Happy Mothers Day: హ్యాపీ 'అమ్మ'

8 May, 2022 08:36 IST|Sakshi

 కవర్‌ స్టోరీ

‘పెళ్లి కాకుండా పిల్లలేంటి? ఊర్లో మేం తలెత్తుకుని తిరగాలా? వద్దా? నువ్వు చేసిన పనికి మీ నాన్న కుంగిపోతున్నాడు. బతికుండగానే మమ్మల్ని చంపేస్తావా?’ 
ఓ తల్లి బాధ.. పెళ్లి కాకుండా డోనర్‌ ద్వారా గర్భవతి అయిన కూతురు గురించి. ఇది ‘గిల్టీ మైండ్స్‌’ అనే వెబ్‌సిరీస్‌లో ఓ దృశ్యం. 

సినిమాలు, సీరియళ్ల కథాంశాలకు జీవితాలు.. ధోరణులు.. ఒరవడులే ప్రేరణ. అంటే పెళ్లి కాకుండానే తల్లి కావాలనుకోవడం నిజ జీవితాల్లో కనిపిస్తోందా? అని రెట్టించి అడిగితే  సమాధానం అవుననే.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినుల నుంచి సెలబ్రిటీల దాకా! మహాభారతకాలం నాడు కుంతి కూడా పెళ్లి కాకుండానే కర్ణుడిని కన్నది. సమాజానికి భయపడి బిడ్డను బుట్టలో పెట్టి నదిలో వదిలేసింది. నేటి సమాజపు స్థితిగతులూ అవే. కాకపోతే స్త్రీలే ధైర్యంగా నిలబడుతున్నారు. ఏటికి ఎదురీదుతున్నామని తెలిసే 
తాము తీసుకున్న నిర్ణయం పట్ల స్థిరంగా ఉంటున్నారు. పెళ్లి ఊసు లేకుండానే పిల్లల్ని కనడానికి ఇష్టపడుతున్నారు. కంటున్నారు.. చక్కగా పెంచుకుంటున్నారు కూడా! ఈ అంశం మీద తప్పొప్పుల చర్చో.. మంచిచెడుల తీర్పో కాదు ఈ వ్యాసం. 

మాతృత్వానికి సంబంధించి ఈ తరం చేస్తున్న ఆలోచనలు.. దాన్ని ఆస్వాదించడంలో వాళ్లు తీసుకుంటున్న చొరవ.. చూపిస్తున్న తెగువ గురించి మాత్రమే ఈ నాలుగు మాటలు .. అదీ మదర్స్‌ డే సందర్భం కాబట్టి!

1980ల దశకం చివర్లో .. బాలీవుడ్‌ నటి నీనా గుప్తా పెళ్లి చేసుకోకుండానే వెస్ట్‌ ఇండీస్‌ క్రికెటర్‌ వివియన్‌ రిచర్డ్స్‌తో బిడ్డను కన్నది. సమాజం ఉలిక్కిపడింది. ఆ చర్యను సంచలనంగా చూసింది. నీనా చలించలేదు. వివియన్‌ రిచర్డ్స్‌ మీదున్న ప్రేమను కూతురు రూపంలో పదిలపరచుకోవాలనుకుంది. ఆ ప్రేమ పెళ్లిదాకా వెళ్లదని తెలిసే ఆ రోజు ఆమె ఆ నిర్ణయం తీసుకుంది. మసాబాకు జన్మనిచ్చింది. అయితే ఈ దేశంలో ఒంటరి తల్లిగా  ఆ బిడ్డను పెంచడం ఆమెకేమీ నల్లేరు మీద నడక కాలేదు. రోలర్‌ కోస్టర్‌ రైడే సాగింది. ఆమె ఊహించుకున్నదాని కంటే ఎక్కువ సమస్యలనే ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏ అమ్మాయి అలాంటి నిర్ణయం తీసుకోకూడదని ప్రత్యక్షంగా చెప్పకపోయినా పరోక్షంగా చాలా ఇంటర్వ్యూల్లో చెప్పింది. శతాబ్దం మారి ఇరవై ఏళ్లవుతోంది. నాటితో పోల్చుకుంటే నేడు మహిళల చదువు పెరిగింది. ఆర్థిక వెసులుబాటూ హెచ్చింది. అవి హక్కుల స్పృహను కల్పించాయి.. నిర్ణయాధికారాన్నిచ్చాయి. సాంకేతిక విప్లవం.. అదిచ్చిన ఉద్యోగావకాశాలు వాటికి దోహదపడ్డాయి. 

కెరీర్‌ ఒత్తిళ్లు..
ఉపాధి అవకాశాలు స్త్రీ, పురుషుల మధ్య పోటీనీ పెంచాయి. అది మహిళల మీద చాలా ప్రభావం చూపిస్తోంది. ఎంతలా అంటే జీవితంలో  ఘట్టాలైన పెళ్లి, పిల్లలు వంటి వాటినీ మరచిపోయేంత.. మరిపించేంత లేదా వాయిదా వేసుకునేంతలా! ఆ పోటీ, వేగం ఉద్యోగ అభద్రతను కల్పించాయి... కల్పిస్తున్నాయి. పెళ్లి చేసుకున్నాక పిల్లల్ని కనే క్రమంలో సెలవులు అవసరమవడం.. సెలవుల మీద వెళ్లిన గర్భిణీలను ఉద్యోగంలోంచి తీసేయడం.. మళ్లీ ఉద్యోగ ప్రయత్నాలు గగనమవడం.. ఈ ఇన్‌సెక్యూరిటి వల్లే పెళ్లిని వాయిదా వేసుకోవడం.. పిల్లలనూ కనకుండా ఫ్యామిలీ ప్లానింగ్‌ పాటించడం వంటి కఠిన నిర్ణయాలకూ వచ్చిన ఉద్యోగినులున్నారు. తర్వాతర్వాత మెటర్నిటీ లీవులను తమ హక్కుగా సాధించినా.. పెళ్లి విషయంలో ఆధునిక మహిళల నిర్ణయాలను అదంతగా ప్రభావితం చేయలేకపోయింది.

అంటే కెరీర్‌లో పడిపోయి పెళ్లికి అంత ప్రాధాన్యానివ్వని స్త్రీలు చాలామందే కనిపిస్తున్నారు. పురుషులతో సమంగా పెద్ద పెద్ద హోదాలు నిర్వహించడం.. ఆ అనుభవాలు ప్రాపంచిక జ్ఞానాన్ని అందివ్వడం.. ఇవన్నీ ఆడవాళ్లు.. ఆర్థికంగా, వ్యవహారికంగా పురుషుల మీద ఆధారపడే చాన్స్‌లను గణనీయంగా తగ్గించేశాయి. దాంతో వైవాహిక బంధంలో ప్రధానంగా కనిపించే ఈ పరస్పర ఆధారిత అంశం పలచబడుతోంది. అది సహజంగానే జీవిత భాగస్వామి అవసరాన్ని తగ్గించేస్తోంది. కానీ మహిళలోని మాతృత్వపు ఆలోచనను.. ఆ ఆశను మాత్రం పదిలంగానే ఉంచుతోంది. ఆ అభిలాషే పెళ్లి బంధానికావల తల్లి కావాలనే ధైర్యాన్నిస్తోంది. 

ఇవీ కారణాలు కావచ్చు.. 
సాంకేతిక వృద్ధి.. పెళ్లితో దొరికే తోడు, తల్లి కావడానికి ఉండే ఈడుతో పనిలేకుండా మాతృత్వాన్ని పొందే అవకాశాలను సృష్టించింది. అండాశయాలను, వీర్యకణాలను భద్రపరచుకునే బ్యాంక్‌లను ఏర్పాటు చేసి. ఈ సౌకర్యం ఉద్యోగినులను పెళ్లి లేకుండానే బిడ్డలను కనాలనే ఆలోచనవైపు ఆకర్షిస్తుండొచ్చు. కెరీర్‌కు సంబంధం లేకుండా ఈ ధోరణిని పరికిస్తే.. అన్ని విధాలా తనకు సరితూగే మిస్టర్‌ రైట్‌ దొరక్కపోవడం, వరకట్నాల డిమాండ్, గృహ హింస, కుటుంబ హింస, పరస్పర గౌరవమర్యాదల్లేని వైవాహిక అనుబంధాలు, వివాహ వెఫల్యాలు, మగవాళ్ల వ్యసనాలు, చైల్డ్‌ అబ్యూజ్‌ వంటి చేదు అనుభవాలూ  వివాహం పట్ల ఈ తరం అమ్మాయిలు విముఖత చూపడానికి, పెంచుకోవడానికి కారణమవుతున్నాయని ఓ పరిశీలిన, పరిశోధన. ఇవీగాక శారీరకంగా తలెత్తే సమస్యలూ ఉంటున్నాయి. మారిన జీవన శైలి వల్ల వస్తున్న స్థూలకాయం, థైరాయిడ్, ఇన్‌ఫెర్టిలిటీ వంటివీ పెళ్లంటే అనాసక్తతను పెంచుతున్నాయి. 

