Zinc Rich Diet: వీటిలో జింక్‌ పుష్కలంగా ఉంటుంది.. ఇవి తింటే!

20 Sep, 2021 12:23 IST|Sakshi

మన శరీరానికి విటమిన్లతోపాటు మినరల్స్‌ (ఖనిజాలు) కూడా తగుమోతాదులో అవసరమే! అంటే కాల్షియం, మాగ్నిషియం, ఐరన్‌ వంటివి మనల్ని ఎ‍ల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో సహాయపడతాయి. వాటిల్లో ముఖ్యమైన ఖనిజం జింక్‌. మన శరీరంలో ఈ ఖనిజం నిర్వహించే ముఖ్య విధులు, ప్రాధాన్యతల గురించి తెలుసుకుందాం..

జింక్‌ను ఎందుకు తీసుకోవాలి?
మన వ్యాధినిరోధక వ్యవస్థ వివిధ అలర్జీలు, వ్యాధులు, వైరస్‌ల నుంచి మనల్ని కాపాడుతూ ఉంటుంది. అందుకే కోవిడ్‌ సంక్షోభ కాలంలో అందరి దృష్టి ఇమ్యునిటీ పై పడింది. మరి ఇమ్యునిటీ ఏవిధంగా పెంచుకోవాలి? అనే అంశంపై చాలా మందికి క్లారిటీ లేదు. ముఖ్యంగా విటమిన్‌ ‘సి’, ‘డి’ లతో పాటు జింక్‌ ఖనిజం కూడా ఇమ్యునిటీ పెంపునకు తోడ్పడుతుంది.

మన శరీరంలో జింక్‌ నిర్వహించే పాత్ర ఏమిటి?
మానవ శరీరంలో అనేక జీవక్రియలతో జింక్‌ సంబంధం కలిగి ఉంటుంది. భిన్న కణసంబంధ ప్రక్రియల్లో కీలకంగా వ్యవహరిస్తుంది. ముఖ్యంగా ప్రొటీన్‌ సంశ్లేషణ, గాయాలు నయంచేయడానికి, కణ విభజనకు, డీఎన్‌ఏ సమన్వయానికి కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా సంభవించే జలుబు, హైపోథైరాయిడ్‌ నివారణకు, జీర్ణ వ్యవస్థకు, హృదయ సంబంధింత వ్యాధుల నుంచి రక్షణ, చర్మ మరియు కంటి ఆరోగ్యానికి, రుచి, వాసన పసిగట్టడానికి ఇది అవసరం. అంటువ్యాధులతో పోరాడి రక్షణ కల్పించడంలో జింక్‌ మరింత సమర్ధవంతంగా పనిచేస్తుందని ప్రపంచ వ్యాప్త పరిశోధనల్లో రుజువైంది.

జింక్‌ తగుమోతాదులో తీసుకోకపోతే ఏమౌతుంది?
మానవ శరీరం దానంతట అది జింక్‌ను ఉత్పత్తి చేసుకోలేదు, అలాగే నిల్వ చేసుకునే అవకాశం కూడా లేదు. కేవలం ఆహారం ద్వారా మాత్రమే అది శరీరానికి అందుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గణాంకాల ప్రకారం యేటా సుమారు 8 లక్షల మంది జింక్‌ కొరతతో మరణిస్తున్నారు. వారిలో సగానికిపైగా 5యేళ్లలోపు పిల్లలు ఉండటం గమనార్హం.

జింగ్‌ లోపిస్తే రోగనిరోధక వ్యవస్థ పనితీరు సన్నగిల్లి, క్రమంగా ప్రాణాంతకంగా మారే అవకాశం ఎక్కువ. సెల్యులర్‌, సబ్‌ సెల్యులర్‌ స్థాయిల్లో అకాల కణ విచ్ఛిన్నానికి దారితీస్తుంది. అంతేకాకుండా ఆకలి మందగించడం, గాయాలు నెమ్మదిగా మానడం, పేగు సంబంధిత వ్యాధులు, మొటిమలు, మానసిక రుగ్మతలు తలెత్తడం, జుట్టు రాలడం, బ్లడ్‌ షుగర్‌ సమస్యలు, సంతాన వైఫల్యం వంటివి సంభవించవచ్చు.

