దేవుని మురిపించేది పరిమాణం కాదు... నాణ్యత మాత్రమే!

7 Feb, 2021 07:11 IST|Sakshi

మనకు విజయాన్నిచ్చిన గొప్ప నిర్ణయాలను పదిమందికీ చాటి సంబర పడతాం.  కానీ మన నిర్లక్ష్యాలు కొన్నింటికి ఎంతటి మూల్యాన్ని చెల్లించామో ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోతాం. నిర్ణయాలు, వాటి విజయాలు మనవైతే, నిర్లక్ష్యాలు, వాటి దుష్పరిణామాలు కూడా మనవే కదా? ప్రతినిత్యం వెలుగుతో, ప్రభువు సాన్నిధ్యంతో, ఆనందసంతోషాల వాతావరణంతో అలరారే పరలోకం ఎంతటి నిజమో, తీరనిబాధలు, ఆరని అగ్ని, కటిక చీకటితో కూడిన భయానకమైన నరకం కూడా అంతే నిజం. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన యేసుక్రీస్తు వారి కొండమీది ప్రసంగంలో భాగంగా ఆయన చేసిన ఒక అత్యంత ప్రాముఖ్యమైన బోధ పరలోకానికి, నరకానికి సంబంధించినది. నాశనానికి, నరకానికి వెళ్లే ద్వారం వెడల్పుగా, విశాలంగా ఉంటుందని, అందువల్ల అనేకులు ఆ దారినే ఎన్నుకొంటారని, నిత్యజీవానికి దారితీసే ఇరుకు ద్వారాన్ని, సంకుచిత మార్గాన్ని చాలా కొద్దిమందే ఎన్నుకుంటారని ప్రభువు పేర్కొన్న అత్యంత ప్రాముఖ్యమైన అంశం ఆయన చేసిన కొండమీది ప్రసంగమేనని చాలామందికి తెలియదు.

మత్తయి 5,6,7 అధ్యాయాల్లోని 111 వచనాల్లో విస్తరించి ఉన్న ప్రభువు వారి కొండమీది ప్రసంగ మూలాంశం కూడా ఇదే!! తన దారిని ఎన్నుకోవడమంటే, అత్యంత కఠినమైన దారిని ఎన్నుకోవడమే అన్న తిరుగులేని సత్యాన్ని క్రీస్తు ప్రభువే తన బోధల్లో, తన జీవితం లో కూడా స్పష్టం చేశాడు. అయినా సరే, కృపగల దేవుడు తన బిడ్డలకు ఇరుకు ద్వారాన్ని, సంకుచితమైన దారినెందుకిస్తాడు? విశాలమైన ద్వారం, సాఫీగా సాగిపోయే రహదారి లాంటి విశాలమైన దారి ప్రభువుదని భావించి, ఆ మార్గాన్ని ఎన్నుకునే వారే అత్యధికులన్నది రోజూ మనం చూసే ఒక సత్యం. ప్రపంచంలో 95 శాతానికి పైగా ప్రజలు ఎన్నుకునే సువిశాలమైన మార్గం నిత్యనరకానికి ఎలా దారితీస్తుంది? అంటూ ‘మెజారిటీ’ సంఖ్యతో తీసుకునే నిర్ణయాలే సరైనవని నమ్మే ‘ప్రజాస్వామ్యవాదం’ ఇక్కడ పనిచెయ్యదన్నది చాలామంది క్రైస్తవులకు మింగుడు పడని ఒక చేదువాస్తవం.

’మీరు ఇరుకు ద్వారాన, దాని ముందున్న ఇరుకు మార్గాన నడవండి’ అని మనకు చెప్పి ప్రభువు తన మార్గాన తాను నడవలేదు. ఆయన కూడా ఒక సంపూర్ణ మానవుడుగా 33 ఏళ్లపాటు ఎన్నో ముళ్ళు, గోతులు, అవరోధాలున్న కఠిన మార్గంలో నడిచి, సిలువలో ఘోరమైన శ్రమలనుభవించి, చనిపోవడం ద్వారా తన తిరుగులేని విధేయతతో పరమ తండ్రికి కుడిపక్కన ఉన్న స్థానాన్ని సంపాదించుకున్నాడు. సామాన్య ప్రజలమైన మనకు ఏది ఆయన బోధించాడో, అదే ఆయన తన జీవితం లో ఆచరించి మరీ చూపించాడు. ఆదిమ అపొస్తలులు, క్రైస్తవులు కూడా అదే దారిలో నడిచి పరలోకాన్ని తమ ‘జీవనసాక్ష్యం’ ద్వారా సంపాదించుకున్నారు. ఎలాగైనా సరే  ఎక్కువ మందిని క్రై స్తవులను చేస్తే  దేవుడు శభాష్‌ అంటాడన్న దుర్బుద్ధితో, నేటి కొందరు సెలెబ్రిటీ బోధకులు దేవుడు నిర్దేశించిన అత్యున్నతమైన విలువల్ని పలచన చేసి, దేవుని వాక్యాన్ని వక్రీకరించి, సంపదలు, స్వస్థతల వంటి ఈ లోకవిషయాల సాధనకు సువార్తను ముడిపెట్టి, ప్రజల్ని నరకానికి దారితీసే విశాలమైన మార్గంలో తాము ముందుండి మరీ నడిపిస్తున్నారు. ఏదడిగితే అదిచ్చేందుకు, చేతిలో అద్భుత దీపమున్న అల్లావుద్దీన్‌ కాదాయన.

ఆయన సార్వభౌముడైన, పవిత్రతకు మరోపేరైన దేవుడు. మనం వెళ్ళాల్సింది పరలోకానికా, నరకానికా అన్న నిర్ణయాన్ని దేవుడు మన చేతుల్లోనే పెట్టాడు. అది పూర్తిగా మన నిర్ణయమే. అందులో దేవుని బలవంతమేమీ ఉండదు. పెద్ద చర్చి, గొప్ప ప్రసంగం, శక్తిమంతమైన ప్రార్థన వంటి మాటలు మనుషుల్ని మురిపిస్తాయేమో కానీ, దేవుని దష్టిలో ఆ మాటలకు విలువ లేదు. ఎందుకంటే, ఆయన కొలబద్ద పరిమాణాత్మకం కాదు, మనలో అత్యున్నతమైన జీవన విలువల్ని ఆశించే నాణ్యతా దృక్కోణం దేవునిది. అందుకే నాడు కోటీశ్వరులు వేసే కానుకల్ని తృణీకరించి, ప్రభువు ఒక పేద విధవరాలు వేసిన మనః పూర్వకమైన కేవలం రెండు కాసుల కానుకను అత్యున్నతమైనదిగా శ్లాఘించాడు. అప్పుడూ ఇప్పుడూ కూడా ఆయన మారని దేవుడు.

– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌ 

మరిన్ని వార్తలు