కసబ్‌ని గుర్తుపట్టిన దేవిక!

16 Sep, 2020 04:49 IST|Sakshi

దేవికకు ఇరవై ఏళ్లు వచ్చాయి. పదేళ్లుగా.. అదే పేదరికం.. అవే బెదిరింపులు. కసబ్‌ని గుర్తుపట్టిన అమ్మాయి దేవిక! కాలేజ్‌కి కూడా వచ్చేసింది. ‘కసబ్‌ కీ బేటీ’ అనేవాళ్లు స్కూల్లో. దేశమాత బిడ్డ ఎప్పటికౌతుంది?

ముంబై సెంట్రల్‌లోని ఆర్థర్‌ జైల్లో ఉన్నాడు కసబ్‌. అక్కడికి తీసుకొచ్చారు దేవికను. తొమ్మిదేళ్ల అమ్మాయి. చేతికర్రల మీద నడుస్తూ వచ్చింది. పక్కన తండ్రి ఉన్నాడు. జైల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోర్టులో జడ్జి కూర్చొని ఉన్నారు. దేవిక కుడి కాలుకు ఆపరేషన్‌ జరిగి అప్పటికి ఆర్నెల్లు కావస్తోంది. ఆ చిన్నారి కాలి నుంచి బులెట్‌ను తీశారు డాక్టర్లు. ఆ బులెట్‌ కసబ్‌ పేల్చిందే! అయితే పేల్చింది కసబేనా? అది గుర్తించడానికి దేవికను కోర్టుకు పిలిపించారు. కసబ్‌ను, మరో ఇద్దర్ని పక్కపక్కన ఓ మూల కూర్చోబెట్టారు. దేవిక ను బోనులోకి రప్పించారు. భగవద్గీతను ఆమె చేతిలో పెట్టారు. ఆమె చేత హిందీలో ప్రమాణం చేయించారు.

‘‘నువ్వు చెప్పిన మాటలకు నీకు అర్థం తెలుసా?’’.. అడిగారు జడ్జి. ‘‘తెలుసు. అబద్ధం చెప్పకూడదు. దేవుడి మీద ఒట్టు వేశాను’’ అంది దేవిక. ‘‘మంచిది. ఆ ముగ్గురిలో నీపై తుపాకీతో కాల్చినవారెవరైనా ఉన్నారా?’’.. జడ్జి. వాళ్లను నిశితంగా చూసింది దేవిక. కసబ్‌ వైపు వేలెత్తి చూపింది. ఆ కొద్దిసేపటికే టీవీలలో బ్రేకింగ్‌ న్యూస్‌. కసబ్‌ ఫొటో, పక్కనే చేతికర్రలతో ఉన్న దేవిక ఫొటో. ‘కసబ్‌ను గుర్తుపట్టిన చిన్నారి’. ‘కసబ్‌కు బిగిసిన ఉచ్చు’. మర్నాడు ముంబైలోని పేపర్‌లన్నీ దేవిక గురించి రాశాయి. ఆమె జ్ఞాపకశక్తిని, ధైర్యాన్ని ముంబై పౌరులు ప్రశంసించారు. కసబ్, అతడి సహచరుడు కలిసి ఛత్రపతి శివాజీ టెర్మినస్‌లో విచక్షణారహితంగా జరిపిన కాల్పులలో 58 మంది చనిపోగా, బులెట్‌ దెబ్బ తిని కూడా అదృష్టవశాత్తూ బతికిన ఒక ప్రత్యక్ష సాక్షి దేవిక. ఇప్పుడు ఆ అమ్మాయికి ఇరవై ఏళ్లు!

అయితే పదకొండేళ్ల క్రితం దేవిక కుటుంబం ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది. అదే వెస్ట్‌ బాంద్రాలోని మురికివాడలో, అదే పేదరికంలో, అదే బెదిరింపులతో ఆమె జీవితం నడుస్తోంది. అసలు.. సాక్ష్యం కోసం ఆనాడు తన కూతుర్ని కోర్టుకు పంపననే అన్నాడు నట్వర్‌లాల్‌. లాయర్‌ ఆయన్ని ఒప్పించాడు. ప్రభుత్వం నుంచి సహాయం అందుతుందని, ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందనీ చెప్పాడు. దేవిక సాక్ష్యం చెప్పింది కానీ, ఆయన చెప్పినవేవీ జరగలేదు. కుటుంబ పోషణ కోసం రోజులో నాలుగు పనులు చేస్తాడు నట్వార్‌లాల్‌. అన్నీ ఏ రోజుకు ఆ రోజు ఇంత సంపాదించుకునే పనులే. అతడి భార్య ఏనాడో చనిపోయింది. పెద్ద కొడుకు భరత్‌ పుణెలో ఉంటాడు. చిన్న కొడుకు జయేష్, అతడికన్నా చిన్నదైన దేవిక ఉంటారు ఇంట్లో.

భరత్‌ను చూడ్డానికి పుణె వెళుతున్నప్పుడే.. ఛత్రపతి శివాజీ టెర్మినస్‌ (రైల్వేస్టేషన్‌) లో 2008 నవంబర్‌ 26 రాత్రి ఉగ్రదాడి జరిగింది. ఆ సమయం లో జయేష్‌ బాత్రూమ్‌లో ఉన్నాడు. నట్వర్‌లాల్, దేవిక ప్లాట్‌ఫారమ్‌ మీద ఉన్నారు.  హటాత్తుగా పేలుడు చప్పుళ్లు మొదలయ్యాయి. దేవిక అటు వైపు చూసింది. తుపాకీ బులెట్‌ వచ్చి ఆమెకు తగిలింది. స్పృహలోకి వచ్చి కళ్లు తెరిచేటప్పటికి ఆసుపత్రిలో ఉంది. కసబ్‌ను ఉరి తీసేనాటికి దేవికకు పదమూడేళ్లు. ‘‘పెద్దయ్యాక ఐపీఎస్‌ ఆఫీసర్‌ను అయి ఉగ్రవాదుల పని పడతా..’’ అంటుండేది దేవిక. అయితే కసబ్‌ను ఆమె గుర్తు పట్టిందని తెలిశాక ఒక్క స్కూలు కూడా ఆమెకు సీటు ఇవ్వలేదు! భయం. ఆ పిల్ల వల్ల తమకేదైనా ముప్పు వస్తుందేమోనని.  

దేవిక ఇప్పుడు డిగ్రీలోకి వచ్చింది. పుణె నుంచి పెద్దన్న ముంబైకి ఏనాడో తిరిగి వచ్చేశాడు. చిన్నన్న, తండ్రి అంతా ఒక చిన్న గది లాంటి ఇంట్లో నెట్టుకొస్తున్నారు. దేవిక అన్నలిద్దరికీ తండ్రి లాంటి సంపాదనే. ఏ రోజుకు ఆ రోజు పని వెతుక్కోవడం. దేవిక సాక్ష్యం చెప్పిన రోజు నుంచే బంధువులు వీరిని చేరదీయడం మానేశారు. అప్పుడప్పుడూ ఆ ఇంటికి కసబ్‌ ఆత్మ మాట్లాడినట్లుగా ఆగంతకులెవరో ఫోన్‌ చేసి బెదిరిస్తుంటారు. కాలేజ్‌కి వెళ్లి వచ్చే దారిలో కొన్నిసార్లు దేవిక ఛత్రపతి శివాజీ టెర్మినస్‌లో తనకు బులెట్‌ దెబ్బ తగిలి పడిపోయిన చోట కాసేపు నిలబడి వస్తుంటుంది. బతికే ఉన్నానని తనకు తాను సమాధానం చెప్పుకోడానికేమో! మొన్న సోమవారం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీషన్‌ బాబా సిద్ధిక్‌ దేవిక ఇంటికి వెళ్లి ఆర్థిక సహాయం అందించారు. చెక్కు చేతికి ఇచ్చారు. ఆ కుటుంబానికి సొంత గూడును, భద్రతను కల్పించమని మహారాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి కూడా చేశారు. కాలికి ఆపరేషన్‌ అయ్యి, దేవిక తిరిగి స్కూల్‌కి వెళ్లినప్పుడు ఆమె పక్కన ఎవ్వరూ కూర్చోలేదు. టీచర్‌లు కూడా ముభావంగా ఉన్నారు. పిల్లలంతా  ఆమెను ‘కసబ్‌ కీ బేటీ’ అనడంతో ఆమెను ఆ స్కూలు మాన్పించి వేరే స్కూళ్లు వెతికాడు ఆమె తండ్రి. పిల్లలు వాళ్లు. ఏమైనా అంటారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దవాళ్లకు ఏమైంది? భరతమాత పుత్రికగా దేవికను ఎందుకు గుర్తించలేక పోతున్నారు?!
దేవిక : తొమ్మిదేళ్ల వయసులో కసబ్‌ని గుర్తుపట్టడానికి కోర్టుకు వెళుతున్నప్పటి చిత్రం.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు