●చేతికందనిబోరు | Sakshi
Sakshi News home page

●చేతికందనిబోరు

Published Sat, Jul 15 2023 12:26 AM

- - Sakshi

జర్నలిస్టుల పిల్లలకు

ఉచిత విద్య

రాప్తాడురూరల్‌: జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉచిత విద్యను అమలు చేసేలా కలెక్టర్‌ గౌతమి ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల ప్రతిని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.సాయిరామ్‌ శుక్రవారం ఏపీయూడబ్ల్యూజే జిల్లా కన్వీనర్‌ పయ్యావుల ప్రవీణ్‌, చౌడప్పకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగేళ్లుగా కరోనా, ఇతర కారణాలతో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య ఆగిపోయిందన్నారు. కలెక్టర్‌ గౌతమి, విద్యాశాఖ అధికారి సాయిరామ్‌ను కలిసి జర్నలిస్టుల పరిస్థితిని వివరించి ఉచిత విద్య అందే విధంగా చూడాలని కోరామన్నారు. ఈ క్రమంలో 2023– 24 సంవత్సరానికి జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించే విధంగా ఉత్తర్వులు ఇచ్చారన్నారు. కలెక్టర్‌, డీఈఓకు కృతజ్ఞతలు తెలియజేశారు.

యువకుడి ఆత్మహత్య

అనంతపురం శ్రీకంఠంసర్కిల్‌: నగరంలోని రంగస్వామినగర్‌లో నివాసం ఉంటున్న మోహన్‌బాబు (24) అనే యువకుడు శుక్రవారం ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. త్రీటౌన్‌ సీఐ ధరణీకిశోర్‌ వివరాల మేరకు... మోహన్‌బాబు తల్లి 20 ఏళ్ల క్రితం చనిపోయింది. దీంతో మృతుడు మోహన్‌బాబు అవ్వ వద్దే ఉంటున్నాడు. అయితే ఎవరితో మాట్లాడటానికి మోహన్‌బాబు పెద్దగా ఆసక్తి చూపేవాడు కాదు. అయితే ఏం జరిగిందో తెలియదు గాని ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్మ చేసుకున్నాడు. మృతుడి అవ్వ ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు సీఐ ధరణీకిశోర్‌ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ఇసుక ట్రాక్టర్‌ పట్టివేత

బుక్కరాయసముద్రం నుంచి అనంతపురం నగరానికి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను శుక్రవారం త్రీటౌన్‌ పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు ట్రాక్టరును సీజ్‌ చేసినట్లు సీఐ ధరణీ కిశోర్‌ తెలిపారు. బోయకొట్టాలకు చెందిన వ్యక్తులు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు.

హత్యాయత్నం

కేసులో వ్యక్తి అరెస్ట్‌

అనంతపురం శ్రీకంఠంసర్కిల్‌: ఆస్తి కోసం అన్న కుమారుడిని కడతేర్చాలని చూసిన నిందితుడిని నాల్గవ పట్టణ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. సీఐ ప్రతాప్‌రెడ్డి తెలిపిన వివరాలమేరకు... నాలుగు రోజుల క్రితం స్థానిక రామ్‌నగర్‌ రైల్వేగేటు సమీపంలోని మద్యం దుకాణం వద్ద నాయుడు అనే వ్యక్తిని అతని చిన్నాన్న చంద్రశేఖరనాయుడు మాటల్లో పెట్టి పిడిబాకుతో దాడి చేశాడు. తర్వాత చంద్రశేఖరనాయుడు పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామన్నారు. స్థానిక రుద్రంపేట కూడలిలో చంద్రశేఖరనాయుడు ఉన్నట్లు సమాచారం రావడంతో అతన్ని పట్టుకున్నామన్నారు. నాయుడు ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, పరిస్థితి అదుపులోనే ఉందన్నారు.

చెలరేగిన అనంతపురం జట్టు

అనంతపురం: అంతర జిల్లా సీనియర్‌ మల్టీ డే మ్యాచ్‌లో భాగంగా శుక్రవారం జరిగిన అనంతపురం, కర్నూలు జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. అనంతపురం జట్టు 133 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 697 భారీ పరుగులు సాధించింది. డీబీ ప్రశాంత్‌కుమార్‌ 156 పరుగులు (20 ఫోర్లు, 3 సిక్సర్లు), పి. గిరినాథరెడ్డి 152 పరుగులు (13 ఫోర్లు, 7 సిక్సర్లు), బి.యోగానంద 128 పరుగులు (20 ఫోర్లు) , జి. సంపత్‌ కుమార్‌ 86 (8 ఫోర్లు, మూడు సిక్సర్లు) పరుగులతో సమిష్టిగా రాణించారు. కర్నూలు జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. అనంతపురం జట్టు 540 పరుగుల ఆధిక్యంలో ఉంది.

విదేశీ విద్యార్థులకు ఆహ్వానం

అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురంలో విదేశీ విద్యార్థులకు బీటెక్‌, ఎంటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వీసీ జింకా రంగజనార్దన తెలిపారు. బీటెక్‌ (సివిల్‌, ఈఈఈ, మెకానికల్‌, ఈసీఈ, సీఎస్‌ఈ, కెమికల్‌, ఫుడ్‌ టెక్నాలజీ) , ఎంటెక్‌ (స్ట్రక్చరల్‌, బ్రిడ్జెస్‌ అండ్‌ టన్నెల్స్‌, ఎలక్ట్రికల్‌ పవర్‌ సిస్టమ్స్‌, పవర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ డ్రైవ్స్‌, రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండీషన్‌, అడ్వాన్స్‌డ్‌ మ్యాన్‌ఫ్యాక్చురింగ్‌, డిజిటల్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ సిస్టమ్స్‌, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌, కంప్యూటర్‌ సైన్సెస్‌, నానో టెక్నాలజీ) , ఎంసీఏ, ఎంబీఏ, కోర్సుల్లో విదేశీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సార్క్‌ దేశాల విద్యార్థులకు 30 శాతం కోర్సు ఫీజులో రాయితీ, 40 శాతం డెవలప్‌మెంట్‌ ఫీజు రాయితీ లభిస్తుంది. పూర్తి వివరాలకు జేఎన్‌టీయూ అనంతపురం వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని సూచించారు.

18న మినీ ఉద్యోగ మేళా

అనంతపురం: ఏపీ స్కిల్‌డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కార్యాలయం, అనంతపురంలో 18న నిరుద్యోగులకు మినీ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్థి అధికారి ఎల్‌. ఆనంద్‌ రాజ్‌కుమార్‌ తెలిపారు. అనంతపురంలోని జెరీకార్ట్‌ కంపెనీలో బీపీఓ, పెనుకొండ కియా కంపెనీలో న్యాప్స్‌ ట్రైనీ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామన్నారు. వివరాలకు 8317520929 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

1/4

2/4

3/4

4/4

Advertisement
Advertisement