వీటన్నిటి నేపథ్యంలో..
పెళ్లిని వద్దనుకుంటున్నా.. సంతానాన్ని వద్దనుకోవడంలేదు. మాతృత్వపు మాధుర్యాన్ని చవిచూడాలనుకోవడమే కాదు.. దాని తాలూకు బాధ్యతనూ ఒంటరిగా మోయడానికి సిద్ధపడ్తున్నారు ఆ మహిళలు. అంతేకాదు పెళ్లి లేకపోయినా.. తనకంటూ ఓ కుటుంబం ఉండాలని.. దాన్ని ఏర్పర్చే పిల్లల తోడుగా జీవితాన్ని కొనసాగించాలని బలంగా కోరుకుంటున్నారు. ఇందుకు సహజీవనం, స్పెర్మ్‌ డోనర్స్‌ అనే మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇవేవీ కుదరని పక్షంలో సరొగసికీ సిద్ధపడుతున్నారు. ఇదీ సఫలం కాకపోతే దత్తత తీసుకోవడానికీ వెనకాడ్డం లేదు. 
సమస్యలూ ఉన్నాయి.. 

విడాకులతో భర్త నుంచి వేరై.. సింగిల్‌ పేరెంట్‌గా పిల్లల బాధ్యతను మోస్తున్న తల్లికే సామాజిక మద్దతు కొరవడుతున్న పరిస్థితి. అలాంటిది వివాహ వ్యవస్థను కాదని పిల్లలను కని, పెంచుతున్న ఒంటరి తల్లులను సమాజం ఆదరిస్తుందా? మద్దతు ప్రకటిస్తుందా? గౌరవిస్తుందా? ఆర్థికంగా సర్వస్వతంత్రంగా ఆ తల్లులు సమాజం విసిరే సవాళ్లను ఎదర్కోవడం కష్టమే. అది పిల్లల మీదా ప్రభావం చూపి వారిని అభద్రతలోకి నెట్టే ప్రమాదాలూ ఉన్నాయి.

కాబట్టి వెడ్‌లాక్‌కి అతీతంగా తల్లి కావాలని ఎంత దృఢచిత్తం చేసుకున్నా.. గర్భం దాల్చే కంటే ముందు తదనంతర పరిణామాలు, సామాజిక ప్రతికూల స్పందనలు వగైరాల మీద కౌన్సెలింగ్‌ తీసుకోవాలి. అన్నిటికీ తమను తాము సిద్ధపరచుకోవాలి అని సలహా, సూచనలిస్తున్నారు మానసిక విశ్లేషకులు. పిల్లల పెంపకం విషయంలోనూ ఆ కౌన్సెలింగ్‌ తప్పనిసరి అని చెబుతున్నారు. స్కూళ్లు, వేడుకలు వంటి ప్రదేశాలు, సమూహాల్లో పిల్లలకు ఎదురయ్యే బుల్లీయింగ్‌ పట్ల అవివాహిత ఒంటరి తల్లులకు ఓ అవగాహన ఉండాలి. వాటిని పిల్లలు అధిగమించే మార్గాలూ తెలుసుండాలి. పిల్లలకు మానసిక స్థయిర్యం ఇచ్చే సహనం, ఓర్పు అత్యవసరం... మిగతా తల్లులకన్నా. ఎందుకంటే వివాహిత ఒంటరి తల్లుల పట్ల కనీసం కుటుంబాల్లోనైనా సహానుభూతి అందుతుంది. కానీ అవివాహిత తల్లుల విషయంలో అదీ కరవే. అందుకే మరింత సహనంతో వాళ్లు వ్యవహరించాల్సి ఉంటుంది. పసి మనసులు గాయపడకుండా చూసుకోవాల్సి ఉంటుంది.

నైతిక మద్దతు.. 
తాము కోరుకున్న ఈ కొత్త కుటుంబ భవిష్యత్‌కు సంబంధించిన ఆర్థిక ప్రణాళికలే కాదు.. సామాజిక ప్రతికూల పరిస్థితులను తట్టుకుని పిల్లలు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా పెరిగేలా వేసుకునే ప్రణాళికలూ అవసరమే! అందుకు ఒంటరి తల్లులకు సంబంధించిన అసోసియేషన్స్, సోషల్‌ మీడియా గ్రూప్స్‌ వంటివేమైనా ఉంటే అందులో చేరడం, వారి అనుభవాలను పాఠాలుగా తెలుసుకోవడం, నైతిక స్థయిర్యాన్ని పొందుతూ ఓ మద్దతు వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. తల్లీ, తండ్రీ రెండు పాత్రలు పోషించాలి కాబట్టి ఓర్పు చాలా అవసరం. ఇంట్లో స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించాలి. పిల్లల ముందు బేలగా ఉండడం, బెంబేలెత్తడం, తమకు ఎవరూ లేరనే స్పృహను కల్పించడం అసలు చేయకూడదని మానసిక విశ్లేషకుల మాట. దాని బదులు ఇతర కుటుంబాల కన్నా తామెందుకు భిన్నమో.. ఆ బిడ్డ తనకెంత ముఖ్యమో.. సందర్భం వచ్చినప్పుడు సంభాషణల్లోనే చెప్పడం.. ఆ ప్రాధాన్యాన్ని చూపించడం చేయాలనీ సూచిస్తున్నారు మానసిక విశ్లేషకులు. 

చట్టం ఒప్పుకోవట్లేదు.. కానీ న్యాయస్థానాలు గుర్తిస్తున్నాయి.. 
హిందూ అడాప్షన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ యాక్ట్‌ ప్రకారం.. పిల్లలను దత్తత తీసుకునే వీలు ఉంది. కానీ పిల్లల పెంపకంలో, వాళ్ల చదువుల విషయంలో సింగిల్‌ మదర్స్‌కు ఎదురయ్యే ప్రశ్న.. సంరక్షకులు ఎవరని. అసలు సింగిల్‌ మదర్స్‌కు గార్డియన్‌గా ఉండే అర్హత ఉందా? మన దేశంలోని చట్టాల ప్రకారమైతే లేదు. కేవలం తండ్రికి మాత్రమే సంరక్షకులు అనే హోదా ఉంది. ప్రభుత్వ రికార్డులు సైతం తండ్రినే గుర్తిస్తుంటాయి. తల్లి సహజంగానే సంరక్షకురాలు అనే గుర్తింపు ఉన్నా.. తండ్రి తర్వాతే ఆమె స్థానం. అందుకే ‘సింగిల్‌ మదర్స్‌’ హక్కులకు రక్షణ కావాలనే డిమాండ్‌ తలెత్తింది.

ఈ పోరాటాన్ని ముందుండి నడిపిస్తోంది జాతీయ మహిళా సంఘం (ఎన్‌సీడబ్ల్యూ). గార్డియన్‌షిప్‌ చట్టాలకు సంబంధించి కొన్ని సవరణలు అవసరమనే ప్రతిపాదనలను కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖకు పంపించింది కూడా. ఆ సవరణలు ఇంకా జరగలేదు. మన దేశంలో వారసత్వానికి సంబంధించి రెండు ప్రధాన చట్టాలు ఉన్నాయి. హిందూ మైనార్టీ అండ్‌ గార్డియన్‌షిప్‌ యాక్ట్‌ 1956 (హెచ్‌ఎంజీఏ), గార్డియన్‌షిప్‌ అండ్‌ వార్డ్స్‌ యాక్ట్‌ 1890.. ప్రకారం తల్లి, తండ్రి లేదంటే ఇతరులు గార్డియన్‌షిప్‌ హక్కులను కలిగి ఉంటారు. హెచ్‌ఎంజీఏ సెక్షన్‌ 6 ప్రకారం.. ఒక బిడ్డకు తండ్రే సంరక్షకుడు. ఆయన తదనంతరం తల్లికి ఆ హక్కు సంక్రమిస్తుంది.

అయితే వివాహ బంధంతో సంబంధం లేని సందర్భాల్లో బిడ్డ పరిస్థితి ఏంటి? అందుకే  రాజ్యాంగ బద్ధంగా కల్పించిన హక్కులకు సెక్షన్‌ 6 (14, 15 ఆర్టికల్స్‌)కు విఘాతం అని వాదిస్తుంది  జాతీయ మహిళా సంఘం. అలాగే సెక్షన్‌ 6(బీ) ప్రకారం.. వివాహేతర సంతానం అనే పదాన్నీ తొలగించాలని కోరుతోంది. ఈ రెండు సెక్షన్‌లు.. సింగిల్‌ మదర్స్‌తో పాటు భర్తలకు దూరమైన తల్లులు, పిల్లల్ని కనే లైగింకదాడి బాధితురాలి హక్కులకూ భంగం కలిస్తున్నాయని జాతీయ మహిళా సంఘం వాదిస్తోంది. 

అయితే..చట్టంలో  సింగిల్‌ మదర్స్‌ హక్కులకు భద్రత కరువైనా న్యాయస్థానాలు మాత్రం అందుకు అనుకూలమైన తీర్పులే ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సింగిల్‌ మదర్స్‌కు బిడ్డను కనే హక్కు మాత్రమే కాదు.. వాళ్లను పెంచే హక్కులు కూడా ఉంటాయని న్యాయస్థానాలు స్పష్టం చేశాయి.  కేరళలో ప్రముఖ న్యాయవాది అరుణ.ఎ. వాదించిన ఓ కేసులో ఐవీఎఫ్‌ ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన ఒక సింగల్‌ మదర్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇక 2015లో సుప్రీం కోర్టు ఇచ్చిన ఓ తీర్పు ల్యాండ్‌ మార్క్‌గా నిలిచింది. ఏబీసీ వర్సెస్‌ స్టేట్‌ (ఎన్సీటీ ఆఫ్‌ ఢిల్లీ).. కేసులో అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. పెళ్లి కాని తల్లులు.. బిడ్డ తండ్రి పేరు, గుర్తింపును బయటపెట్టాల్సిన అవసరం లేదని, తల్లే ఆ బిడ్డకు ఏకైక సంరక్షకురాలని స్పష్టం చేసింది.

‘ఎవరి మీద ఆధారపడకుండా బిడ్డలను పెంచుతున్న తల్లుల సంఖ్య పెరిగిపోతున్న సమాజం ఇది. అలాంటప్పుడు తండ్రే సంరక్షకుడు అంటూ సింగిల్‌ మదర్స్‌ను ఇబ్బంది పెట్టడం, తండ్రి పేరు చెప్పాలంటూ ఆమె(సింగిల్‌మదర్‌) ప్రైవసీకి భంగం కలిగించడం సరికాదు. అలాగే ఆ బిడ్డకు తండ్రి పేరు తెలుసుకునే హక్కు ఉంటుంద’ ని వ్యాఖ్యలు చేసింది సుప్రీం కోర్టు. ఈ తీర్పును చాలా హైకోర్టులు సమర్థించాయి కూడా. కానీ చట్టంలో ప్రత్యేక సవరణలు జరగనంత కాలం.. సింగిల్‌ మదర్స్‌కు వారసత్వ విషయంలో ఇలా కోర్టుల మీద ఆధారపడాల్సిన పరిస్థితే ఉంటుంది.

ముగింపు.. 
సంప్రదాయ పునాదుల మీద.. వివాహం, కుటుంబ వ్యవస్థలే రెండు కళ్లుగా కొనసాగుతున్న సమాజం మనది. సాంకేతిక పురోభివృద్ధి మోసుకొచ్చే ఆధునిక సౌకర్యాలన్నింటినీ మనఃపూర్వకంగా అనుభవంలోకి తెచ్చుకుంటున్నాం. వాటి కూడా వచ్చే, ప్రభావం చూపే పరాయి సంస్కృతీసంప్రదాయాలూ ఉంటాయి. ఇది వరకైతే అవి మనల్ని చేరడానికి ఏళ్ల సమయం పట్టేది. కానీ సమాచార విప్లవంతో గంటలు మహా అయితే రోజుల తేడాతో బదిలీ అవుతున్నాయి. అది అనివార్యం. ఏ ధోరణికైనా.. ఒరవడికైనా!
-భాస్కర్‌ శ్రీపతి 

మరిన్ని వార్తలు