Alzheimers Disease: ఇవి కూడా అల్జైమర్స్‌ లక్షణాలేనట!!

26 Jun, 2022 10:58 IST|Sakshi

మామూలు మతిమరపునకు, అల్జైమర్స్‌కీ తేడా చాలామందికి తెలిసిందే. అయినా చెప్పుకోవాలంటే ఏదైనా ఒక వస్తువు ఎక్కడ పెట్టామో మరచిపోవడం మతిమరపు అయితే... అసలు ఆ వస్తువనేదొకటుంటుందనే కాన్సెప్ట్‌నే మరచిపోవడం అల్జైమర్స్‌. ఉదాహరణగా చెప్పాలంటే... కారు తాళాలను మరచిపోవడం మతిమరపైతే... అసలు కారు డ్రైవింగ్‌నే మరచిపోవడం అలై్జమర్స్‌ అనుకోవచ్చు.

పెద్ద వయసు వచ్చాక చేసే ఆ ఐదు రకాల పనులు అల్జైమర్స్‌ను సూచిస్తాయంటున్నారు లాస్‌ ఏంజిలిస్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియా (యూఎస్‌సీ)కు చెందిన పరిశోధకులు. వారు చెప్పేదాన్నిబట్టి... కాస్త వయసు పైబడ్డాక చేసే పనులు వారిలో అలై్జమర్స్‌ వచ్చే సూచనలను పట్టి ఇస్తుంటాయని యూఎస్‌సీ అధ్యయనవేత్తలు  చెబుతున్నారు. వాటిల్లో కొన్ని సూచనలివి... 

1. దుస్తులు తొడుక్కోవడంలో శుభ్రత పాటించకపోవడం, బట్టలు నీట్‌గా ధరించకపోవడం... వీళ్లు పొందిగ్గా కాకుండా నిర్లక్ష్యంగా, మురికిగా దుస్తులు తొడుక్కుంటుంటారు. 
2. పార్కింగ్‌ చేస్తున్నప్పుడు వాహనాన్ని కుదురుగా కాకుండా... ఎలా పడితే అలా పార్కింగ్‌ చేస్తుంటారు. 
3. మంచి ఆరోగ్యకరమైన హాస్యాన్నీ, మంచి అభిరుచితో ఉండే హ్యూమర్‌ ను కాకుండా...  ఒకరు బాధిస్తుంటే ఇతరులు బాధపడుతుంటే చూసి ఆనందించే తరహా హాస్యాన్ని (బ్యాడ్‌ టేస్ట్‌ హ్యూమర్‌ ను / అపహాస్యాలను) ఇష్టపడుతుంటారు. 
4. అందరి ముందూ మాట్లాడే సమయంలో పాటించాల్సిన నియమాలు పాటించకపోవడం వంటివి చేస్తుంటారు. ఉదాహరణకు  మాట్లాడే సమయంలో విచక్షణ పాటించకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం, పిల్లల ముందు మాట్లాడకుండా ఉండాల్సినవి కూడా మాట్లాడటం, వారి ముందర  ఉచ్చరించకుండా ఉండాల్సిన అవాచ్యాలను, అశ్లీల  పదాలను పలుకుతుంటారు. 
5. అన్నింటికంటే ముఖ్యంగా ఇవ్వకూడని వారికి ఇష్టం వచ్చినంత పెద్దమొత్తంలో డబ్బులు ఇస్తుంటారు. ఇలా చేయడం ద్వారా కొన్ని సమస్యల్లోనూ చిక్కుకుంటుంటారు. కాబట్టి ఓ వయసు దాటక ఇవన్నీ అసంకల్పితంగానూ, చాలా ఎక్కువగానూ చేస్తూ ఉంటే... ఎందుకైనా మంచిది... ఒకసారి డాక్టర్‌ / న్యూరాలజిస్ట్‌కు చూపించడం చాలా మేలు చేసే అంశం.  

మరిన్ని వార్తలు