ఈత రావాలి ప్రాణం నిలవాలి

15 Jul, 2023 00:23 IST|Sakshi

వరద సమయం 

ఇది వానల కాలం. వరదల కాలం. కేరళలో ఈ సమయంలో పడవ ప్రమాదాలు సాధారణం. ప్రమాద తీవ్రత కంటే ఈత రాకపోవడం వల్ల జనం మరణిస్తున్నారని సాజి వెలస్సిరల్‌ అనే వ్యక్తికి అనిపించింది. చిన్న ఫర్నిచర్‌ షాపు నడుపుకునే ఇతడు గొప్ప ఈతగాడు కూడా. ఇంకేముంది. ఊళ్లో ఉన్న పెరియార్‌ నదిని స్విమ్మింగ్‌ పూల్‌గా చేసుకుని అందులోనే ఈత నేర్పుతున్నాడు. ఇప్పటికి 6000 మంది ఈత నేర్చుకున్నారు. వీళ్లందరి ప్రాణాలను నీళ్ల నుంచి ఇతడు రక్షించినట్టే. ప్రతి చోటా ఇలాంటి వాళ్లుంటే వేల ప్రాణాలు బతుకుతాయి.


గత మే నెలలో కేరళలోని తానురు దగ్గర బ్యాక్‌ వాటర్స్‌లో పడవ మునిగి 27 మంది చనిపోయారు. ‘వాళ్లకు ఈత వచ్చి ఉంటే అందరూ బతికి ఉండేవారు. తుఫాను లేదు.. సముద్రమూ కాదు. ఈత వచ్చి ఉంటే పడవ బోల్తా పడినా ఆ బ్యాక్‌ వాటర్స్‌లో హాయిగా ఈదుకుంటూ గట్టెక్కవచ్చు. లేదా సహాయకబృందాలు చేరేవరకూ మెల్లగా తేలుతూనే ఉండొచ్చు’ అంటాడు సాజి వెలస్సిరల్‌.

ఈ ప్రమాదం కాదు ఇరవై ఏళ్ల క్రితం ఇతడు చూసిన ప్రమాదమే ఇతడి మనసు మార్చింది. కుమర్‌కోమ్‌లో పడవ బోల్తా పడి 29 మంది చనిపోయారు. అప్పుడు సాజి యువకుడు. తండ్రి మంచి స్విమ్మర్‌ కావడంతో ఆయన నుంచి ఈత నేర్చుకుని అద్భుతంగా ఈదుతున్నాడు. ఆ ప్రమాదంలో చనిపోయిన వారికి ఈత వచ్చి ఉంటే ప్రాణాలు మిగిలి ఉండేవి అనిపించింది. ‘ఈత ఎందుకు రాదు’ అని ప్రశ్నించుకున్నాడు. ‘నేర్పేవారు లేకపోవడం వల్ల’ అనే జవాబు వచ్చింది. ‘నేనెందుకు నేర్పకూడదు’ అనుకున్నాడు. అలా అతని ఈత సేవ మొదలైంది.

పెరియార్‌ నదిలో
సాజి వెలస్సిరల్‌ అలువా అనే చిన్న ఊరిలో ఉంటాడు. ఇది ఎర్నాకుళంకు 40 నిమిషాల దూరం. ఆ ఊళ్లో చిన్న ఫర్నీచర్‌ షాపు నడుపుకుంటూ జీవిస్తుంటాడు సాజి. అయితే అదే ఊరి నుంచి పెరియార్‌ నది ప్రవహిస్తూ ఉంటుంది. దాదాపు నిలువ నీరులా ఉంటుంది ప్రవాహం. ‘దీనినే స్విమ్మింగ్‌పూల్‌గా చేసుకుని ఈత నేర్పిస్తాను’ అని నిర్ణయించుకున్నాడు సాజి. ‘ముందు నా కుటుంబం నుంచే మొదలెట్టాలి’ అనుకుని తన ఇద్దరు పిల్లల్ని, స్నేహితుడి పిల్లల్ని తీసుకుని నదిలో ఈత నేర్పడం మొదలెట్టాడు. మూడు వారాల్లోనే పిల్లలు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు (780 మీటర్లు) ఈదడం నేర్చుకున్నారు. దాంతో ఊరి దృష్టి సాజి మీద పడింది. అతడి దగ్గర ఈత నేర్చుకోవడానికి అందరూ క్యూ కట్టారు.

వెలస్సిరల్‌ రివర్‌ స్విమ్మింగ్‌ క్లబ్‌
నేర్చుకునేవారు పెరిగే కొద్దీ సాజికి ఉత్సాహం వచ్చింది. తన ఈత కేంద్రానికి వెలస్సిరల్‌ రివర్‌ స్విమ్మింగ్‌ క్లబ్‌ అనే పేరు పెట్టాడు. ప్రత్యేక దినాల్లో, పండగ వేళల్లో సామూహిక ఈత కార్యక్రమాలు నిర్వహిస్తాడు. నది ఈదే పోటీలు నిర్వహిస్తాడు. విశేషం ఏమిటంటే 70 ఏళ్ల ఆరిఫా అనే మహిళ ఇతని దగ్గర ఈత నేర్చుకుని చేతులు వెనక్కు కట్టుకుని మరీ ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు ఈదింది. శారీరకమైన అవకరాలు ఉన్నవారికి కూడా ఈత నేర్పే టెక్నిక్స్‌ ఇతని దగ్గర ఉన్నాయి. ఇతను ఈత నేర్పేటప్పుడు ఒక అంబులెన్సు ఒడ్డున, నదిలో రక్షణకు ఒక పడవ సిద్ధంగా ఉంటాయి.
‘ఈత నేర్వాలి. ప్రాణాలు నిలుపుకోవాలి. ప్రమాదవశాత్తు నీళ్లల్లో పడితే ఈదలేక మరణించడం దురదృష్టకరం’ అంటాడు సాజి. అతని హెచ్చరిక వినదగ్గది.

మరిన్ని వార్తలు