ఒక రోజుకు ఏంత పరిమాణంలో జింక్‌ అవసరం?
జింక్‌ చాలా సూక్ష్మస్థాయిలో మాత్రమే మన శరీర ఆరోగ్యానికి అవసరం అవుతుంది. అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ ప్రకారం ఒక రోజుకు మహిళలకైతే 8 గ్రాములు, పురుషులకు11 గ్రాముల జింక్‌ అవసరం అవుతుందని వెల్లడించింది. గర్భం దాల్చిన మహిళలకైతే రోజుకు 11 గ్రాములు, పాలిచ్చే తల్లులకు 12 గ్రామలు జింక్‌ అవసరం అవుతుంది.

జింక్‌ పుష్కలంగా లభించే ఆహారం
►మాంసాహారంలో, నత్తగుల్లల్లో, పౌల్‌ ట్రీ ఉత్పత్తుల్లో జింక్‌ పుష్కలంగా ఉంటుంది.
►మొక్క సంబంధిత ఆహారంలో సాధారణంగా జింక్‌ స్థాయిలు తక్కువగా ఉంటాయి. మాంసాహారంతో పోలిస్తే శాఖాహారంలో జింక్‌ లభ్యత తక్కువ. అయినప్పటికీ బ్రెడ్‌, చిక్కుళ్లు, కాయధాన్యాలు, పప్పుధినుసులు మొదలైన వాటిల్లో జింక్‌ లభ్యత ఉంటుంది. అలాగే కొన్ని వంటలను కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో వండటం లేదా మొలకెత్తించడం ద్వారా కూడా దీనిని పొందుకోవచ్చు. అంటే బీన్స్‌, ధాన్యాలు, విత్తనాలను నానబెట్టడం, వేయించడం, పులియబెట్టడం ద్వారా జింక్‌ లభ్యతను పెంపొందించుకుని ప్రయోజనం పొందవచ్చు. 
►మన దేశంలో అనేక మంది ధాన్యపు ఆహారఅలవాట్లు కలిగి ఉండటం వల్ల జింక్‌ హీనత అధికంగా కనిపిస్తుంది. కొన్ని సార్లు మాంసాహారులకంటే శాకాహారులకే 50 శాతం అధికంగా జింక్‌ అవసరం అవుతుంది. అందుకు ఉత్తమ మార్గం ఏమిటంటే... పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు, కాయధాన్యాల్లో పుష్కలంగా జింక్‌ ఉంటుంది. అలాగే వాల్‌నట్స్‌, బాదం పప్పు, జీడి పప్పు, పొద్దు తిరిగుడు, గుమ్మడి, పుచ్చకాయ విత్తనాలు వంటి గింజల ద్వారా జింక్‌ కొరతను భర్తీ చేయవచ్చు. అలాగే అవకాడో పండు, జామ, పుట్టగొడుగులు, బచ్చలికూర, బ్రకోలి క్యాబేజిలలో కూడా జింక్‌ నిండుగా ఉంటుంది. 

కాబట్టి పటిష్టమైన ఇమ్యునిటీని పెంపొందించడంలో జింక్‌ ప్రాధాన్యత ఎనలేనిది. కోవిడ్‌ నుంచే కాకుండా ఇతర అంటురోగాలు, వ్యాధుల నుంచి మన శరీరానికి రక్షణ కల్పించడంలో జింక్‌ కూడా అవసరమేనని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆహార అలవాట్లతో మీ ఆరోగ్యాన్ని మరింత పదిలంగా కాపాడుకోండి.

చదవండి: Facts About Hair: ఒక వెంట్రుక వయసు దాదాపుగా ఇన్నేళ్లు ఉంటుందట!!

మరిన్ని వార్తలు