Lecturer Madhu Inspiring Story: చదువుకుంటానంటే అత్తగారు వద్దన్నారు.. నానా మాటలు అన్నారు, కానీ ఆరోజు

5 Jul, 2023 10:31 IST|Sakshi

పిల్లల చదువుల కోసం ఇళ్లలో పాచిపనులు చేసిన మధు ఇప్పుడు కాలేజీలో పొలిటికల్‌ సైన్స్‌ లెక్చరర్‌గా పాఠాలు చెబుతోంది. ఒకప్పుడు ఇంగ్లిష్‌ చదువులు మీరేం  చదువుతారని పిల్లలకు అడ్మిషన్‌ ఇవ్వలేదు. అలాంటి ఆమె పిల్లలు ఇప్పుడు ప్రతిష్టాత్మక సంస్థల్లో ఉన్నత విద్యను కొనసాగిస్తున్నారు. ఈ విజయం ఒక్కరోజుతో రాలేదు. ప్రతిరోజూ పోరాటమే అని వివరిస్తారు రాజస్థాని భిల్వారా నివాసి మధు. ఆమె గురించి అడిగితే సక్సెస్‌ని ఏ విధంగానైనా కష్టపడి సాధించుకోవచ్చు అని చెబుతుంది.

‘‘మేం ఆరు మంది తోబుట్టువులం. మా నాన్న చనిపోయినప్పుడు నాకు నాలుగేళ్లు. ఎన్నో ఇక్కట్ల మధ్య పెరిగాను. ఇంటర్మీడియెట్‌ పూర్తయ్యాక పెళ్లయింది. నా భర్త ఒక కంపెనీలో వర్కర్‌గా పనిచేసేవాడు. అతని జీతం ఇంటి అవసరాలకు ఏ మాత్రం సరిపోయేది కాదు. పిల్లలు పుట్టాక ఇంకా సమస్యలు పెరిగాయి. దీంతో కుట్టుపని మొదలు పెట్టాను. కొంత కాలానికి మా ఆయనకు కీళ్లనొప్పులు వచ్చి, ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఆయన చేస్తున్న పనిని వదిలేయాల్సి వచ్చింది. దీంతో ఇంటి ఆర్థిక పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారింది.

ఈ కష్టకాలంలో దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్‌ వారి స్కూల్‌కు దగ్గరలో కుట్టుమిషన్‌ పెట్టుకోవడానికి ప్లేస్‌ ఇచ్చాడు. అక్కడ కూర్చొని కుట్టుపని చేసేదాన్ని. అక్కడ బ్యాగులు, కవర్లు తయారు చేయడం మొదలుపెట్టినప్పుడు, ఆ స్కూల్‌ టీచర్‌ ఒకరు నేను చాలా త్వరగా వర్క్‌ నేర్చుకుంటానని గమనించారు. నా పిల్లలు ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకోవాలని కాన్వెంట్‌ స్కూల్‌లో చేర్పించడానికి వెళితే, ‘మీరు చదువుకోలేదు, స్కూల్‌ ఫీజులు కూడా కట్టలేరు, అడ్మిషన్‌ ఇవ్వలేం’ అన్నారు. ఈ విషయం నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. 

ప్రభుత్వ స్కూల్‌ ప్రిన్సిపల్‌
నేను కుట్టుపని చేస్తున్నప్పుడు బ్యాగుల తయారీ గురించి తెలుసుకోవడానికి ప్రభుత్వ స్కూల్‌ ప్రిన్సిపల్‌ వచ్చేవారు. ఆ సమయంలో పిల్లలతోపాటు నన్ను కూడా చదువుకోమని ప్రోత్సహించారు. అందుకు తగిన దూరవిద్య ఫామ్స్‌ కూడా తెచ్చి ఇచ్చారు. దీంతో పిల్లలు గవర్నమెంట్‌ స్కూల్లో, నేను కుట్టుమిషన్‌ దగ్గరే చదువుకునేదాన్ని. రోజూ ఉదయాన్నే నాలుగిళ్లలో పనులు చేయడం, కుట్టుమిషన్‌పై బ్యాగులు కుట్టడం, ఖాళీ సమయంలో డిగ్రీ పుస్తకాలు చదవడం... ఇలాగే నడిచేది. 

అడ్డంకిగా మారిన పరిస్థితులు
నేను పట్టుదలగా చదువుకోవడం చూసిన గవర్నమెంట్‌ స్కూల్‌ టీచర్లు కూడా నన్ను ప్రోత్సహించేవారు. పిల్లలు కూడా నాకు చదువుకోవడానికి అవకాశం ఇచ్చేవారు. అయితే, మా అత్తగారు ఆపేవారు. మామగారికి మా బంధువులు వెక్కిరిస్తున్నారని చెప్పేవారు. ఆమె సాయంత్రం పూట ఎక్కడకు వెళ్తుందో, ఎక్కడి నుండి వస్తుందో అని విపరీతపు మాటలు రకరకాలుగా మాట్లాడుకునేవారు. కానీ, నా భర్త వాటన్నింటినీ పట్టించుకోవద్దని చెప్పేవారు. నేను ఎం.ఏ. పరీక్షలు రాస్తున్నప్పుడు మా మామగారు చనిపోయారు. దీంతో చదువును వదులుకునే పరిస్థితి వచ్చింది. కానీ, స్కూల్‌ టీచర్‌ శైలజ వచ్చి మా అత్త గారికి నచ్చచెప్పి, నన్ను చదువు కొనసాగించమని ప్రోత్సహించ డంతో ఆ పరిస్థితి నుంచి గట్టెక్కాను.

లెక్చరర్‌గా చేస్తూనే.. 
మొదటిసారి నెట్‌లో అర్హత సాధించడంతో అంతా ఆశ్చర్యపోయారు. పొలిటికల్‌ సైన్స్‌లో ఎం.ఏ. పూర్తిచేసి, పీహెచ్‌డీకి అడ్మిషన్‌ తీసుకున్నాను. పిల్లలు పెద్దవడంతో డబ్బు అవసరం కూడా పెరిగింది. దీంతో పొలిటికల్‌ సైన్స్‌ లెక్చరర్‌గా చేరాను. నెలకు ఆరువేల రూపాయలు వచ్చేవి. వాటితోనే ఇల్లు గడవదని, టైలరింగ్‌ పనులు చేస్తూనే ఉండేదాన్ని. కానీ, మనం అనుకున్నవి అన్నీ జరగవు కదా. మా వారి ఆరోగ్యం మరీ క్షీణించడంతో ట్రీట్‌మెంట్‌ నెలలపాటు కొనసాగింది. దీనిని తట్టుకుంటూనే నా జీవన పోరాటం చేస్తూనే ఉన్నాను.

నా కూతురు ఐఐటీలో సీటు సంపాదించి, మాస్టర్స్‌ కూడా చేసింది. కొడుకు ఇంకా చదువుకుంటున్నాడు. నాలుగిళ్లలో పనిచేసుకునే నేను ఇప్పుడు లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తున్నాను. నా భర్తను అనారోగ్యం నుంచి కాపాడుకున్నాను. పిల్లలు మంచి చదువులు చదువుకుంటూ ఉన్నత అవకాశాలను అందుకుంటున్నారు. త్వరలోనే మంచి ఉద్యోగాల్లో వారిని చూడబోతున్నాను’’ అని ఆనందంగా వివరించే మధు జీవనపోరాటంలో విజయం ఒక్కరోజుతో సాధ్యం కాలేదని, ప్రతిరోజూ కఠోరశ్రమ చేస్తే వచ్చిందని చెబుతోంది మధు.  
 

మరిన్ని వార్తలు