ఆస్కార్‌ అవార్డు వస్తే అదొక స్ట్రెస్‌

25 Apr, 2021 00:18 IST|Sakshi
యువాన్‌ యు–జంగ్‌

ఏప్రిల్‌ 26న ఆస్కార్‌ అవార్డులు. ’మీనారీ’ ఉత్తమ సహాయనటిగా నామినేట్‌ అయిన 73 ఏళ్ల నటి యువాన్‌ యు–జంగ్‌కి ఆస్కార్‌ వస్తే కనుక దక్షిణ కొరియాకే ఆమె తొలి ఆస్కార్‌ నటి అవుతారు. సాధారణంగా ‘బాఫ్తా’, ’సాగా’ అవార్డులు వచ్చిన కేటగిరీలకు స్కార్‌ కూడా వస్తుంది. యువాన్‌ ఆ రెండూ గెలుచుకున్నారు. ఇక మిగిలింది ఆస్కార్‌. ఒకవేళ తనకు ఆస్కార్‌ వస్తే అది తనకెంతో ‘స్ట్రెస్‌ఫుల్‌’ అవుతుందని ఆమె అంటున్నారు!!

తొంభై ఏళ్లకు పైబడిన ఆస్కార్‌ చరిత్రలో దక్షిణ కొరియా నుంచి ఒక నటి నామినేట్‌ అవడం ఈ ఏడాదే తొలిసారి! 73 ఏళ్ల ఆ నటి యువాన్‌ యు–జంగ్‌. అమెరికన్‌ డ్రామా మూవీ ‘మీనారీ’ నుంచి ఉత్తమ సహాయ నటి కేటగిరీలో ఆమె ఆస్కార్‌ పోటీలో ఉన్నారు. విజేతగా నిలిస్తే దక్షిణ కొరియాలో ఆస్కార్‌ సాధించిన తొలి నటి కూడా యువాన్‌నే అవుతారు. అయితే.. ‘‘విజేతగా నిలవడం సంతోషమే కానీ, విజేతగా నిలబడడం ఒత్తిడితో కూడుకున్న విషయం’’ అని ఆమె అంటున్నారు! అయినా.. తేలని ఫలితం గురించి యువాన్‌ ముందుగానే ఒత్తిడి కొని తెచ్చుకోవడం ఎందుకు? ఎందుకంటే.. ఇప్పటికే ఆమె ‘బాఫ్తా’ (బ్రిటిష్‌ అకాడమీ ఫిల్మ్‌ అవార్డ్స్‌), ‘సాగా’ (స్క్రీన్‌ యాక్టర్స్‌ గిల్డ్‌ అవార్డ్స్‌) లో అదే చిత్రానికి, అదే కేటగిరీలో ఉత్తమ నటిగా అవార్డు పొందారు. ఇక మిగిలింది ఆస్కారే. ఆ రెండిట్లో అవార్డు వస్తే ఇక్కడా వచ్చినట్లేనని ఒక అంచనా ఉంటుంది. ఆ అంచనా ప్రకారం యువాన్‌ ఆస్కార్‌ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

దక్షిణ కొరియాలో సీనియర్‌ సినీ అగ్ర తారగా గుర్తింపు ఉన్న యువాన్‌.. ఉత్తమ చిత్రం కేటగిరీలో ఈ ఏడాది ఆస్కార్‌కు నామినేట్‌ అయిన ‘మీనారీ’ చిత్రంలో అమ్మమ్మగా నటించారు. అమెరికా కల నెరవేర్చుకునేందుకు ఆర్కాన్‌సాస్‌ వలస వచ్చిన ఒక దక్షిణ కొరియా కుటుంబం చుట్టూ తిరిగే కథ మీనారీ. ఆ చిత్రంలో నెరవేరవలసిన ఒక కల ఉంటుంది. యువాన్‌ మాత్రం కనీసం ఆస్కార్‌ ‘నామినేషన్‌ కల’ కూడా కనలేదు. ఇప్పుడిక ఆమె ఏనాడూ కనని ఆస్కార్‌ ‘అవార్డు కల’ నెరవేరడం కోసం ఆమె తప్ప ఆమె అభిమానులంతా ఎదురు చూస్తున్నారు! యువాన్‌ ఐదు దశాబ్దాలుగా సినిమాలలో నటిస్తున్నారు. 1960లలో ఆమె రైజింగ్‌ స్టార్‌. 1971లో వచ్చిన ‘ఉమన్‌ ఆఫ్‌ ఫైర్‌’ చిత్రంలో ఆమె పాత్రకు అనేక అవార్డులు వచ్చాయి.

వందకు పైగా సినిమాలు, లెక్కలేనన్ని టెలీ సీరియళ్లలో నటించారు. ఆమె కెరీర్‌ మొత్తం మీద వచ్చిన అవార్డులను మించి ఈ ఒకటీ రెండేళ్లలోనే సాధించారు! ఆస్కార్‌ కూడా వచ్చేస్తే నటిగా జీవిత సాఫల్యం. అయితే యువాన్‌ అలా అనుకోవడం లేదు. ఆస్కార్‌ బరిలో ఆమెకు పోటీగా మరో ఐదుగురు నటీమణులు ఉన్నారు. ‘‘గెలుస్తానని, గెలవాలనీ ప్రత్యేకంగా నాకైతే ఏమీ లేదు. అభిమానులు కోరుకుంటున్నారు. వారి ఆశ ఫలించి నాకు ఆస్కార్‌ వస్తే అది నాకు అవార్డు కన్నా కూడా ఒత్తిడే అవుతుంది’’ అని నవ్వుతూ అంటున్నారు యువాన్‌. మరింత బాధ్యత పెరిగినట్లు అనిపించడం కావచ్చు ఆ మాటకు అర్థం. వృత్తి పట్ల అంకితభావం ఉన్నవారికే ఇలాంటి ఒత్తిళ్లు ఉంటాయేమో!!

సూన్‌–జా అమ్మమ్మ
‘మీనారీ’ చిత్రంలో అమ్మమ్మ పాత్రలో నటించారు యువాన్‌. ఆ అమ్మమ్మ పేరు సూన్‌–జా. కూతురు, అల్లుడు కోళ్లఫారంలో పని చేస్తుంటారు. కొద్దిగా పొలం కూడా ఉంటుంది. ఆ పంటను అమ్ముకుని జీవిస్తుంటారు. పొలానికి నీళ్లకోసం అల్లుడే సొంతంగా బావి తవ్వుకుంటాడు. ఇద్దరు పిల్లలు. కూతురు, కొడుకు. పెద్దవాళ్లు పనులకు వెళ్లినప్పుడు పిల్లల్ని చూసుకోడానికని యువాన్‌ని పిలిపించుకుంటారు. మనవడి గదిలో ఆమె ఉండేందుకు ఏర్పాట్లు చేస్తారు. మొదట వాడికి అమ్మమ్మ నచ్చదు. అమెరికా అమ్మమ్మలా ఉండదు. అందుకని! మెల్లిగా మాలిమి అవుతాడు. వాడికి గుండె జబ్బు ఉంటుంది. అదొక బెంగగా ఉండేది తల్లిదండ్రులకు. యువాన్‌ వాడిని ఆడించి, పరుగులు తీయించి, వైద్యసహాయం అవసరం లేనంతగా శక్తిమంతుడిని చేస్తుంది.

‘మీనారీ’ (నీటి మొక్క) ల పెంపకం గురించి, వాటి ప్రయోజనాల గురించి మనవడికి చెబుతుంటుంది. మరోవైపు.. అల్లుడు తవ్విన పంట బావి ఎండిపోతుంది. ఆర్థిక ఇబ్బందులు మొదలవుతాయి. భార్యాభర్తలు విడిపోయే వరకు వస్తుంది. ఆ క్రమంలో యువాన్‌కు స్ట్రోక్‌ వస్తుంది. ఆరోగ్యం మెరుగయ్యాక కూడా కదల్లేని స్థితిలో ఉంటుంది. ఓ రోజు అకస్మాత్తుగా వీళ్ల పంట ఉన్న గిడ్డంగికి నిప్పు అంటుకుని యువాన్‌ ఆ అగ్ని ప్రమాదంలో చిక్కుకుంటుంది. అప్పటికే విడిపోయే ఏర్పాట్లలో ఉన్న అల్లుడు, కూతురు కలిసికట్టుగా వచ్చి ఆమెను కాపాడతారు. ‘జీవితం అన్నాక ఒడిదుడుకులు ఉంటాయి. అయినా ముందుకు వెళ్లాలి.. మీనారీ మొక్కలు ప్రతికూల పరిస్థితుల్లోనూ గుబురుగా పెరిగిన విధంగా..’ అనే సందేశాన్ని యూవాన్‌ పాత్రతో దర్శకుడు ఇప్పించారని చిత్ర సమీక్షకులు భావిస్తున్నారు.

‘మీనారీ’ చిత్రంలో అమ్మమ్మ పాత్రలో యువాన్‌

మరిన్ని వార్తలు