Sagubadi: కొబ్బరి పొట్టుతో సేంద్రియ ఎరువు! ఇలా తయారు చేసుకోండి.. కోకోపోనిక్స్‌ సాగులో..

23 Aug, 2022 09:57 IST|Sakshi

ముడి కొబ్బరి పొట్టును శిలీంధ్రంతో కుళ్లబెట్టి... కొబ్బరి పొట్టు కంపోస్టు తయారీ

గ్రోబాగ్స్‌లో మట్టి లేని ఇంటిపంటల (కోకోపోనిక్స్‌) సాగు... 

నర్సరీ మొక్కల పెంపకంతో పాటు... పంటపొలాల భూసారం పెంపుదలకు ఉపయోగకరం

How To Prepare Coconut Coir Based Compost: కొబ్బరి పొట్టుతో తయారు చేసిన సేంద్రియ ఎరువు ‘మట్టి లేని సేద్యాని’కి ఉపయోగపడుతోంది. నిస్సారమైన భూముల్లో లేదా సాగుకు నేల అందుబాటులో లేని అర్బన్‌ ప్రాంతాల్లో నివాస గృహాల పైన, మిద్దెలపైన, గేటెడ్‌ కమ్యూనిటీల్లోని ఖాళీ స్థలాల్లో.. గ్రో బ్యాగ్‌లలో కొబ్బరి పొట్టు ఎరువు (కంపోస్టు)తో.. కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ మొక్కల సాగుకు మట్టి లేని సేద్యం ఉపకరిస్తుంది.  

తామర తంపరగా పట్టణీకరణ విస్తరిస్తున్న నేపథ్యంలో ఎక్కువ జనం కూడే పట్టణాలు, నగరాల దగ్గర్లోనే తాజా కూరగాయలు, ఆకుకూరల  లభ్యతను పెంచడానికి ఈ సేద్యం ఉపయోగకరమని బెంగళూరులోని భారతీయ ఉద్యాన పంటల పరిశోధనా సంస్థ (ఐఐహెచ్‌ఆర్‌) చెబుతోంది. ఆ విశేషాలు ఈ నెల 16న ‘సాక్షి సాగుబడి’లో ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొబ్బరి పొట్టుతో చక్కటి సేంద్రియ ఎరువు తయారీ పద్ధతి గురించి తెలుసుకుందాం.. 

కొబ్బరి డొక్కల నుంచి ఒక కేజీ పీచును వేరు చేసే క్రమంలో 6 నుంచి 8 కేజీల కొబ్బరి పొట్టు వస్తుంది. ఈ ముడి పొట్టును నేరుగా వ్యవసాయంలో వినియోగించకూడదు. ముడి కొబ్బరి పొట్టులోని ‘కర్బనం–నత్రజని’ నిష్పత్తి మొక్కలకు అనుకూలం కాదు. దీనిలో ‘లెగ్నిన్‌’ కూడా అధిక మోతాదులో ఉంటుంది. అందువల్ల దీన్ని కుళ్లబెట్టకుండా నేరుగా వాడితే మొక్కలకు హాని జరుగుతుంది.

కొబ్బరి పొట్టును ఒక శిలీంధ్రం కలిపి కుళ్లబెడితే సేంద్రియ ఎరువుగా మారుతుంది. మట్టి లేని సేద్యానికే కాకుండా.. సాధారణ పొలాల్లో పంటల సాగులో కూడా సేంద్రియ ఎరువుగా వాడుకోవచ్చు. కొబ్బరి పొట్టును సులువుగా సేంద్రియ ఎరువుగా మార్చే ప్రక్రియను సెంట్రల్‌ కాయిర్‌ బోర్డు ప్రమాణీకరించింది. ‘ఫ్లూరోటస్‌ సాజర్‌ కాజూ’అనే శీలింధ్రాన్ని ఉపయోగించి పొట్టును వేగంగా కుళ్లబెట్టే ప్రక్రియను కాయిర్‌ బోర్డు రైతులకు పరిచయం చేసింది.

