Kerala: 89 ఏళ్ల బామ్మ.. పూర్వీకుల ఇల్లును డే కేర్‌ సెంటర్‌గా మార్చేసి! స్థానిక యువతులకు ఉపాధితో పాటు..

29 Oct, 2022 13:48 IST|Sakshi
తను ఏర్పాటుచేసిన సెంటర్‌లో ఇతర సభ్యులతో కలిసి... (PC: BetterIndia))

అపూర్వమైన ఆలోచన

Manavodaya Pakalveedu- Kerala: ‘వయసు పైబడటంతో ఏ పనీ మునుపటి ఉత్సాహంతో చేయలేకపోతున్నాను’ అనే మాట పెద్దల నోట తరచూ వినిపిస్తుంటుంది. అయితే, కేరళలోని కొట్టాయంలో ఉంటున్న 89 ఏళ్ల ఈ బామ్మను చూస్తే మాత్రం మనమెందుకు ఇలాంటి ఆలోచన చేయలేం అనిపించక మానదు. 

ఇటీవల 89వ పుట్టినరోజు వేడుకను తనలాంటి వయసు పైబడిన వారి మధ్య ఆనందంగా జరుపుకున్న ఈ బామ్మ పేరు కరుస్సెరిల్‌ తంకమ్మ. ఐదేళ్ల క్రితం ఆమె తన పూర్వీకుల ఇంటి తలుపులను ఒంటరి వృద్ధ మహిళల సంరక్షణ కోసం వీరిలో ఉత్సాహం నింపడానికి తెరిచింది. 

ఒంటరితనం నుంచి.. 
ఒక వయసు దాటాక పిల్లలు స్థిరపడతారు, భాగస్వామి దూరమవుతారు. ఇలాంటి పరిస్థితే తంకమ్మ జీవితంలోనూ జరిగింది. ఆమె రిటైర్డ్‌ హిందీ టీచర్‌. ఆమె ఇద్దరు పిల్లలు పట్టణాల్లో స్థిరపడ్డారు. భర్త ఎనిమిదేళ్ల క్రితం మరణించాడు. కొద్దిరోజులు పిల్లల దగ్గర రోజులు గడిపింది. పిల్లలు ఉద్యోగాల్లో బిజీ. మనవలు, మనవరాళ్లు చదువుల్లో బిజీ.

‘ఈ వయసులో మా రోజులు ఒంటరిగానే గడుస్తుంటాయి. కానీ, మేము కోరుకునేది మరొకరి కంపెనీ మాత్రమే. బిజీగా ఉన్నవారు అన్ని వేళలా అందుబాటులో ఉండలేరు. ఇలా రోజులు గడుస్తున్నప్పుడే వయసు పైబడిన వారి రోజులను ఉత్సాహంగా మార్చడానికి, వారికి నచ్చిన పనుల్లో వారిని నిమగ్నమయ్యేలా చేయాలనే ఆలోచన వచ్చింది’ అని చెబుతారు తంకమ్మ.

ఆమెకు కొట్టాయంలో వారసత్వంగా వచ్చిన 200 ఏళ్ల నాటి వారి పూర్వీకుల ఇల్లు ఉంది. ఆ ఇంటిని వృద్ధుల కోసం డే కేర్‌ సెంటర్‌గా ఉపయోగించాలనుకుంది. దీనివల్ల స్థానిక యువతులకు ఉపాధి కూడా కల్పించవచ్చు అనుకుంది. దీనికి ఆమె పిల్లలు శ్రీకుమార్, సతీష్‌ కుమార్, గీత మద్దతు పలికారు. వారు ఆ ఇంటి పునరుద్ధరణకు సహకరించారు. దీంతోపాటు ఆమె చొరవ గురించి ప్రచారం చేశారు.

 చేయదగిన పనులు
‘మా ప్రాంతంలో అమ్మ పరిచయం అవసరం లేదు‘ అని న్యూయార్క్‌ ఆధారిత సంస్థలో చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ అయిన శ్రీ కుమార్‌ చెబుతారు. ‘ఆమె టీచర్‌ కాబట్టి, ఆమె మనకంటే ఎక్కువమందితో కనెక్ట్‌ అయ్యింది. ఆమె సంపాదన ఇతర మహిళల సాధికారత కోసం ఖర్చుపెట్టడానికి ఇష్టపడే వ్యక్తి. ఈ వయస్సులో కూడా, ఆమె ఈ డే కేర్‌ను విస్తరించడానికి కొత్త ఆలోచనలు చేస్తుంది’ అని ప్రశంసిస్తారు. 

ఐదుగురు ఉద్యోగులు
కొట్టాయంలోని మానవోదయ పాకాలవీడు అని పిలువబడే ఈ ఇల్లు అధికారికంగా స్వచ్ఛంద సంస్థగా నమోదు చేయబడింది. అక్టోబర్‌ 11, 2017న ఈ ఇంటినుంచి కార్యకలాపాలు ప్రారంభించింది ఈ బామ్మ. ఇక్కడ రోజువారీ కార్యకలాపాలు నిర్వహించడం కోసం ఐదుగురు ఉద్యోగులు డే కేర్‌లో  పనిచేస్తున్నారు.

ఇక్కడికి వచ్చినవారు క్యాండిల్‌ లైట్లు, అగరుబత్తులు, పేపర్‌ బ్యాగులు, డిటర్జెంట్లు, క్లీనింగ్‌ లోషన్‌లు తయారు చేస్తారు. తయారు చేసిన ఉత్పత్తులను డే కేర్‌ సమీపంలోని ఒక దుకాణం ద్వారా విక్రయిస్తారు. ఆ ఆదాయం పూర్తిగా ఈ డే కేర్‌ కొనసాగించడానికి ఉపయోగిస్తారు. 

ఉదయం 8 గంటలకు మొదలు
‘ఇంట్లో చేయగల కుట్టుపనిపై ఉచిత కోర్సు కూడా ఇక్కడ లభిస్తుంది. డే కేర్‌లోని ఉద్యోగులందరూ యువతులు. వీరిలో ఇద్దరు సోషల్‌ వర్క్‌లో మాస్టర్స్‌ పూర్తి చేశారు’ అని చెప్పే తంకమ్మ కుమార్తె గీత ప్రతి వారాంతంలో ఇంటికి వెళ్లి తల్లి చేసే కార్యకలాపాలకు సహకరిస్తుంటుంది. పాకలవీడులో ప్రతి రోజూ ఉదయం 8 గంటలకు వృద్ధులను వారి ఇళ్ల నుండి డే కేర్‌ వాహనం ద్వారా పికప్‌ చేయడంతో ప్రారంభమవుతుంది.

మొదట ప్రార్థన, తర్వాత ధ్యానం, యోగా సెషన్‌లో వార్తాపత్రిక చదవడం, అల్పాహారం మొదలవుతుంది. ఆ తర్వాత వారి ఇష్టం మేరకు చేయదగిన పనులను ఎంచుకొని, ఇతరులతో మాట్లాడటం, చదవడం, వ్యవసాయం లేదా ఆటల్లో పాల్గొనవచ్చు. సాయంత్రం కలిసి నడక, కాఫీ తర్వాత ఐదు గంటలకు వారిని వారి వారి ఇళ్లకు తీసుకు వెళతారు.

ఇక్కడ ఉన్న వారంతా తమ పిల్లలు విధుల్లోకి వెళ్లిన తర్వాత ఇంట్లో ఒంటరిగా గడిపే స్త్రీలు. వారు ఆరోగ్యాన్ని కాపాడేందుకు, అత్యవసర పరిస్థితుల్లో సహాయం చేయడానికి, ఇక్కడ హెల్త్‌  క్లినిక్, ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. పగటి పూట డాక్టర్, నర్సు, ల్యాబ్‌ టెక్నీషియన్‌ అందుబాటులో ఉంటారు. కొత్త వెంచర్‌ను ప్రారంభించడానికి ఈ పనులు ఎప్పుడూ అడ్డు కాదం’టారు తంకమ్మ. 

చదవండి: Jyotsna Cheruvu: స్థిరత్వమే సక్సెస్‌ సూత్రం
  

మరిన్ని వార్తలు