ప్రకృతి సేద్యం..ఉపాధికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు! అధ్యయనంలో వెల్లడి

25 Jul, 2023 10:16 IST|Sakshi

అనారోగ్యం వల్ల కోల్పోయే పనిదినాలు మూడో వంతు తగ్గాయి.ప్రకృతి వ్యవసాయంతో పంట దిగుబడులను పెరిగే జనానికి సరిపోయేంత సాధ్యమేనా? వంటి ప్రాధమిక ప్రశ్నలకు, అనుమానాలకు ఇప్పుడు పూర్తిగా కాలం చెల్లింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పోత్సాహంతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న 8 లక్షల మందికి పైగా రైతులు ఇటువంటి ప్రశ్నలన్నిటినీ తమ అనుభవాల ద్వారా పటాపంచలు చేశారు. దిగుబడులు సరే, ప్రకృతి సేద్యంలో శాస్త్రీయత ఎంత? అనే ప్రశ్నకు కూడా ఇటీవల విడుదలైన అంతర్జాతీయ స్థాయి అధ్యయన నివేదిక దీటుగా బదులిచ్చింది.

జిస్ట్‌ ఇంపాక్ట్, గ్లోబల్‌ అలియన్స్‌ ఫర్‌ ద ఫ్యూచర్‌ ఆఫ్‌ ఫుడ్‌ అనే స్వచ్ఛంద సంస్థలు ఏపీ ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్లో 2020 నుంచి మూడేళ్లు లోతుగా అధ్యయనం చేసి, ‘నాచురల్‌ ఫార్మింగ్‌ త్రో ఎ వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌’ పేరిట నివేదికను వెలువరించాయి. ఈ నివేదికను ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్‌.ఎ.ఓ.)కి కూడా సమర్పించాయి. హరిత విప్లవానికి ప్రతీకైన డెల్టా ప్రాంతంలోని పశ్చిమగోదావరి, నీటి ఎద్దడి ప్రాంతాలకు ప్రతీకైన అనంతపురం, కొండ ప్రాంత గిరిజన వ్యవసాయానికి ప్రతీకైన విజయనగరం జిల్లాల్లో 12 గ్రావలను ఎంపిక చేసుకొని, ఆయా గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం, రసాయనిక వ్యవసాయం చేసే రైతుల క్షేత్రాల్లో లోతుగా అధ్యయనం చేశాయి.

ఖరీఫ్, రబీ పంటలు, దీర్ఘకాలిక పంటలతో పాటు పశువుల పెంపకానికి సంబంధింన విషయాలను అధ్యయనం చేశాయి. దిగుడులు, ఖర్చులు, నికరాదాయంతో పాటు.. రసాయనిక పురుగుమందులు, ఎరువుల ప్రభావం రైతులు, గ్రామీణుల ఆరోగ్యంపై ఎలా ఉందన్న విషయాన్ని పరిశీలించి తొలి అధ్యయనం కావటం మరో విశేషం. ప్రకృతికి సంబంధించిన అంశాలపై నోబెల్‌ ప్రైజ్‌గా భావించే టేలర్‌ పురస్కారం(2020) అందుకున్న ప్రముఖ పర్యావరణ ఆర్థికవేత్త పవన్‌ సుఖదేవ్‌ ఆధ్వర్యంలో ఈ అధ్యయనం జరగటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ నివేదికలో ఏముందంటే..?

ప్రకృతి సేద్యంతో 49% పెరిగిన నికరాదాయం

  • రసాయనిక సేద్యం జరిగే పొలాల్లో ఒకటో రెండో పంటలు పండిస్త ఉంటే.. ప్రకృతి వ్యవసాయంలో సగటున 4 పంటలు పండిస్తున్నారు.
  • వరి, మొక్కజొన్న, మినుము, రాగులు, కంది వంటి ప్రధాన పంటల దిగుబడి రసాయనిక వ్యవసాయంతో పోల్చితే ప్రకృతి వ్యవసాయంలో సగటున 11% పెరిగింది.
  • ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్లో శ్రమ అవసరం రసాయనిక సేద్యంతో పోల్చితే సగటున 21% పెరిగింది. రైతు కుటుంబం, కలీల శ్రమ మొత్తాన్నీ లెక్కగట్టారు. గోదావరి డెల్టాలో రసాయన వ్యవసాయంలో ఏడాదికి 313 గంటలు పని చేస్తే, ప్రకృతి సేద్యంలో ఇది 377 గంటలకు పెరిగింది. రాయలసీమలో 258 నుంచి 322 గంటలకు పెరిగింది. ఉత్తరాంధ్ర గిరిజన ప్రాంతాల్లో 234 నుంచి 268 గంటలకు పెరిగింది.
  • అయితే, రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం మానెయ్యటంతో ఖర్చు సగటున 44% తగ్గింది. మొత్తంగా చూస్తే.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోని ప్రకృతి వ్యవసాయదారుల సగటు నికరాదాయం 49% పెరిగింది.

చిన్న రైతులే ‘సామాజిక మూలధనం’
ప్రకృతి సేద్య అనుభవాలను ఒకరితో మరొకరు పంచుకోవటం వల్ల మీకు తోడుగా మేం ఉన్నాం అన్న భావం విస్తరించింది. పరస్పర విశ్వాసం, మద్దతు, సాంఘిక సమన్వయం పెరిగాయి. అన్యోన్యతకు దారితీసింది. ∙ఈ విధంగా రసాయనాల్లేని సాగు అనుభవాలను పంచుకోవడం ద్వారా సామాజిక మూలధనం గణనీయంగా పెరగడానికి మహిళా స్వయం సహాయక బృందాలు ప్రభావశీలంగా పనిచేస్తున్నాయి.
ప్రకృతి వ్యవసాయానికి మళ్లటంలో, ఈ క్రమంలో ఒకరికి మరొకరు తోడుగా నిలబడటంలో పెద్ద రైతుల కంటే చిన్న కమతాల రైతులు ముందంజలో ఉన్నారు. సావజిక మూలధనాన్ని పెంపొందిచటంలో చిన్న రైతుల పాత్ర చాలా ప్రధానమైనదని తేటతెల్లమైంది. మన రైతుల్లో 83% మంది చిన్న, సన్నకారు రైతులే.

మెరుగైన ఆరోగ్యం...

  • రసాయనిక వ్యవసాయం చేసే రైతులు, ఆ పొలాల్లో పనిచేసే కూలీలు అనారోగ్యాల పాలవుతూ చాలా పని దినాలు కోల్పోతూ ఉంటారు. వీరితో పోల్చితే ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసే కూలీలు, రైతులు అనారోగ్యం వల్ల పనికి వెళ్లటం మానుకోవాల్సిన రోజులు మూడింట ఒక వంతు (33%) తగ్గినట్లు అధ్యయనంలో వెల్లడైంది.
  • రసాయనిక పురుగుమందులు, ఎరువుల వాడే రైతులకు ఆరోగ్య ఖర్చులు ఎక్కువ. వారి జీవన నాణ్యత, పని సామర్థ్యం కూడా దెబ్బతింటుంది. సాధారణంగా ఇటువంటి ఆరోగ్యంపై దుష్ప్రభావం కలిగించే నష్టాన్ని లెక్కలోకి తీసుకోవటం లేదు. ∙ప్రకృతి సేద్యం చేసే రైతుల ఆస్పత్రి ఖర్చులు 26% తక్కువ.
  • ప్రకృతి వ్యవసాయదారులు ఎక్కువ రకాల పంటలు పండించడమే కాదు ఎక్కువ రకాల ఆహారాన్ని తినగలుగుతున్నారు. పోషకాలతో కూడిన అనేక రకాల ఆహారం తినటం వల్ల వీరి ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంది.

(చదవండి: ఆ విద్యార్థులు ఎందరికో స్ఫూర్తి..చిట్టి మొక్కలతో గట్టిమేలే చేస్తున్నారుగా!)

మరిన్ని వార్తలు