Matrimonial Fraud: జాగ్రత్తగా చేరుకున్నావా డియర్‌!

6 May, 2021 12:33 IST|Sakshi

భిన్నాభిప్రాయాల కారణంగా ఇటీవల విడాకులు తీసుకునేవారి సంఖ్య పెరుగుతోంది. ఆ తర్వాత వారు ఒంటరి జీవితాన్ని భరించలేక మళ్లీ పెళ్లి చేసుకోవడానికి మ్యారేజీ బ్యూరో సైట్స్‌ను ఆశ్రయిస్తుంటారు, ఈ సైట్స్‌ ద్వారా ముక్కూ మొఖం తెలియని వారితో పరిచయాలు పెంచుకోవడంతో ఇటీవల మోసపోతున్నవారి సంఖ్యా పెరుగుతోంది. 

వాణి (పేరు మార్చడమైంది) ఉదయం లేస్తూనే ఫోన్‌ చేతిలోకి తీసుకుంది. సురేష్‌ (పేరు మార్చడమైంది) నుంచి వచ్చిన మెసేజ్‌ చూసి నవ్వుకుంటూ తిరుగు రిప్లై ఇచ్చింది. టీ, కాఫీ ముగించేసి, తిరిగి ఫోన్‌ చూస్తే అప్పటికే పాతికకు పైగా మెసేజ్‌లు ఉన్నాయి. తన పట్ల అతను చూపుతున్న శ్రద్ధకు ముచ్చటేసింది వాణికి. రిప్లై మెసేజ్‌ చేసి, ఆఫీసుకు బయల్దేరింది. ఆఫీసులో వర్క్‌ స్టార్ట్‌ చేయబోతుండగా ఫోన్‌. ‘జాగ్రత్తగా చేరుకున్నావా డియర్‌’ అంటూ. ‘ప్రతి అరగంటకు ఒకసారి ఫోన్, పదినిమిషాలకు ఒకసారి మెసేజ్‌ చేసి తన మంచీ చెడు కనుక్కోవడం, తిన్నావా అని అడగడం.. తన జీవితంలోకి సంతోషంలా సురేష్‌ వచ్చాడు అనిపిస్తోంది వాణీకి. ఇంతకు మించిన ఆనందం మరేమీ అక్కర్లేదు.

త్వరలో సురేష్‌ని పెళ్లి చేసుకుంటే అంతా హ్యాపీ..’ అనుకుంటూ పనిలో పడిపోయింది. వాణి తన భర్తతో విభేదాలు వచ్చి విడాకులు తీసుకొని ఏడాదిన్నర అవుతోంది. తల్లిదండ్రులు దూరంగా పల్లెలో ఉంటారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న వాణికి ఆఫీసులో ఉన్నంతసేపు సమయం బాగానే గడిచిపోతుంది. ఇంటికి వెళుతూనే ఒంటరితనం బాధిస్తుంది. రెండవ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడి మ్యాట్రిమోనియల్‌ సైట్‌లో తన వివరాలు ఇచ్చింది. అప్పుడే సురేష్‌ వాణి జీవితంలోకి ఎంటరయ్యాడు. సురేష్‌ మాటలు, తన పట్ల చూపే కేరింగ్‌ వాణికి బాగా నచ్చాయి. నెలరోజులుగా తనకు అసలు టైమ్‌ ఎలా గడుస్తుందో కూడా తెలియనంతగా సురేష్‌కి మానసికంగా దగ్గరైపోయింది. 

నెల తర్వాత ఓ రోజు... 
వాణి పోలీసుస్టేషన్‌కి వెళ్లింది.. ‘సర్, సురేష్‌ మీద ఫిర్యాదు చేయడానికి వచ్చాను. అంటూ కళ్ల నీళ్లు తిరుగుతుండగా జరిగిందంతా చెప్పుకొచ్చింది వాణి. ‘సురేష్‌ కిందటేడాది జూన్‌ 16న మ్యాట్రిమోనియల్‌ సైట్‌ ద్వారా పరిచయమయ్యాడు. తాను హెచ్‌ఎస్‌బిసిలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నానని, తన భార్య 2017లో కారు ప్రమాదంలో చనిపోయిందని చెప్పాడు. అతను న్యూజిలాండ్‌ వెళ్లడానికి కంపెనీ ద్వారా ఆఫర్‌ వచ్చిందని, పాస్‌పోర్ట్, పాన్‌కార్డ్‌ డీటెయిల్స్‌ ఇస్తే టికెట్స్‌ బుక్‌ చేస్తానని చెప్పాడు. మెయిల్‌ ద్వారా ఆ పేపర్స్‌ని అతనికి పంపాను. వీసా ప్రక్రియ మొదలుపెట్టాక, బ్యాంక్‌ స్టేట్మెంట్‌ చూపాల్సి ఉంది.

అందుకు నా పేరుతో ఒక యాప్‌లో అకౌంట్‌ ఓపెన్‌ చేశాడు. ఎలాంటి ట్రాన్సాక్షన్స్‌ చేసినా దాన్నుంచే చేస్తే మంచిదని చెప్పాడు. ముందు నేను కాదన్నాను. కానీ, తనకూ ఆ యాప్‌లో అకౌంట్‌ ఉందని, ఆ వివరాలన్నీ నాకు షేర్‌ చేశాడు. దాంతో నేను పూర్తిగా నమ్మాను. అతను చెప్పిన మొత్తాన్ని అతని యాప్‌ అకౌంట్‌కి సెండ్‌ చేశాను. జూలై 17, 18, 19, 20 నాలుగు రోజుల్లో మూడు లక్షల ఎనభై వేలు నాచేత అతని అకౌంట్‌కు బదిలీ చేయించుకున్నాడు. ఆ తర్వాత అతని వివరాలేవీ తెలియడం లేదు’ అంటూ వాపోయింది వాణి. 

విపరీతమైన కేరింగ్‌
తను తప్ప ఈ ప్రపంచంలో కావల్సినవారెవ్వరూ లేరన్నంతగా నమ్మబలుకుతారు. ప్రతి క్షణం, ప్రతి నిమిషం నేనున్నానంటూ భరోసా మాటలు మాట్లాడుతారు. ఇటీవల 34 ఏళ్ల యువతి మ్యాట్రిమోనియల్‌ సైట్‌ ద్వారా పరిచయం అయిన వ్యక్తికి కష్టం వచ్చిందని, తల్లిదండ్రులను డబ్బు ఇమ్మని వేధించింది. డబ్బులు ఇవ్వకపోతే తను చనిపోతానని బెదిరించింది. 28 లక్షలు ఆ సదరు వ్యక్తి అకౌంట్‌కి దఫదఫాలుగా చెల్లించారు ఆమె తల్లీదండ్రి. ఆ తర్వాత అతని సమాచారం ఎక్కడా లేదు. 

కస్టమ్స్‌ డ్యూటీ అంటూ...
మ్యాట్రిమోనియల్‌ సైట్‌ ద్వారా పరిచయ మైన వ్యక్తిని నమ్మి కమల అనే 46 ఏళ్ల మహిళ రెండు నెలల్లో రూ.16లక్షలు కోల్పోయింది. ‘కాబోయే వరుడు’ విదేశాల్లో ఉన్నాడు. అతను ఖరీదైన డైమండ్‌ నెక్లెస్‌ను బహుమతిగా పంపినట్లు, కస్టమ్‌ డ్యూటీలు చెల్లించాలని ఆమెను ఆకట్టుకున్నాడు. అతని మాటలకు ఆకర్షితురాలైన ఆమె తన ఖాతా నుండి అతను చెప్పిన ఖాతాలో అంత డబ్బూ వేసింది. ఇటీవల 66 ఏళ్ల రిటైర్డ్‌ నర్సు కూడా ఇదేవిధమైన మోసానికి గురైంది. ఒంటరిగా ఉన్న ఆమె విదేశీయుడు అయిన ఫేస్బుక్‌ ఫ్రెండ్‌ పెళ్లి చేసుకుంటాను అంటే నమ్మింది. అతను తన మాటల గారిడీలో పెట్టి పదిహేడున్నర లక్షల రూపాయలు కాజేశాడు. 

నకిలీ ఫ్రొఫైల్స్‌ సృష్టి
కేటుగాళ్లు మ్యాట్రిమోనియల్‌ సైట్‌లలో నకిలీ ప్రొఫైల్స్‌ను సృష్టిస్తారు. ఇతరుల వివరాలను, వారి ఆర్థిక సామర్థ్యాన్ని గమనిస్తారు. వారి మొదటి ప్రాధాన్యత వితంతువులు, విదేశాలలో స్థిరపడాలనుకునే యువతులు. ఇక్కడ గమనించాల్సిందేంటంటే ఉన్నత విద్యావంతులు కూడా ఈ సాధారణ ఉచ్చులో పyì  మోసపోవడం. 

క్లియరెన్స్‌ తప్పనిసరి అంటూ..
విదేశాల్లో ఉన్న తాము పెళ్లి చేసుకుంటామని నమ్మించి, ఖరీదైన బహుమతులు పంపుతున్నామని చెబుతారు. ఆ బహుమతుల ప్యాకేజీ వీడియోలు కూడా తీసి, పంపుతారు.. ఆ వీడియో చూసి నిజమని నమ్ముతారు. రెండు రోజుల్లో విదేశీ మారకం కథను సృష్టిస్తారు. కస్టమ్స్‌ విమానాశ్రయంలో ఆపేశారు. ‘క్లియర్‌ చేయాల్సిన అవసరం ఉంది. అందుకు అత్యవసరంగా డబ్బు అవసరం’ అంటారు. అలాగే, (ఎ) కస్టమ్‌ క్లియరెన్స్‌ సర్టిఫికేట్‌ (బి) మనీలాండరింగ్‌ సర్టిఫికేట్‌ వంటి సాకుతో డబ్బు వసూలు / దోపిడీ చేస్తారు. 

వీడియో చాట్స్‌ చేయరు
► ‘భారతీయ సంప్రదాయం, సంస్కృతి అంటే ఎనలేనంత ఇష్టమని, అవి తెలిసిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు’గా చెబుతారు. వీరి ఇష్టాయిష్టాలను తెలుసుకొని, అవే తమకూ ఇష్టమని నమ్మబలుకుతారు. ‘ఇంతమంచిదానివి, నిన్ను కాదనుకున్న మూర్ఖులు ఎవ్వరూ ఉండరంటూ’ ప్రేమను ఒలకబోస్తారు. 
► వీడియోలు, ఫొటోలు షేర్‌ చేయించుకుంటారు. వాటిని అడ్డుగా పెట్టుకొని బ్లాక్‌మెయిల్‌ చేసి, డబ్బులు లాగుతారు. 
► మ్యారేజ్‌ ఫ్రాడ్‌లో సదరు వ్యక్తులు వీడియో చాట్స్‌ చేయరు. వారి వాయిస్‌ మాత్రమే ఉంటుందని గమనించాలి. 
► ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

– అనీల్‌ రాచమల్ల, 
డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ 
ఎక్స్‌పర్ట్, ఎండ్‌ నౌ
 ఫౌండేషన్‌ ఫౌండర్‌

చదవండి: ప్రధాని పెళ్లి డేట్‌ కొద్ది గంటల క్రితమే ఫిక్స్‌ అయింది!

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు