిలియనీర్‌ అయినా వారు చరిత్రలో నిలిచిపోతారు. అది వారొక్కరి సంపదే కాదు. వారి నుంచి ఏదైతే పరిజ్ఞానాన్ని, ఏవైతే సేవల్ని, ఏ విధమైన అభివృద్ధిని అందుకుందో ఆ ప్రపంచ మానవాళి సంపద కూడా. 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు