Hukam Singh Mysterious Death: హుకుం సింగ్‌ను సవతి సోదరుడు చంపేశాడా?ఆ గొడవలే హత్యకు కారణమా?

19 Sep, 2023 10:56 IST|Sakshi

జోద్‌పూర్‌ పరిసర ప్రాంతాలన్నీ ఉదయాన్నే తెలిసిన ఆ వార్తతో ఉలిక్కపడ్డాయి. 1984 ఏప్రిల్‌ 17న అర్ధరాత్రి వేళ జరిగింది ఆ సంఘటన. రావు రాజా హుకుం సింగ్‌ అలియాస్‌ టుటు బనాను ఎవరో చంపేశారు. సమాచారం అందడంతో పోలీసులు సంఘటన జరిగిన రాజ్‌పుత్‌ రెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. హత్య జరిగి కొన్ని గంటలు గడిచిపోవడంతో అప్పటికే హుకుం సింగ్‌ శరీరం చల్లబడిపోయింది. విచిత్రంగా ఇద్దరు నిందితులు హుకుం సింగ్‌ మృతదేహం పక్కనే పోలీసుల రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు.

నిందితుల్లో మరో ఇద్దరు సంఘటనా స్థలం నుంచి పారిపోయారు. మృతదేహం పక్కనే నెత్తుటి మరకల కత్తి పడి ఉంది. అది హుకుం సింగ్‌దే! హుకుం సింగ్‌ శరీరంపై ఇరవైకి పైగా కత్తి వేట్లు ఉన్నాయి.జోద్‌పూర్‌ రాజవంశానికి చెందిన రావు రాజా హుకుం సింగ్‌ హత్యపై అనుమానాలు చాలానే ఉన్నాయి. ఎన్నో ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి.హుకుం సింగ్‌ జోద్‌పూర్‌ మహారాజా గజ్‌ సింగ్‌కు సవతి సోదరుడు, జోద్‌పూర్‌ మాజీ పాలకుడు మహారాజా హనువంత్‌ సింగ్, జుబేదా బేగంల కుమారుడు.

హనువంత్‌ సింగ్, జుబేదా బేగం దంపతులు 1952లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. అప్పటికి హుకుమ్‌ సింగ్‌ వయసు ఏడాది మాత్రమే! సవతి తల్లి కృష్ణకుమారి ఆలన పాలనలో పెరిగాడు. తండ్రి హనువంత్‌ సింగ్‌ మరణం తర్వాత హుకుం సింగ్‌ సవతి సోదరుడు గజ్‌ సింగ్‌ పట్టాభిషిక్తుడయ్యాడు.అతి గారాబం వల్ల హుకుం సింగ్‌ అల్లరి చిల్లరిగా, దురుసుగా తయారయ్యాడు. రాచప్రాసాద మర్యాదలను పెద్దగా పట్టించుకోకుండా, ఊళ్లోని ఆకతాయి యువకులతో కలసి విచ్చలవిడిగా తిరిగేవాడు. తాగుడుకు అలవాటుపడి, జనాలతో తరచు తగవులు పెట్టుకునేవాడు.

ఒక సందర్భంలో తనను నిలువరించడానికి ప్రయత్నించిన పోలీసులనే తుపాకి గురిపెట్టి బెదిరించాడు. తుపాకితో బెదిరించినందుకు పోలీసులు హుకుం సింగ్‌పై హత్యాయత్నం అభియోగం మోపుతూ కేసు పెట్టారు. హైకోర్టు ఆ కేసును కొట్టేసి, బెదిరింపు కేసు కింద విచారణ చేపట్టింది. ఇలాంటి దుందుడుకు స్వభావం ఉన్న హుకుం సింగ్‌ రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు. జోద్‌పూర్‌ జిల్లాలో యువజన కాంగ్రెస్‌ నాయకుడిగా ఎదిగాడు. అకస్మాత్తుగా అతడు హత్యకు గురవడంతో జోద్‌పూర్‌లో కలకలం రేగింది.మొదటగా రంగంలోకి దిగి, దర్యాప్తు చేసిన జోద్‌పూర్‌ పోలీసులు చెప్పిన కథనం నమ్మశక్యంగా లేదు.

నలుగురు నిందితులను అరెస్టు చేసినా, అసలు దోషులను నిరూపించలేకపోయారు. సంఘటన జరిగిన తర్వాత జోద్‌పూర్‌ ఎస్పీ శంతను కుమార్‌ మీడియా ముందుకు వచ్చాడు. అతను చెప్పిన ప్రకారం– హుకుం సింగ్‌కు నేరప్రవృత్తి ఉంది. పర్యాటక శాఖ ఉపమంత్రి నరేంద్రసింగ్‌ భాటితో అతడికి సన్నిహిత సంబంధాలు ఉండేవి. అయితే, కొద్దిరోజులగా ఇద్దరి మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. హత్య జరిగిన రోజు సాయంత్రం హుకుం సింగ్‌ సమీపంలోని బస్తీలో జరిగిన డ్యాన్స్‌ కార్యక్రమం చూసి, రాత్రి రెస్ట్‌హౌస్‌కు తిరిగి వచ్చాడు.

అతనితో పాటు మరో నలుగురైదుగురు ఉన్నారు. అందరూ మందు పార్టీ చేసుకున్నారు. తాగిన మత్తులో తనతో ఉన్నవాళ్లతో గొడవ పడ్డాడు. ఈ గొడవలోనే హత్యకు గురయ్యాడు. హత్య జరిగాక మృతదేహం వద్ద వేచి చూస్తున్న ఇద్దరినీ, అక్కడి నుంచి పారిపోయారని చెబుతున్న మరో ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే వారే దోషులని నిరూపించలేకపోయారు. హుకుం సింగ్‌ హత్య కాంగ్రెస్‌ జాతీయ పార్టీలోనూ అలజడి రేపింది. హత్య వెనుక మంత్రి భాటి హస్తం ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. భాటి ఈ ఆరోపణలను తోసిపుచ్చారు.

‘హత్యకు కొద్దిరోజుల ముందు హుకుం సింగ్‌ జైపూర్‌ సర్క్యూట్‌హౌస్‌లో గొడవ పడ్డాడు. సంఘటనా స్థలానికి వచ్చిన విధాయక్‌పురి పోలీసులు అతణ్ణి కొట్టారు. హత్యాయత్నం కేసులో దిగువకోర్టు శిక్ష విధిస్తే, నాలుగు నెలలు జైల్లో గడిపి, హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో బయటకు వచ్చాడు. తరచు తగవులు పెట్టుకునే హుకుం సింగ్‌కు చాలామంది శత్రువులు ఉంటారు’ అని భాటి చెప్పారు. ఈ సంఘటనలో హుకుం సింగ్‌ సవతి సోదరుడు గజ్‌ సింగ్‌పై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఆస్తుల వ్యవహారాల్లో ఇద్దరికీ పొరపొచ్చాలు ఉన్న మాట నిజమే అయినా, హత్యలో గజ్‌ సింగ్‌ ప్రమేయం ఉందనడానికి ఎలాంటి ఆధారాలూ దొరకలేదు.అయితే, జోద్‌పూర్‌ కాంగ్రెస్‌ నేతలు భాటికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి మూపనార్‌కు ఫిర్యాదు చేశారు. మూపనార్‌ దీనిపై భాటిని ప్రశ్నించారు. హుకుం సింగ్‌ ఢిల్లీలో తన పరువుతీసే పనులు చేస్తున్నాడని, తన ప్రత్యర్థుల చేతిలో పావుగా మారాడని, అయితే అతడి హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

హుకుం సింగ్‌ హత్యలో రాజకీయ నాయకులెవరి ప్రమేయమూ లేదని రాజస్థాన్‌ ఐజీ జీసీ సింఘ్వీ మీడియాకు వెల్లడించారు. రాజకీయ ఒత్తిళ్ల వల్లనే రాజస్థాన్‌ పోలీసులు ఈ కేసును నీరుగారుస్తున్నారంటూ కాంగ్రెస్‌ నేతలు కొందరు ఆరోపణలు చేశారు. దీంతో ఈ కేసు సీబీఐ చేతికి మారింది. కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నట్లు సీబీఐ ఈ కేసులో గుమన్‌ సింగ్‌ అనే వ్యక్తిని అరెస్టు చేసింది. విచిత్రంగా విచారణకు ముందే అతడు అదృశ్యమయ్యాడు. దీంతో ఈ కేసు ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది.
   

మరిన్ని వార్తలు