Mental Health: మహిళలతో పోలిస్తే..పురుషుల్లోనే ఎక్కువ, డిప్రెషన్‌తో బాధపడుతున్నారు

14 Oct, 2023 15:14 IST|Sakshi

రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్‌) జోడెద్దులా పల్లెల్లో సవారీ చేస్తుండగా.. ఇప్పుడు మానసిక రుగ్మతలూ వెంటాడుతున్నాయి. నిన్నా మొన్నటిదాకా పట్టణాలు, నగరాలకు మాత్రమే పరిమితమైన ఈ పోకడ తాజాగా గ్రామీణ ప్రాంతాలకూ తాకడం ప్రమాదకర సంకేతాలు ఇస్తున్నట్టే అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇటీవలి కాలంలో మానసిక ఇబ్బందులతో వస్తున్న వారు ఎక్కువయ్యారని వైద్యులు తెలియజేస్తున్నారు. మెంటల్‌ హెల్త్‌ ప్రోగ్రాం స్క్రీనింగ్‌ పరీక్షల్లో తేలిందని వారు పేర్కొన్నారుఈ పరీక్షల్లో రకరకాల మానసిక రుగ్మతలతో ఇబ్బంది పడుతున్న వారు వేలాదిమంది ఉన్నట్టు బయటపడింది. స్క్రిజోఫ్రీనియా, డిప్రెషన్‌, మూడ్‌ డిజార్డర్స్‌ వంటి మానసిక జబ్బులతో సతమతమవుతున్నారు. సగటున చూస్తే పురుషుల్లోనే ఎక్కువ మంది బాధితులున్నట్టు వెల్లడైంది.
 

స్కిజోఫ్రీనియా..యాంగ్జైటీలే ఎక్కువగా..

స్కిజోఫ్రీనియా (మనో వైకల్యం), యాంగ్జైటీ (ఆందోళన) ఎక్కువ మందిలో ఉన్నాయి. ప్రతి దానికీ డీలా పడిపోవడం, ఏమవుతుందోనని భయం, ఆందోళన వంటి జబ్బులతో సతమతమవుతున్నారు. వైద్యుల వద్దకు చికిత్సకు వెళ్లాలంటే కూడా ఆత్మన్యూనతగా భావిస్తున్నారు. ఇలాంటి మానసిక వ్యాధులు దీర్ఘకాలికంగా ఉండటంతో వృత్తిపరంగానూ ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇండోనేషియలో స్కిజోఫ్రెనియా కేసులు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇక మనదేశంలో సుమారు 3 మిలియన్ల కంటే ఎక్కువమంది స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్నారు. పనిఒత్తిడి, చిన్నచిన్న విషయాలకే ఆందోళన చెందడం వంటివన్నీ మానిసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. 

మానసిక రుగ్మతలకు ప్రధాన కారణాలు

► ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై చిన్నకుటుంబాలు రావడంతో వేధిస్తున్న ఒంటరితనం.
► ఆరు సంవత్సరాల వయసు నుంచే సామాజిక మాధ్యమాల ప్రభావం ఎక్కువగా ఉండటం.
► మద్యం, ఇతర మత్తుపదార్థాల వినియోగంతో యువకుల్లో మానసిక రుగ్మతలు పెరగడం.
► ప్రైవేటు లేదా కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో విపరీతమైన ఒత్తిడి.
► సాఫ్ట్‌వేర్‌, బ్యాంకింగ్‌ వంటి ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరగడం.
► వ్యాయామం లేకపోవడం వల్ల చిన్న వయసులోనే జీవనశైలి జబ్బులకు గురవడం.
► ఇటీవలి కాలంలో స్మార్ట్‌ ఫోన్‌ల ప్రభావంతో చిన్నారుల్లో మానసిక ఎదుగుదల సరిగా లేకపోవడం.

ఒత్తిడిని అధిగమిద్దాం ఇలా..

మనుషులు పలు కారణాలతో అనేక రకాల ఒత్తిడులకు గురవుతుంటారు. అవి శారీరక, మానసిక ఒత్తిడి అని రెండు రకాలుంటాయి. ఆరోగ్యం కాపాడుకుంటే శారీరక ఒత్తిడిని జయించవచ్చు. మిత ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం, నిత్యం యోగా చేయడం, వృత్తిపరమైన శిక్షణతో మానసిక ఒత్తిడిని అధిగమించొచ్చు.

వ్యాపారంలో సరైన లాభాలు రాకపోవడం, అధిక పని, పదోన్నతి లేని ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. చేసే పనిని ప్రేమించాలి. వృత్తిపరంగా గెలుపు, ఓటములు ఉంటాయి. ఓటమిని సవాల్‌గా స్వీకరించి విశ్లేశించుకుని ముందుకెళ్లాలి. స్ఫూర్తిదాయక వ్యక్తుల మధ్య గడపడం, మంచి పుస్తకాలు చదవడం, అనవసర ఆలోచనలు, చికాకులను దూరం పెట్టడం ద్వారా సంతోషమైన జీవితాన్ని గడపాలి.

మరిన్ని వార్తలు