అమ్ముడుపోని చెరకుతో వెనిగర్‌ తయారీ.. భారీ లాభాలు గడిస్తున్న యూపీ రైతు

12 Jul, 2022 08:59 IST|Sakshi

చెరకు రసంతో వెనిగర్‌ తయారీతో మంచి ఆదాయం పొందుతున్న యూపీ రైతు కుటుంబం 

వెనిగర్‌ తయారీకి ఆర్నెల్లు.. రెండేళ్ల వరకు వాడుకోవచ్చు

ఉత్తరప్రదేశ్‌లో ఆరోగ్య పానీయంగా ప్రజాదరణ

చెరకును ఫ్యాక్టరీ వాళ్లు కొనకపోతే రైతుకు ఏం చేయాలో తోచదు. అయితే, అమ్ముడు పోని చెరకుతో వెనిగర్‌ తయారు చేసి చక్కని ఆదాయం గడిస్తూ ఆశ్చర్యపరుస్తున్నది ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ రైతు కుటుంబం. సీతాపూర్‌ జిల్లా చావ్‌బిర్వ గ్రామానికి చెందిన 50 ఏళ్ల రామ్‌కిషోర్‌ మిశ్రా, ఆయన సోదరులు హిమాంశు మిశ్రా, శ్యాంకిశోర్‌ మిశ్రాలతో కలిసి ఉమ్మడిగా వ్యవసాయం చేస్తున్నారు. తమకున్న 50 ఎకరాల్లో చాలా ఏళ్లుగా చెరకుతోపాటు ఇతర పంటల సాగుతోపాటు పశుపోషణ చేస్తున్నారు.

గతంలో ఫ్యాక్టరీకి తోలగా మిగిలిపోయిన చెరకు వృథా అయ్యేది. ఇలా మిగిలిన చెరకును ఎలా ఉపయోగించాలా అని కొద్ది నెలల క్రితం ఆలోచిస్తుండగా.. చిన్నప్పుడు తమ బామ్మ తయారు చేసిన ఆరోగ్య పానీయం వెనిగర్‌ (సిర్కా) గుర్తొచ్చింది. ఇక ఆలస్యం చేయకుండా వెనిగర్‌ తయారు చేసి, ప్లాస్టిక్‌ బాటిల్స్‌లో నింపి రిటైల్‌ మార్కెట్‌లో అమ్మటం ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. దగ్గరి పట్టణ ప్రాంతాలకే కాకుండా రాజస్థాన్‌ మార్కెట్ల నుంచి కూడా వీరికి ఆర్డర్లు వస్తుండటం విశేషం. ఇప్పటికే 7 వేల లీటర్లు విక్రయించారు. ప్రతి నెలా రూ. 20 వేల వరకు వెనిగర్‌ ద్వారా ఆదాయం గడిస్తున్నారు. 

ఇంతకీ దీన్ని ఎలా తయారు చేస్తున్నారంటే.. చెరకు రసాన్ని పరిశుభ్రమైన ప్లాస్టిక్‌ డ్రమ్స్‌లో నింపి, గ్యాస్‌ బయటకు పోయేందుకు చిన్న బెజ్జం ఉంచి, బిగుతుగా మూత పెట్టేస్తారు. మూడు నెలల తర్వాత మూత తీసి.. అప్పటికే సిద్ధంగా ఉన్న పాత వెనిగర్‌ను ఈ డ్రమ్ముల్లో మజ్జిగ తోడు మాదిరిగా కొద్ది పరిమాణంలో కలుపుతారు. మరో మూడు నెలలకు.. (అంటే మొత్తం ఆర్నెల్లకు) వెనిగర్‌ వినియోగానికి సిద్ధమవుతుందని హిమాంశు మిశ్రా తెలిపారు.

అయితే, దీనికి తేమ చేతులు తగలకూడదు. పరిశుభ్రత పాటించకపోతే మొత్తం పాడై చెడువాసన వచ్చి పనికిరాకుండా పోతుందన్నారు. వెనిగర్‌ను ఏ దశలోనూ మెటల్‌ కంటెయినర్లలో పోయకూడదు. ఫైబర్‌ లేదా ప్లాస్టిక్‌ డ్రమ్ములు, సీసాలు వాడాలి. 600 ఎం.ఎల్‌. ప్లాస్టిక్‌ సీసాల్లో నింపి, రూ. 70కి విక్రయిస్తున్నారు. ఖాళీ బాటిల్‌ రూ.7, స్టిక్కర్‌ రూ.5తో కలిపి ఒక సీసా వెనిగర్‌ ఉత్పత్తి ఖర్చు రూ. 25 వరకు అవుతుందని హిమాంశు వివరించారు. 

వెనిగర్‌ను తీసుకునే వారికి రక్తపోటు తగ్గుతుందని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని, పొట్ట భాగంలో కొవ్వు కరుగుతుందని, జీర్ణశక్తి పెరుగుతుందని, చర్మ సౌందర్యం ఇనుమడిస్తుందని మిశ్రా సోదరులు చెబుతున్నారు. తయారైన తర్వాత రెండేళ్లు ఇది నిల్వ ఉంటుందంటున్నారు.   

మరిన్ని వార్తలు