ట్రెండ్‌: కుటుంబాలకు రీల్స్‌ గండం

15 Nov, 2022 00:47 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

33,500 మంది ఫాలోయెర్ల వల్ల ఒక గృహిణి ప్రాణం పోయింది. తమిళనాడులో తాజాగా ఈ ఘటన జరిగింది. ఫాలోయెర్లు పెరగడంతో రీల్స్‌ చేయడంలో పడి ఇంటిని పట్టించుకోని
భార్యను క్షణికోద్రేకంలో భర్త కడతేర్చాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో మహిళ రీల్స్‌ వద్దన్నందుకు తన అన్నలిద్దరి మీదా దాడి చేసి పోలీస్‌ స్టేషన్‌ చేరింది. రీల్స్‌ అనేవి మహిళల ప్రతిభను వ్యక్తం చేసే సోషల్‌ మీడియా సాధనాలుగా ఉన్నాయి. కాని ఏ ప్రతిభా లేకపోయినా కేవలం ఫాలోయెర్ల కోసం వెర్రిమొర్రి రీల్స్‌ చేసే మహిళల వల్ల కుటుంబాలకు గండాలు వస్తున్నాయి. సోషల్‌ మీడియా అడిక్షన్‌ గురించి చైతన్యం రావాల్సిన సందర్భం వచ్చేసింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ చేస్తే ఫాలోయెర్స్‌ వస్తారు. ఆదాయం కూడా వస్తుంది. 2000 మంది ఫాలోయెర్స్‌ వస్తే ‘ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌’గా గుర్తింపబడతారు. వీరు చేసిన రీల్స్‌ నెల రోజుల్లో 1000 మంది చూస్తే వీరికి బోనస్‌లు వస్తాయి. 10వేల మంది ఫాలోయెర్స్‌ ఉంటే ఒక స్థాయి... లక్ష దాటితే మరో స్థాయి. ఆ తర్వాత ప్రచారకర్తలే ఈ ఇన్‌ఫ్లూయెన్సర్లతో ఉత్పత్తులకు ప్రచారం చేయించుకుంటారు. రకరకాల పద్ధతుల్లో ఆదాయం వస్తుంది కూడా.

తమ ప్రతిభతో, నైపుణ్యాలతో ఈ రీల్స్‌ ద్వారా గుర్తింపు, గౌరవం పొందుతున్న స్త్రీలు ఎందరో ఉన్నారు. ఫిట్‌నెస్, లైఫ్‌స్టయిల్, స్టాండ్‌ అప్‌ కామెడీ, మిమిక్రీ, హెల్త్, యోగా... ఇలా అనేక రంగాల్లో నైపుణ్యం ఉండి వాటి ద్వారా రీల్స్‌ చేస్తూ సోషల్‌ మీడియా సెలబ్రిటీలుగా మారుతారు. ఈ రంగంలో కొందరు సగటు గృహిణులు, మహిళలు కూడా తమ వంటల ద్వారానో, చమత్కారమైన మాటల ద్వారానో, నృత్యాల ద్వారానో గుర్తింపు పొందుతున్నారు. అయితే తమకు ఉన్న చిన్నపాటి ప్రతిభకు కూడా కామెంట్లు, ఫాలోయెర్లు వస్తుండటంతో ఇక అదే లోకంగా మారిన వారు అవస్థలు తెచ్చుకుంటున్నారు. ఇరవై నాలుగ్గంటలు ఫోన్‌లో మునిగి, రీల్స్‌ తయారీలో నిమగ్నమయ్యి, కుటుంబాలలో కలతలకు కారణం అవుతున్నారు. ఇప్పుడు తమిళనాడులో జరిగింది అదే.

సాధించానని భ్రమసి
చెన్నైకి 400 కిలోమీటర్ల దూరంలో ఉండే తిరుపూరులో అమృతలింగం (38) లోకల్‌ మార్కెట్లో హమాలీగా పని చేస్తాడు. అతడి భార్య చిత్ర చిన్న గార్మెంట్‌ ఫ్యాక్టరీలో పని చేస్తుంది. ముందు టిక్‌ టాక్,  ఆ తర్వాత ఇన్‌స్టాలో రీల్స్‌ చేయడం మొదలుపెట్టిన చిత్ర దాదాపు 35 వేల మంది ఫాలోయెర్స్‌ను సంపాదించుకుంది. దాంతో ఆమె అన్ని పనులు మాని ఈ రీల్స్‌ తయారీలో పడింది. అమృతలింగంకు ఇది నచ్చలేదు.

