యంత్రాంగం సిద్ధం | Sakshi
Sakshi News home page

యంత్రాంగం సిద్ధం

Published Fri, Nov 24 2023 12:24 AM

- - Sakshi

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): పోలింగ్‌ తేదీ సమీపిస్తుండడంతో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ జిల్లాలో వేగవంతమైంది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో మొత్తం 95 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ ప్రియాంక ఆల ఎన్నికల నిర్వహణలో వివిధ భాధ్యతల్లో ఉన్న అధికారులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ, పోస్టల్‌ బ్యాలెట్‌, హోం ఓటింగ్‌, ఈవీఎంల కమీషనింగ్‌, పోలింగ్‌ సిబ్బందికి శిక్షణ, డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల ఏర్పాటు తదితర విషయాలపై అధికారులు పకడ్బందీ కార్యాచరణ రూపొందించి ప్రశాంత ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నారు.

1,098 పోలింగ్‌ కేంద్రాలు..

ఎన్నికల నిర్వహణ పర్యవేక్షణకు ముగ్గురు సాధారణ పరిశీలకులు, ఇద్దరు వ్యయ పరిశీలకులు, మరో ఇద్దరు పోలీస్‌ అబ్జర్వర్లను ఎన్నికల సంఘం నియమించింది. జిల్లాలో 1,098 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా, వాటిలో ఓటర్లకు అన్ని సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 320 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించిన అధికారులు.. వాటిలో మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఇక 659 పోలింగ్‌ కేంద్రాల్లో లోపల, 269 కేంద్రాల్లో వెలుపలా వెబ్‌కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. నిరంతర విద్యుత్‌ సరఫరా జరిగేలా చూడడంతో పాటు వృద్ధులు, దివ్యాంగుల సౌకర్యార్థం పోలింగ్‌ కేంద్రాల వద్ద ర్యాంపులు, వీల్‌చైర్లు ఏర్పాటు చేస్తున్నారు.

మూడు నియోజకవర్గాల్లో రెండేసి బ్యాలెట్లు

జిల్లాలో ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో నిలిచిన మూడు నియోజకవర్గాల్లో పోలింగ్‌ ప్రక్రియకు రెండు బ్యాలెట్ల(ఈవీఎం)ను వినియోగించనున్నారు. ఒక్కో ఈవీఎంలో 16 గుర్తులు మాత్రమే ఉంటాయి. అయితే కొత్తగూడెం నియోజకవర్గంలో 30 మంది, ఇల్లెందులో 20 మంది, పినపాకలో 18 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండడంతో ఆయా స్థానాల్లో రెండు చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో 9,66,439 మంది ఓటర్లు ఉండగా సమాచార స్లిప్పుల పంపిణీ ప్రక్రియను ఈనెల 18 నుంచి ప్రారంభించారు. ఈసారి నూతనంగా పోలింగ్‌ స్టేషన్‌తోపాటు పూర్తి వివరాలు తెలియజేసేలా బార్‌కోడ్‌ ఏర్పాటు చేయడం విశేషం. జిల్లాలో ఎపిక్‌ కార్డుల ప్రక్రియ గురువారంతో పూర్తయింది.

5,506 పోస్టల్‌ బ్యాలెట్లు..

జిల్లాలో పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియను ఈనెల 24 నుంచి 28 వరకు నిర్వహించున్నారు. ఇందుకోసం రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లో ఫెసిలిటేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఐదు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 5,506 పోస్టల్‌ బ్యాలెట్లు వచ్చాయి. ఇక ఏమైనా అక్రమాలు జరిగితే సీ విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయాలని ఎన్నికల అధికారులు ముందే సూచించగా జిల్లా వ్యాప్తంగా 191 ఫిర్యాదులు వచ్చాయి. అందులో 9 పిటిషన్లను ఫిర్యాదుదారులు ఉపసంహరించుకోగా, మిగిలిన 98 పరిష్కరించారు. అలాగే సువిధ యాప్‌ ద్వారా వివిధ అనుమతులకు 1,380 దరఖాస్తులు రాగా 932 అనుమతులు జారీ చేశారు. 330 దరఖాస్తులను తిరస్కరించారు. 30 పురోగతిలో ఉండగా 72 పెండింగ్‌లో ఉన్నాయి. ఇచ్చిన అనుమతుల్లో 16 రద్దు చేశారు.

జిల్లాలో ఎన్నికల ప్రక్రియ వేగవంతం

అప్రమత్తం చేస్తున్న జిల్లా ఎన్నికల అధికారి

వివిధ కమిటీల నియామకం

పోలింగ్‌ సిబ్బందికి శిక్షణ పూర్తి..

జిల్లాలోని 1,098 కేంద్రాల్లో పోలింగ్‌ ప్రక్రియ నిర్వహణకు 2,435 బ్యాలెట్‌ యూనిట్లు, 1,790 కంట్రోల్‌ యూనిట్లు, 1,777 వీవీ ప్యాట్‌లను సిద్ధంగా ఉంచారు. 1,313 మంది పీఓలు, 1,313 మంది ఏపీఓలు, 2,626 మంది ఓపీఓలు, 306 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించారు. వీరందరికీ పోలింగ్‌ నిర్వహణపై శిక్షణ ఇచ్చారు.

స్వేచ్ఛాయుత ఓటింగ్‌కు ఏర్పాట్లు చేయాలి

ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని పోలీస్‌ ప్రత్యేక పరిశీలకులు దీపక్‌ మిశ్రా అన్నారు. కలెక్టరేట్‌ మినీ కాన్ఫరన్స్‌ హాలులో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియలో శాంతిభద్రతల నిర్వహణ అత్యంత ప్రధానమని అన్నారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద కేంద్ర, రాష్ట్ర పోలీస్‌ బలగాలతో బందోబస్తు నిర్వహించాలని, 144 సెక్షన్‌ విధించాలని సూచించారు. డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల నుంచి పోలీస్‌ భద్రతతో ఈవీఎంలను తరలించాలన్నారు. తీవ్రవాద ప్రభావం ఉన్న జిల్లాలో ఎన్నికల నిర్వహణకు తీసుకుంటున్న రక్షణ చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేసి జిల్లా ఎన్నికల అధికారి, ఎస్పీలను అభినందించారు. సమావేశంలో ఎన్నికల అధికారి డాక్టర్‌ ప్రియాంక ఆల, ఎస్పీ వినీత్‌, సాధారణ పరిశీలకులు కమల్‌కిషోర్‌, హరికిషోర్‌, గణేష్‌, పోలీస్‌ పరిశీలకులు స్వపన్‌ సర్కార్‌, జయంత్‌సింగ్‌, రిటర్నింగ్‌ అధికారులు ప్రతీక్‌జైన్‌, రాంబాబు, మంగీలాల్‌, శిరీష, కార్తీక్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement