Manjula Pradeep: ఎవరీమె... ఏం చేస్తున్నారు.. ఎందుకీ పోరాటం?

13 Oct, 2021 07:54 IST|Sakshi

చైతన్యం

ఒక్కరు కాదు... అందరూ ఒక్కటై...

‘ఎందుకు ఇన్ని రోజులు ఆగాల్సి వచ్చింది?’... ‘ఇంట్లో వాళ్లకు చెప్పడానికి భయమేసింది. కాస్త ఆలస్యంగా చెప్పాను. ఈ విషయం ఇంకెక్కడా చెప్పకు పరువు పోతుంది అన్నారు. కాని మీ గురించి విన్న తరువాత ధైర్యంగా ముందుకు రావాలనిపించింది. అందుకే వచ్చాను’- ఓ అత్యాచార బాధితురాలు.

పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి మృగాల మీద ఫిర్యాదు చేయడానికి ఆమెకు ధైర్యం చాలలేదు. ఆమె కుటుంబానికేమో  ‘పరువు ఏమైపోతుందో’ అనేది పెద్ద సమస్య అయిపోయింది.  ‘నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఉమెన్‌ లీడర్స్‌’(National Council Of Women Leaders)ను ఆశ్రయించిన ఎంతో మంది బాధితుల్లో ఆమె కూడా ఒకరు.

ఎవరీ ఉమెన్‌ లీడర్స్‌?
‘ఎవరో వస్తారని, ఏదో చేస్తారని చూడకుండా మనలో నుంచే లీడర్స్‌ రావాలి, మనకు జరిగే అన్యాయాలపై పోరాడాలి, హక్కుల చైతన్యాన్ని ఊరువాడకు తీసుకెళ్లాలి’ అనే ఆశయంతో ఏర్పాటైందే నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఉమెన్‌ లీడర్స్‌.

గుజరాత్‌కు చెందిన మంజుల ప్రదీప్‌(Manjula Pradeep) గత మూడు దశాబ్దాలుగా అట్టడుగు వర్గాల మహిళల హక్కుల గురించి పనిచేస్తోంది. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా బాధితులకు అండగా నిలుస్తుంది. ‘ఒక్కరు కాదు...అందరూ ఒక్కటై పోరాడాలి’ అనే నినాదం నుంచే పుట్టిన ‘నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఉమెన్‌ లీడర్స్‌’ ఆర్గనైజేషన్‌కు మంజుల సహ–వ్యవస్థాపకురాలు. ‘ఈ సంస్థ ఏర్పాటుతో నా కల నెరవేరింది’ అంటోంది మంజుల ప్రదీప్‌.

తల్లిని తండ్రి విపరీతంగా హింసించేవాడు
మంజుల కుటుంబం ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి గుజరాత్‌కు వలస వచ్చింది. తన తల్లిని తండ్రి విపరీతంగా హింసించేవాడు. మరోవైపు తాను స్కూల్లో కులవివక్షతను ఎదుర్కొనేది. ఎటు చూసినా బాధలు, అవమానాలు. అందుకే ఆమె ఇప్పుడు బాధితుల గొంతు అయింది. తనలాంటి గొంతులు గట్టిగా వినిపించడానికి వేదిక తయారుకావడంలో ఒకరైంది. మంజుల ప్రదీప్‌ జీవితంపై ‘బ్రోకెన్‌ కెన్‌ హీల్‌: ది లైఫ్‌ అండ్‌ వర్క్‌ ఆఫ్‌ మంజుల ప్రదీప్‌’ అనే పుస్తకం వచ్చింది.

భావన సైతం..
ఆమె నెరవేర్చుకున్న కల ‘నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ వుమెన్‌ లీడర్స్‌’  దేశవ్యాప్తంగా ఎంతోమంది వుమెన్‌ లీడర్స్‌ను తయారుచేసింది, అలాంటి వారిలో ఒకరు గుజరాత్‌కు చెందిన భావన నర్కర్‌. 28 సంవత్సరాల భావన ఎంతోమంది బాధితులకు అండగా నిలిచి, మడమ తిప్పకుండా పోరాడటమే కాదు, తనలాగే ఎంతోమంది ఉమెన్‌ లీడర్స్‌ తయారుకావడానికి ప్రేరణ అయింది.

‘చట్టం, న్యాయం గురించిన విషయాలు తెలిస్తే ప్రశ్నించే ధైర్యం వస్తుంది, పోరాడే స్ఫూర్తి వస్తుంది. ప్రతి ఒక్కరిలో ఒక న్యాయవాది ఉండాలి...’ అంటూ దేశంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ‘బేసిక్‌ లీగల్‌ నాలెడ్జి’ కోసం శిక్షణ ఇస్తుంది నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఉమెన్‌ లీడర్స్‌.

చదవండి: kristin Gray: అమ్మను మించిన అమ్మ

మరిన్ని వార్తలు