షిల్లాంగ్‌ వేళ్ల వంతెన.. చూడాల్సిందే

23 Mar, 2021 19:20 IST|Sakshi

ఇది కంప్యూటర్‌లో చేసిన గ్రాఫిక్‌ కాదు. ప్రకృతి చేసిన విన్యాసం. అక్వేరియంలో చేపలకు బదులు పడవ బొమ్మను వదిలినట్లు అనిపిస్తోంది కదూ! కానీ ఇది బొమ్మ పడవ కాదు, నిజమైన పడవ. అందులో ఉన్న మనుషులు ఆ సరస్సు సౌందర్యాన్ని వీక్షించడానికి వచ్చిన పర్యాటకులు. ఆ సరస్సు పేరు ఉమియా లేక్‌. ఇది మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌ నగరానికి పదిహేను కిలోమీటర్ల దూరాన ఉంది. ఇది 220 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన సరస్సు. ఈ సరస్సులో నీరు ఎంత స్వచ్ఛంగా ఉందో పదాల్లో చెప్పాల్సిన పని లేదు, ఈ ఫొటో చెప్పేస్తోంది. 

ఉమియా సరస్సులో తేలుతున్న పడవ

మెత్త చీపురు ఇక్కడిదే..
మేఘాలయలో కమలా తోటలు ఎక్కువ. క్యాబేజీ, క్యాలిఫ్లవర్‌ పంట చేలు విస్తారంగా కనిపిస్తాయి. కొండ వాలులో రకరకాల అడవి చెట్లు ఉంటాయి. వాటన్నింటిలో చీపురు చెట్లు ఎక్కువ. పట్టు కుచ్చులా మెత్తగా ఉండే చీపురును మనం కొండ చీపురు కట్ట అంటాం. ఆ చెట్లు పెరిగేది ఇక్కడే. 


వేళ్ల వంతెన మీద పర్యాటకుల సందడి

చెట్ల వేళ్లతో వంతెన... 
టెక్నాలజీ అభివృద్ధి చెందిన నేటి రోజుల్లో మన ఇంజనీర్‌లు చెరువుల మీద సస్పెన్షన్‌ బ్రిడ్జి కడుతున్నారు. వీటిని మనిషి మేధోవికాసానికి పరాకాష్టలుగా చెప్పుకుంటాం. షిల్లాంగ్‌ వాసులు మనసుతో వంతెనలు కట్టారు. ఉన్న వనరులను అవసరమైనట్లు మలుచుకోవడానికి మేధతోపాటు సున్నితమైన మనసు కూడా ఉండాలి. చుట్టూ అన్ని చెట్లు ఉన్నప్పటికీ చెట్లను నరికి వంతెన కట్టాలనే ఆలోచన చేయలేదు. మహా వృక్షాల వేళ్లను తాళ్లుగా అల్లి వంతెనగా అమర్చారు. వేళ్లను చెట్ల నుంచి వేరు చేయలేదు. కాబట్టి అవి చెట్టుకు బలాన్నిస్తూనే ఉంటాయి. మనుషులను చేరవేసే వాహకాలుగా కూడా పని చేస్తుంటాయి. పెద్ద చెట్లకయితే రెండు వరుసల వంతెనలు కూడా అల్లుతారు. వంతెన నిండుగా మనుషులు ఎక్కి ఊయల ఊగినట్లు ఊగినా సరే పట్టు సడలవు. 

ఇదే మంచికాలం... 
మేఘాలయలో రోడ్లు ఎండాకాలంలో వేస్తే వర్షాకాలంలో కొట్టుకుపోతాయి. సెప్టెంబరు, అక్టోబర్‌ నెలల్లో వెళ్తే గతుకుల రోడ్ల తిప్పలు తప్పవు. ఏటా నవంబర్‌ నుంచి రోడ్డు పనులు మొదలై డిసెంబర్‌కి పూర్తవుతాయి. మేఘాలయ రాష్ట్రం మేఘాలమయం కావడంతో రాష్ట్రం మొత్తంలో ఒక్క ఎయిర్‌పోర్టు కూడా లేదు. షిల్లాంగ్‌ చేరాలంటే పొరుగున ఉన్న అస్సాం రాష్ట్రం, గువాహటి ఎయిర్‌పోర్టులో దిగి రోడ్డు మార్గంలో ప్రయాణించాలి. గువాహటి నుంచి షిల్లాంగ్‌ వెళ్లే ప్రయాణంలో మేఘాలయ జీవన చిత్రం కళ్లకు కడుతుంది. కాబట్టి అస్సాంలో దిగడం ఏ మాత్రం వృథా కాదు. షిల్లాంగ్‌ టూర్‌లో బారాపానీ, నెహ్రూ పార్క్, నోహ్‌స్గితలాంగ్‌ జలపాతం, నోహ్‌కాలికాల్‌ జలపాతం, మావ్‌సమాల్‌ గుహలు, మావ్లాయ్‌నాంగ్‌ విలేజ్, ఎలిఫెంట్‌ ఫాల్స్, షిల్లాంగ్‌ పీక్‌ చూడాల్సిన ప్రదేశాలు.

మరిన్ని వార్తలు