రసాయనిక పదార్థాలు వాకుండా ఫ్లూరోటరస్‌ సాజర్‌ కాజూ, అజొల్లా, వేప పిండినివినియోగిస్తూ వేగంగా కొబ్బరి పొట్టును కుళ్లబెట్టే విధానం ఇది. కోనసీమ రైతుల ‘కృషీవల కోకోనట్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ’ కొబ్బరి పొట్టు ఎరువును తయారు చేస్తోంది.

కొబ్బరి పొట్టు ఎరువు తయారీకి కావలసిన పదార్ధాలు: 
►టన్ను కొబ్బరి పొట్టు (బేబీయార్న్‌ తొలగించినది)
►10 కేజీల అజొల్లా ∙30 కేజీల వేప పిండి.
►5 కేజీల ఫ్లూరోటస్‌ సాజర్‌ కాజూ శిలీంధ్రం.
►వీటిని పొరలు, పొరలుగా వేసి తడుపుతూ ఉంటే నెల రోజుల్లో బాగా చివికిన కొబ్బరి పొట్టు ఎరువు తయారవుతుంది.
►ఫ్లూరో టస్‌ సాజార్‌ కాజూ శిలీంధ్రం ధవళేశ్వరంలోని కాయిర్‌ బోర్డు రీజనల్‌ కార్యాలయంలో లభిస్తుంది.

కొబ్బరి పొట్టుతో కంపోస్టు తయారీ ఇలా.. 
►ఒక టన్ను కొబ్బరి పొట్టుకు 12 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు, 2 అడుగుల ఎత్తున బెడ్‌ తయారు చేసుకోవాలి.
►ముందుగా 200 కేజీల కొబ్బరి పొట్టును సమతలంగా, నీడగా ఉన్న ప్రదేశంలో ఒక పొరలా వేయాలి.
►దీనిపై నీరు చిలకరించి (సుమారు 20 లీటర్లు) ఒక కేజీ ఫ్లూరోటస్‌ సాజర్‌ కాజూ శిలీంధ్రాన్ని వెదజల్లాలి.
►దీనిపై మళ్లీ 200 కేజీల పొట్టు వేయాలి. పొట్టు వేసిన తరువాత అజోల్లా, వేపపిండి మిశ్రమం 20 కేజీలు వేయాలి.
►20 లీటర్ల నీరు పోసి మళ్లీ 200 కేజీల పొట్టు వేయాలి
►తరువాత ఫ్లూరోటస్‌ సాజర్‌ కాజు 2 కేజీలు వేసి నీరు చల్లి, తిరిగి 200 కేజీల పొట్టు వేయాలి.
►తరువాత నీటితో తడపాలి.

►మరోసారి మిగిలిన 20 కేజీల అజొల్లా, వేప పిండి మిశ్రమం, ఫ్లూరోటస్‌ శిలీంధ్రం 2 కేజీలు చల్లి.. దానిపై నీరు చిలకరించి, మిగిలిన 200 కేజీల కొబ్బరి పొట్టును వేసి నీరు చల్లాలి.
►కనీసం 30 రోజులు దీనిపై ప్రతి రోజూ స్వల్పమోతాదులో నీరు చల్లి తడపాల్సి ఉంది.
►నెల రోజుల్లో పొట్టు బాగా కుళ్లి మంచి ఎరువుగా తయారవుతుంది. 
►కొబ్బరి పొట్టు ఎరువు తయారీకి మరో పద్ధతి కూడా ఉంది.
►గైలరిసీడియా (గిరిపుష్పం) చెట్ల ఆకులు, గోమూత్రం కలిపిన పశువుల పేడ, ముడి కొబ్బరి పొట్టును పొరలుపొరలుగా వేసి కుళ్లబెట్టినా కొబ్బరి పొట్టు కంపోస్టు తయారవుతుంది.
►అయితే, ఈ పద్ధతిలో రెండు నెలల సమయం పడుతుంది. 
– నిమ్మకాయల సతీష్‌బాబు, సాక్షి అమలాపురం

చదవండి: Sagubadi: కూరగాయల్లోనూ ‘డ్యూయల్‌ గ్రాఫ్టింగ్‌’! ఒకే మొక్కకు రెండు అంట్లు!
Organic Farming: 34 ఎకరాల భూమిలో ప్రకృతి సేద్యం.. ఆరోగ్యసిరిగా...!

మరిన్ని వార్తలు