Nandini Krishnan: అనువాద వారధి

21 Apr, 2023 05:34 IST|Sakshi

న్యూస్‌మేకర్‌

సొంతగా రచనలు చేయగలిగేవారు అనువాదాలు చేయరు. భాష బాగా వచ్చినంత మాత్రాన అనువాదం చేయలేరు. దానికి నైపుణ్యం, కొంత నిస్వార్థం కావాలి. తమిళ రచయిత్రి నందిని కృష్ణన్‌ చేసిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ ఇంగ్లిష్‌ అనువాదం ఏప్రిల్‌ 24న మార్కెట్లోకి రానుంది. నవలలోని పాతకాలపు తమిళాన్ని నేటి యువతకు అందేలా అనువాదం చేయడం సులువు కాదు. తమిళంలోని ఉత్తమ నవలలను సవాలుగా తీసుకుని నందిని ఇంగ్లిష్‌లో అనువాదం చేస్తోంది. ఆమెకు వస్తున్న గుర్తింపు ఆ రంగంలో రాణించాలనుకునే స్త్రీలు గమనించదగ్గది.

దాదాపు 2500 పేజీలు ఉండే ఐదు భాగాల భారీ ప్రఖ్యాత తమిళ నవల ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ను ఇంగ్లిష్‌లో అనువాదం చేయబూనడం సాహసం. కాని ఈ క్లాసిక్‌ను అనువాదం చేయడానికి చాలా మంది ట్రై చేస్తూనే వచ్చారు. ముగ్గురు నలుగురు సఫలీకృతులయ్యారు. అయితే ఎప్పటికప్పుడు కొత్త జనరేషన్‌కు తగ్గట్టుగా అనువాదం చేయడానికి ఎవరో ఒకరు ముందుకు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు నందిని కృష్ణన్‌ వంతు. ఆమె చేసిన ఈ నవల అనువాదం మొదటి భాగం పూర్తయ్యింది. ఏప్రిల్‌ 24న విడుదల కానుంది. వెస్ట్‌ల్యాండ్‌ బుక్స్‌ దీనిని ప్రచురిస్తుంటే ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ను రెండు భాగాల సినిమాగా తీస్తున్న దర్శకుడు మణిరత్నం ఈ కార్యక్రమానికి ప్రోత్సాహకుడిగా ఉన్నాడు.

‘పొన్నియిన్‌ సెల్వన్‌ నవల 75 ఏళ్ల క్రితం నాటిదని గుర్తు లేనంతగా అనునిత్యం తమిళ సాహిత్యంలో కలగలిసిపోయింది. కల్కి రాసిన ఈ నవలలోని భాషను, పై అర్థాన్ని, లోపలి అర్థాన్ని అర్థం చేసుకుని అనువాదం చేయడం చాలా జటిలం. అయినా చేశాను.  పాఠకులు సులభంగా చదువుకోవడానికి, చేత బట్టుకోవడానికి వీలుగా ఇంగ్లిష్‌లో ఐదు కంటే ఎక్కువ భాగాలుగా విభజించి పుస్తకాలుగా తేనున్నాము’ అని తెలిపింది నందిని కృష్ణన్‌.

ఎవరీ నందిని కృష్ణన్‌?
నందిని కృష్ణన్‌ చెన్నైలో స్థిరపడిన నాటకకర్త, రచయిత్రి, స్టేజ్‌ యాక్టర్‌ కూడా. లండన్‌లో, ఢిల్లీలో జర్నలిస్ట్‌గా పని చేసింది. ఆ తర్వాత చెన్నై నుంచి వెబ్, ప్రింట్‌ మీడియాలలో పని చేయడం మొదలుపెట్టింది. హాస్యం రాస్తుంది. పెద్దలు కుదిర్చే పెళ్లిళ్లకు ప్రాధాన్యం ఇచ్చే భారతీయ వైవాహిక వ్యవస్థపై విమర్శను పెడుతూ వివాహమైన స్త్రీలను, పురుషులను ఇంటర్వ్యూ చేసి ‘హిచ్డ్‌: ది మోడర్న్‌ అండ్‌ అరేంజ్డ్‌ మేరేజ్‌’ పుస్తకం తెచ్చింది. ట్రాన్స్‌ మెన్‌ జీవితాల ఆధారంగా ‘ఇన్‌విజిబుల్‌ మెన్‌‘ పుస్తకం రాసింది. పెరుమాళ్‌ మురుగన్‌ నవలలను ఇంగ్లిష్‌లో అనువాదం చేయడం ద్వారా అనువాద రంగంలో ప్రవేశించింది. ఇప్పుడు ‘పొన్నియిన్‌ సెల్వన్‌‘ అనువాదం చేస్తోంది. నందిని కృష్ణన్‌ ఇంట్లో ఎప్పుడూ వీధి కుక్కలు ఉంటాయి. వాటిని సాకుతుంటుంది. పిల్లులను కూడా. ‘కుక్కలు, పిల్లలు, వేల కొద్ది పుస్తకాలు అంతే మా ఇల్లు’ అని చెబుతుంది.

కత్తి మీద సాము
‘అనువాదం చేయడం కత్తి మీద సాము’ అంటుంది నందిని. ‘సొంత రచనైతే అలా ఒక సమాధి స్థితికి వెళ్లి రాసుకుంటూ పోతాము. అనువాదం అలా కాదు. అప్రమత్తంగా ఉండాలి. ఎదుటివారు చదివితే అది కేవలం అనువాదం అనిపించకూడదు. అదే సమయంలో ఒరిజినల్‌ నవల తాలూకు పరిమళం దానిలో ఉండాలి. అనువాదం పూర్తి చేశాక ఎవరిదో కన్నబిడ్డను మనం సాకాం... ఇక దీనితో రుణం చెల్లిపోయింది అన్న బాధ తప్పదు’ అంటుంది నందిని.

‘అనువాదకులు స్వయంగా రచయితలు కాకపోవడం వల్ల కొన్ని అనువాదాలు చెడిపోతాయి. ఎందుకంటే వాళ్లు ప్రతి మాటా కచ్చితంగా అనువాదం చేస్తూ కృతకంగా మారుస్తారు. అనువాదకులు స్వయంగా రచయితలైనా కూడా కొన్ని అనువాదాలు చెడిపోతాయి. ఎందుకంటే వారు తమ సృజనశక్తిని కూడా కలుపుతారు. అది తప్పు. వేరొకరు గీసిన బొమ్మను నకలు చేసేటప్పుడు మనం పికాసో అంతటివాళ్లమైనా ఆ బొమ్మలో మన గొప్పదనం చూపకూడదు. అనువాదం అయినా అంతే’ అంటుంది నందిని కృష్ణన్‌.

మంచి అనువాద రుసుము
‘అనువాదంలో రాణించాలంటే మంచి డబ్బు కూడా మనకు ఆఫర్‌ చేయాలి. తగిన డబ్బు లేకుండా అనువాదం చేయడం అనవసరం’ అంటుంది నందిని. ‘కొంతమంది కల్లబొల్లి మాటలు చెప్పి అనువాదం చేయించుకోవాలనుకుంటారు. వారి నుంచి జాగ్రత్తగా ఉండాలి. నేను రోజుకు ఆరేడు గంటలు అనువాదం చేస్తాను. ఒక పదానికి బదులు ఎన్ని పదాలు వాడొచ్చో అవసరమైతే లిస్ట్‌ రాసుకుంటాను. ఒరిజినల్‌ని చదువుతూ, అనువాదాన్ని చదువుకుంటూ పని ముగిస్తాను. పెరుమాళ్‌ మురుగన్‌ లాంటి రచయితలు పల్లెల్లో మరీ కొన్ని వర్గాలు మాత్రమే వాడే మాటల్ని ఉపయోగించి రాస్తారు. వాటికి ఇంగ్లిష్‌ మాటలు ఉండవు. డిక్షనరీలు కూడా ఉండవు. అందుకే అవసరమైతే ఒరిజినల్‌ రచయితనే సంప్రదిస్తూ డౌట్లు క్లియర్‌ చేసుకుంటూ అనువాదం ముగించాలి’ అంటుంది నందిని.
నందిని లాంటి అనువాదకులు తెలుగులో కూడా ఉంటే మన క్లాసిక్స్‌ కూడా ప్రపంచ పాఠకులకు తప్పక చేరుతాయి. అనువాదకులకు గుర్తింపునూ తెచ్చిపెడతాయి.
 
 

మరిన్ని వార్తలు