చెట్లకు కూడా చెవులుంటాయి!

15 Feb, 2021 08:46 IST|Sakshi

చెట్లు కూడా ప్రాణమున్న జీవులేనని భారతీయ శాస్త్రవేత్త జగదీశ్‌ చంద్రబోస్‌ ప్రయోగపూర్వకంగా వివరించారు. అయితే వీటిలో ఇతర జీవుల్లో కనిపించే చలనావయవాలుండవు. మొక్కలకు ప్రాణముందని తెలిసినా, ఇతర జీవజాతుల్లాగా చేతన(కాన్షియస్‌నెస్‌) ఉండదని ఎక్కువమంది భావిస్తారు. కానీ తాజాగా జరిపిన అధ్యయనాల్లో మొక్కల్లో కూడా చేతనత్వం, స్మృతి, వివేకం ఉంటాయట..!

లండన్, స్పెయిన్, కెనెడాలోని వేర్వేరు యూనివర్సిటీలు మొక్కల్లో చేతనపై ప్రయోగాలు జరిపాయి. 20 బీన్స్‌ మొక్కలను కుండీల్లో నాటి, వాటిలో కొన్నింటిని ఒంటరిగా వదిలేశారు, కొన్నింటికి 30 సెంటీమీటర్ల దూరంలో చిన్న కర్రముక్కను పాతారు. వీటి కదలికలను టైమ్‌లాప్స్‌ ఫొటోగ్రఫీ ద్వారా అధ్యయనం చేశారు. కర్రముక్క దగ్గరగా ఉన్న మొక్కలు, ఆ కర్రముక్క ఆనవాలు పసిగట్టి తదనుగుణంగా చిగుర్లు వేస్తూ గ్రోత్‌ ప్యాట్రన్స్‌ను నిర్దేశించుకున్నట్లు అధ్యయనంలో తెలిసింది. అంటే మొక్కలు తమ దగ్గరలో ఉండే వస్తువుల ఉనికిని గుర్తిస్తాయని తెలుస్తోంది. 

జ్ఞానేంద్రియాలు లేకున్నా..
ప్రత్యేకంగా జంతువుల్లో ఉన్నట్లు మొక్కల్లో చెవుల్లాంటి అవయవాలు లేకున్నా, పక్కన ఆబ్జెక్ట్స్‌ ఉనికినైతే గుర్తించగలవని నిరూపితమైంది. అంతమాత్రాన వీటికి పూర్తిస్థాయి చేతన ఉంటుందని ఇప్పుడే చెప్పలేమని ఈపరిశోధనల్లో పాల్గొన్న సైంటిస్టు డా. విసెంటె రాజా చెప్పారు. ఒకవేళ మొక్కలకు చేతన ఉండేట్లయితే అది ఎక్కడ నుంచి వస్తుందనే విషయమై ఎంతోకాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. 2006 నుంచి ప్లాంట్‌ న్యూరోబయాలజీ అనే శాఖను అధికారికంగా ప్రారంభించారు. జంతువుల్లోలాగే మొక్కల్లో కూడా విద్యుదయిస్కాంత సిగ్నలింగ్‌ ద్వారా చేతన పుడుతుందని ప్రాధమికంగా అంచనాకు వచ్చారు. ఈ భావనను వ్యతిరేకించే పరిశోధకులు కూడా ఉన్నారు.

మొక్కలకు ఎలాంటి చేతన ఉండదని కాలిఫోర్నియా యూనివర్సిటీ సైంటిస్టు లింకన్‌ టైజ్‌ చెబుతున్నారు. అలాంటి వ్యవస్థకు తగిన నిర్మితి ఏదీ చెట్లలో ఉండదని, అందువల్ల చెట్లకు చేతన అనేది వట్టిమాటని ఆయన అభిప్రాయం. కానీ మొక్కలకు కూడా చేతన ఉంటుందనేది నిర్విదాంశమని, ఇకపై జంతువులకు మాత్రమే ఇది సొంతమని భావించే వీలు లేదన్నది ఎక్కువమంది సైంటిస్టుల మాట. సో.., ఈ సారి చెట్ల దగ్గర మాట్లాడేటప్పుడు జాగ్రత్త! అవి వింటాయేమో!


 

మరిన్ని వార్తలు