నిరసన.. వినిపించేంత గట్టిగా

9 Dec, 2020 08:19 IST|Sakshi
చెప్పులు చోరీ చేశారని రోడ్డుపై బైఠాయించిన కిసాన్‌ ఏక్‌తా సంఘ్‌ మహిళా విభాగం అధ్యక్షురాలు ఠాకూర్‌ గీతా భార్తి (ఎరుపు రంగు చీర)

వినిపించాలంటే గట్టిగా మాట్లాడాలి. వినిపించుకోకుంటే తట్టి మాట్లాడాలి. ఇంత ముద్ద పెట్టేవారే కానీ..తట్టేవారు, కొట్టేవారు కాదు రైతులు. కొత్త సాగు చట్టాలు వద్దని వారి డిమాండ్‌. ప్రభుత్వం కదల్లేదు.. మెదల్లేదు. ఛలో ఢిల్లీ అంటూ పిడికిళ్లు బిగించారు. నినాదాలిచ్చారు. పాటలు పాడారు. వీధి నాటకాలు ప్రదర్శించారు. ఏం చేసినా పాలకులు ఆలకించలేదు. ఇక లాభం లేదని..భార్తి అనే రైతు వేరే రూట్‌లో వచ్చారు. ప్రభుత్వంపై చోరీ కేసు పెట్టారు,చెప్పుల్ని దొంగిలించిన కేసు అది!

ఢిల్లీలో రెండు వారాలుగా రైతులు నిరసన ప్రదర్శనలు జరుపుతున్నారు. గత సెప్టెంబరులో కేంద్ర ప్రభుత్వం చేసిన నిత్యావసర, రైతు ఉత్పత్తుల, రైతు సాధికారత చట్టాల్లో రైతులకు నష్టం చేసే అంశాలు ఉన్నందున ఆ మూడు చట్టాలని రద్దు చేయాలని వారి డిమాండ్‌. విపక్షాలతో పాటు క్రమంగా కళాకారులు, గాయకులు, ఆలోచనాపరులు, మేధావులు, ప్రొఫెసర్‌లు రైతుల ఉద్యమానికి మద్దతు ఇచ్చేందుకు తరలి వెళ్లారు. తమ గళం కలిపారు. ప్రభుత్వంలో కాదు కదా, కనీసం సోషల్‌ మీడియాలో కూడా పట్టు బిగించిన రైతుల సమైక్యతపైన గానీ, ప్రభ్వుతం నిర్లక్ష్యంపైన గానీ చలనం రాలేదు!

చివరికి పన్నెండో రోజైన సోమవారం నాడు అలాంటి చలనాన్ని, వ్యంగ్య సంచలనాన్ని ఠాకూర్‌ గీతా భార్తీ అనే ఒక మహిళా రైతు తీసుకురాగలిగారు! ‘గీతా భార్తీ కా శాండల్‌ వాపస్‌ కరో’ అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్విట్టర్‌లో ట్రెండ్‌ అయింది. మీమ్స్‌ మొదలయ్యాయి. పైకి ఆ మీమ్స్‌ భార్తికే గురిపెట్టి ఉన్నా, లక్ష్యం మాత్రం ప్రభుత్వమే. గ్రేటర్‌ నోయిడాలోని ఒక బైఠాయింపులో పాల్గొన్న భార్తీ.. రైతుల ప్రదర్శనకు తనను వెళ్లినివ్వకుండా పోలీసుల చేత ప్రభుత్వం తన చెప్పుల్ని చోరీ చేయించిందని ఆరోపిస్తున్న వీడియో ట్విట్టర్‌లో పోస్ట్‌ అవగానే నెటిజన్‌లలో స్పందన మొదలైంది.

 ‘‘నా పేరు ఠాకూర్‌ గీతా భార్తి. కిసాన్‌ ఏక్‌తా సంఘ్‌ మహిళా విభాగం అధ్యక్షురాలిని. రైతుల నిరసన ప్రదర్శనకు వెళుతున్న నన్ను అడ్డుకోవడానికి ప్రభుత్వం నా చెప్పుల్ని పోలీసుల చేత చోరీ చేయించింది. వాటిని ఈ ప్రభుత్వం నాకు తిరిగి తెచ్చివ్వాలి. లేకుంటే నేను ఎఫ్‌.ఐ.ఆర్‌. ఫైల్‌ చేయిస్తాను’’ అని భార్తీ ఆ వీడియోలో అంటుండగా, ఆమె పక్కన కూర్చొని ఉన్న మహిళా రైతులు ఆమెకు మద్ధతుగా ‘గీతా భార్తీ జిందాబాద్‌’ నినాదాలు చేశారు. ఇది నవ్వులాటగా అనిపించినప్పటికీ రైతుల ఉద్యమంలోని ఒక సైడ్‌లైట్‌గా కొన్ని తలలు తిరిగి చూసేలా చేయగలిగినంతటి శక్తిమంతమైన నిరసన. 

మరిన్ని వార్తలు