ఇంటిని పట్టించుకోమని గొడవకు దిగేవాడు. అయితే రీల్స్‌ కింద వచ్చే కామెంట్స్‌ లో పొగడ్తలు నిండేసరికి చిత్ర తన ప్రతిభకు సినీ పరిశ్రమే సరైనదని భర్త మాట వినకుండా మూడు నెలల క్రితం చెన్నై చేరి వేషాలకు ప్రయత్నించసాగింది. వారం క్రితం ఒక ఫంక్షన్‌కు సొంత ఊరు వచ్చి తిరిగి చెన్నై బయలుదేరుతుండేసరికి అమృతలింగం గట్టిగా అడ్డు పడ్డాడు. చెన్నై వెళ్లకూడదని పట్టుపట్టాడు. ఇద్దరికీ మాటా మాటా పెరిగింది. క్షణికావేశంలో అతను చీరతో ఆమె మెడను బిగించాడు. స్పృహ తప్పేసరికి భయపడి వదిలేశాడు. కాని అప్పటికే ఆమె చనిపోయింది.

వద్దు అంటే తిరుగుబాటు
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆర్తి రాజ్‌పుత్‌ అనే యువతి ఈ రీల్స్‌కు బాగా అడిక్ట్‌ అయ్యింది. ఆమెకు ఇంటి విషయాలే పట్టడం లేదని సోదరులు జైకిషన్, ఆకాష్‌ అభ్యంతరం తెలిపారు. దాంతో ఆమె ఆ ఇద్దరు సోదరులపై దాడి చేసింది. వారు భయపడి పోలీసులను పిలిస్తే స్టేషన్‌లో మళ్లీ సిబ్బంది ఎదుటే సోదరులను కొట్టింది. అంతే కాదు... అడ్డుపడ్డ మహిళా పోలీసులపై దాడి చేసింది. దాంతో ఆమె కటకటాలు లెక్కించే స్థితికి వెళ్లింది.

బతికున్నా లేనట్టే
సోషల్‌ మీడియా అడిక్షన్‌ దాదాపుగా మనిషిని జీవచ్ఛవంలా మారుస్తాయని నిపుణులైన మానసిక వైద్యులు అంటున్నారు. స్త్రీలు, పురుషులు, పిల్లలు అనే తేడా లేకుండా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ ఫేస్‌బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్, వాట్సప్‌లకు అడిక్ట్‌ అవుతున్నారు. లైక్‌లు, షేర్లు, సబ్‌స్క్రయిబ్‌లలో పడి చదువు, ఇంటి పని, బాధ్యతలు, లక్ష్యాలు మర్చిపోతున్నారు. భార్యాభర్తల్లో ఎవరు ఎడిక్ట్‌ అయినా కాపురంలో కలతలు, జగడాలు వస్తున్నాయి. పిల్లలు చదువును నష్టపోతున్నారు. ఫోన్‌ చూడొద్దంటే అలిగి ఇళ్ల నుంచి పిల్లలు పారిపోతున్నారు.

అపరిచితులతో ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. లంఖణం దివ్యౌషధం అని పెద్దలు అన్నారు. సోషల్‌ మీడియా కు సంబంధించిన లంఖణాలు పెట్టడం మంచిదని నిపుణులు కూడా అంటున్నారు. రోజులో కొన్ని గంటలు ఫోన్‌ ముట్టుకోకుండా వారంలో ఒక రోజు సోషల్‌ మీడియా చూడకుండా పేపర్లు, పుస్తకాలు, స్నేహితులపై ధ్యాస మళ్లించాలని నిపుణులు సూచిస్తున్నారు. కుటుంబంలో అందరి సమ్మతంతో గౌరవాన్ని, ఆదాయాన్ని ఇచ్చే విధంగా మీడియాను వాడితే కలత లు రావు. కాని కుటుంబ సభ్యుల విముఖతను లెక్క చేయకుండా సోషల్‌ మీడియాకే ప్రాధాన్యం ఇస్తుంటే ఇబ్బందులు తప్పవు. తస్మాత్‌ జాగ్రత్త.
 

మరిన్ని వార్తలు