మానవుడికి పంది కిడ్నీ..ప్రయోగం విజయవంతం

17 Sep, 2023 10:33 IST|Sakshi

అవయవ దానం అనేది ​ఓ సమస్యాత్మకంగా మారింది. దాతలు దొరకక, బ్రెయిన్‌ డెడ్‌ వ్యక్తుల నుంచి అవయవాల సేకరణ పరిమితంగానే ఉండటం తదితర కారణాల దృష్ణ్యా ప్రస్తుతం అవయవాల మార్పిడి ఓ అర్థంకానీ ప్రశ్నలా ఉంది. ఆ ప్రశ్నకు సమాధానమే కాదు ఎన్నాళ్లుగా చిక్కుముడి వీడని ప్రశ్నలా వేధిస్తున్న సమస్యకు సమాధానం దొరికిందనే కొత్త ఆశని ఇ‍చ్చింది. ఇంతవరకు పంది కిడ్నీని మనిషికి అమర్చి చేసిన ప్రయోగాల్లో చాలా వరకు ఒకటి రెండు రోజుల వరకే పనిచేస్తే ..ఈసారి మాత్రం ఏకంగా రెండు నెలలు విజయవంతంగా పనిచేసి రికార్డు సృష్టించింది. అదికూడా బ్రెయిన్‌డెడ్‌ మనిషిలో విజయవంతమవ్వడం పరిశోధకులకు సరికొత్త ఆశలను రేకెత్తించింది. ఈ పరిశోధన యూఎస్‌లో విజయవంతం అయ్యింది.  

మానవునిలో జన్యుపరంగా మార్పు చెందిన పంది కిడ్నీ సుదీర్ఘకాలం పనిచేయడం ఇదే తొలిసారి. ఈ మేరకు డాక్టర్‌ మోంట్‌గోమెరీ వైద్య బృందం మాట్లాడుతూ..ఈ ప్రయోగం అవయకొరత సమస్యను పరిష్కరించడంలో సహాయపడుతుందని ఆనందంగా చెప్పారు. తాము మారిస్‌ మిల్లర్‌ అనే బ్రెయిన్‌ డెడ్‌ వ్యక్తి మృతదేహాన్ని వెంటిలేటర్‌పై ఉంచి ఈ ప్రయోగాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. రెండు నెలలపాటు అతడిని వెంటిలేటర్‌పై ఉంచి మరీ ఆ పంది కిడ్నీ ఎలా పనిచేస్తుందో పరీక్షించినట్లు తెలిపారు. ఒక నెలపాటు విజయవంతంగా పనిచేసిందని ఆ తదుపరి నెమ్మదిగా మార్పులు కనిపించడం మొదలైంది.

రోగనిరోధక వంటి మందుల చికిత్సతో కిడ్నీ పనితీరుని పొడిగించేలా చేశామని తెలిపారు. భవిష్యత్తులో ఇలా జంతువుల అవయవాల ట్రాన్స్‌ప్లాంట్‌ విజయవంతమవుతుందనే ఆశను ధృవీకరించింది. దీనిపై మరింతగా ప్రయోగాలు చేసి కృషి చేయాల్సిన అవసరాన్ని నొక్కి తెలిపిందని పరిశోధకులు చెబుతున్నారు. నిజానికి సదరు వ్యక్తి మిల్లర్‌ ఆకస్మికంగా కుప్పకూలి బ్రెయిన్‌డెడ్‌ అయ్యారు. అయితే క్యాన్సర్‌ కారణంగా అతడి అవయవాలను దానం చేయడం వీలుపడలేదు. అతని సోదరి మేరి మిల్లర్‌ డఫీ, పిగ్‌ కిడ్నీ ప్రయోగం కోసం అతడి మృతదేహాన్ని దానం చేయాలనే నిర్ణయాన్ని చాలా భారంగా తీసుకుంది.

జూలై 14న మిల్లర్‌ 58వ పుట్టిన రోజుకు కొద్దిరోజుల ముందు పంది కిడ్నీని మిల్లర్‌కి మార్పిడి చేసి పరీక్షించడం ప్రారంభించారు. జంతువులోని థైమస్‌ గ్రంథికి రోగనిరోధక కణాలతో పనిచేయగలిగేలా పరిశోధకులు శిక్షణ ఇచ్చారు. దీంతో మొదటి నెలంతా చాలా విజయవంతంగా ఆ కిడ్నీ పనిచేసింది. ఇక రెండో నెల నుంచి మూత్రంలో తగుదల వంటి మార్పులు ప్రారంభమయ్యాయి. వైద్యులు  అందుకు అనుగుణంగా చికిత్స అందించి అది పనిచేసేలా చికిత్స అందించారు. ఈ ప్రయోగం జన్యుపరంగా మార్పు చెందని పందుల నుంచి అవయవాలను ట్రాన్స్‌ప్లాంట్‌ చేయగలమనే నమ్మకాన్ని అందించింది. వైద్యలు గత మూడు నెలలుగా చేసిన ఈ ప్రయోగం విజయవంతంగా ముగిసింది. ఇక మిల్లర్‌ మృతదేహం నుంచి పంది కిడ్నీని తొలగించి దహనసంస్కారాల నిమిత్తం అతడి బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. 

అయితే ఇలా జంతువుల అవయవాల మార్పిడి కారణంగా శోషరస కణుపులు, జీర్ణవ్యవస్థలో ఏవైనా సమస్యలు వస్తాయా? అనేదాని గురించి మరింతగా పరిశోధనలు చేయాల్సి ఉందన్నారు. అందుకోసం జీర్ణవ్యవస్థలోని సుమారు 180 వేర్వేరు కణజాల నమూనాలను  పరిశీలించాల్సి ఉందని కూడా అన్నారు. చావు అంచుల మధ్య కొట్టుమిట్లాడుతున్న వారికి అవయవదానం ..కొత్త ఊపిరి పోసి జీవితంలో రెండో అవకాశం లభించేలా చేయడమే లక్ష్యంగా ఈప్రయోగాలు చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. 

(చదవండి: చిన్నారుల్లో బ్రాంకియోలైటిస్‌ వస్తే...? ముఖ్యంగా అలాంటి పిల్లలు..)

మరిన్ని వార్తలు