ట్రెండ్‌ మారుతోంది.. అలాంటి ఇళ్లే కావాలంట!

26 Jul, 2021 12:42 IST|Sakshi

పల్లె అందం ఇప్పుడు పట్టణపు ఇళ్లలో కనువిందు చేస్తోంది. పాత తరం ముచ్చట నట్టింట కళాత్మకమై కొలువుదీరుతోంది. డిజటల్‌ యుగంలో కాంక్రీట్‌ క్లీనింగ్‌ బోర్‌ అనుకున్నవారు మట్టివాసనకు చేరువలో ఉండాలని తపిస్తున్నారు. అందుకే, ఇటుక కనిపించేలా గోడలు, నగిషీలు చెక్కిన వుడ్‌తో ఫర్నిచర్, మసకబారిన బ్రాస్‌ కలెక్షన్‌ వైపు మొగ్గుచూపుతున్నారు. ఇల్లు, కార్యాలయం, కాఫీషాప్‌.. వంటి వాటికి ఔట్‌ సైడ్‌ బ్రిక్‌ స్టైల్‌ డిజైన్స్‌ చూస్తుంటాం. అయితే, ఇప్పుడిది ఇంటీరియర్‌కి ట్రాన్స్‌ఫర్‌ అయ్యింది. దీంతో పాటే వింటేజ్‌ స్టైల్‌ సింపుల్‌ అండ్‌ గ్రాండ్‌ లుక్‌తో ఆకట్టుకోవడం కూడా ఇప్పుడీ స్టైల్‌ నగరవాసులకు ప్రియమైన డెకార్‌గా మారింది. 

నిర్లక్ష్యమే అందం
ఇటుకను ప్రకృతిలోని దృశ్యాన్ని ఇంట్లోకి తీసుకువచ్చే ఒక మార్గంగా చెప్పుకోవచ్చు. గది నాలుగు గోడలలో ఒక గోడను ప్రత్యేకంగా డిజైన్‌ చేయడం ఇంటి అలంకరణలో ఎప్పటి నుంచో ఉన్నదే. ఇప్పుడదే పాత పుంతలను తొక్కుతోంది. లివింగ్‌ రూమ్, బెడ్‌రూమ్‌లలో ఒక వైపు ఇటుక గోడ రస్టిక్‌ ఫీల్‌ను ఇస్తుంది. సిమెంట్‌ తాపీ పని లేకుండా నిర్లక్ష్యంగా వదిలేశారనిపించేలా ఉండే ఎగుడుదిగుడుల ఇటుక గోడ క్రియేటివ్‌ స్పేస్‌గా మారిపోయింది. ఈ ఇటుక గోడపైన ఓల్డ్‌ స్టైల్‌ వాల్‌ ఫ్రేమ్స్‌ కొత్తగా కనువిందు చేస్తున్నాయి. దీనికి తగ్గట్టు బ్లాక్‌ అండ్‌ బ్రౌన్‌ కలర్‌ వుడెన్‌ లేదా ఐరన్‌ ఎలాంటి హంగులు అవసరం లేకుండానే వింటేజ్‌ లుక్‌ను తీసుకువస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఇంటీరియర్‌ డిజైన్‌లో ఇటుక ప్రధాన ఆకర్షణగా మారింది. 

వాల్‌ పేపర్‌తో వింటేజ్‌ లుక్‌
ఇంటి లోపల ఇటుక గోడ పెట్టక్కర్లేదు. రస్టిక్‌ లుక్‌ ఉన్న బ్రిక్‌ స్టైల్‌ వాల్‌పేపర్‌తో గది గోడను మార్చుకోవడం సులువు అవుతుంది. పెద్దగా ఖర్చూ ఉండదు. మార్చుకోవడం సులువు. అద్దె ఇంట్లోనైనా అనుకున్న లుక్‌ని ఆస్వాదించవచ్చు. 

ఫ్రేమ్‌ స్టైల్‌ బ్రిక్‌
లివింగ్‌ రూమ్‌ లేదా డైనింగ్‌ రూమ్‌లలో ఒక ఫ్రేమ్‌ స్టైల్‌లోనూ ఇటుక గోడను డిజైన్‌ చేసుకోవచ్చు. చుట్టుపక్కల తెల్లటి నున్నని గోడల మధ్య వెడల్పాటి ఇటుక గోడ ఒకటి ఫ్రేమ్‌స్టైల్‌లో డిజైన్‌ చేస్తే కళాత్మకతలో అదొక అందమైన ప్రదేశంగా మారిపోతుంది. సర్కిల్‌లా గుండ్రటి స్టైల్‌ మట్టి ఇటుక వచ్చేలా డిజైన్‌ చేస్తే ఇంటిలోపల యూనిక్‌ లుక్‌ కనువిందు చేస్తుంది. ఒక ఆర్ట్‌ వర్క్‌లా మారిపోతుంది. మరింత క్రియేటివ్‌గా మార్చుకోవాలంటే దీనికి కలపతో డిజైన్‌ చేసిన హ్యాంగింగ్స్‌ను ఉపయోగించుకోవచ్చు. 

పార్టిషన్‌ వాల్‌
హాల్‌లో కొంత భాగం పార్టిషన్‌ చేసుకోవాలంటే అందుకు మిర్రర్, వుడ్‌ ఇతరత్రా ఆలోచనలు చేస్తారు. సన్నని ఇటుక గోడ పార్టిషన్‌తో భిన్నమైన కళ తీసుకురావచ్చు. ఇక ఈ ఇటుక గోడలకు వైట్‌ వాష్‌ లేదా బ్లాక్‌ వాష్‌ ఐడియాలతో కొత్త కళను తీసుకురావచ్చు. 

తరతరాల ముచ్చట
పాత ఇంటి గోడలపై పెయింట్‌ చేసిన బొమ్మలు, ముగ్గులు, పిల్లల ఆటల్లో వారు గీసిన రేఖాచిత్రాలు .. ఇవన్నీ ఇప్పుడు ఇంటిలోపల గోడపై కనువిందు చేయడం విశేషమైపోయింది. ఆ మనోహర దృశ్యాలకు తమ ఇల్లు వేదికైందని మురిసిపోతున్నారు నవతరం కళాప్రియులు.  

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు