కబళించనున్న వాయుకాలుష్యం

20 Apr, 2022 12:10 IST|Sakshi

మన దేశంలో ఇటీవలి కాలంలో పెరిగిన వాయు కాలుష్యంతో మరణించిన వారి సంఖ్య గత రెండు దశాబ్దాలలో రెండున్నర రెట్లు పెరిగింది. ఏటా ఈ వాయు కాలుష్యానికి 70 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా లెక్కలు చెబుతున్నాయి. కచ్చితంగా చెప్పాలంటే 2019లో ప్రపంచ వ్యాప్తంగా సంభ వించిన వాయుకాలుష్య మరణాలలో మన దేశంలోనే 25 శాతానికి పైగా నమోదయ్యాయని ‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’ తాజా నివేదిక చెబుతోంది.

ఈ నివేదిక ప్రకారం ఒక్క 2019 లోనే ప్రపంచ వ్యాప్తంగా వాయుకాలుష్యం కాటుకు 66.7 లక్షల మంది బలయ్యారని తెలుస్తోంది. ఇందులో 16 లక్షల మరణాలు భారత్‌లోనే నమోదయ్యాయట. వాయు కాలుష్యం కారణంగా 2019లో ప్రపంచంలో పుట్టిన నెలలోపే ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల సంఖ్య 4.76 లక్షలు కాగా, మన దేశంలో అది 1.16 లక్షలుగా నమోదయింది. ప్రపంచంలో 99 శాతం మంది ప్రజలు పీలుస్తోంది కలుషిత గాలేనని డబ్లు్యహెచ్‌ఓ కుండ బద్దలు కొడుతోంది.  

ప్రస్తుత పరిస్థితుల్లో కొనసాగుతున్న కర్బన ఉద్గారాల విడుదల రానున్న కాలంలో మరింత పెరిగితే ప్రపంచ దేశాలన్నీ వాతావరణ మార్పుల ముప్పు బారిన పడతాయని ‘ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానల్‌ ఫర్‌ క్లైమేట్‌ ఛేంజ్‌’ (ఐపీసీసీ) తన తాజా అధ్యయనంలో హెచ్చరించింది. మానవ కల్పిత వాతావరణ మార్పులు ప్రపంచ దేశాలన్నింటిపైనా తీవ్ర విపరిణామాలు చూపుతున్నాయని ఐపీసీసీ కమిటీ ఛైర్మన్‌ హో సెంగ్‌ లీ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ వాతావరణ మార్పులకు బడుగు బలహీన వర్గాల ప్రజలు, వారికి సంబంధించిన మౌలిక వసతుల వ్యవస్థలు దెబ్బ తింటున్నాయని ఆయన వ్యాఖ్యా నించారు. ఈ మానవకల్పిత వాతావరణ మార్పులకు మన దేశంలో లక్నో, పట్నా నగరాలు ప్రధానంగా గురవు తున్నా... అనేక ఇతర నగరాలూ ప్రమాదపుటంచుల్లో ఉన్నాయి.

దీనికి తోడు గత రెండేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌ మహమ్మారి కారణంగా ఒకసారి వాడి పడేసే (సింగిల్‌ యూజ్‌) ప్లాస్టిక్‌ వినియోగం పెరిగి కాలుష్యం మరింత పెరిగిపోయింది.  కర్బన ఉద్గారాలు ప్రస్తుత స్థాయిలోనే కొనసాగితే ఈ శతాబ్ది చివరి నాటికి వాతావరణ ఉష్ణోగ్రతలు ప్రపంచ వ్యాప్తంగా 30 డిగ్రీలకు పైగా పెరిగే ప్రమాదం వుందని ఐపీసీసీ ఛైర్మన్‌ హెచ్చరిస్తున్నారు. 

రానున్న కాలంలో వాతావరణ మార్పుల బాధితులను ఆదుకునేందుకు భారత్‌ సిద్ధమవుతోందని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. వాతావరణ మార్పుల బాధితు లను ఆదుకునేందుకు ఇప్పటికే జాతీయ స్థాయి నిధినీ, ‘విపత్తు నివారణ మౌలిక వసతుల వ్యవస్థ’నూ ఏర్పాటు చేశామనీ, 2030 నాటికి మన విద్యుత్‌ ఉత్పత్తి అవసరాలకు దేశం శిలాజ ఇంధనాల వినియోగాన్ని 30 శాతానికి తగ్గించుకునేందుకు 2015 నాటి పారిస్‌ ఒప్పందంలో అంగీకరించిందనీ ప్రభుత్వం గుర్తు చేసింది. 

ప్రస్తుతం ప్రపంచాన్ని వేధిస్తున్న వాతావరణ మార్పుల సమస్యకు అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచ దేశాలన్నీ ఒక్కతాటి మీదకు రావల్సిన అవసరం వుంది. మన దేశంలో పర్యావరణ మండలి వంటి వ్యవస్థ ఏర్పాటు చేయవలసి ఉంది. దీన్ని ఏర్పాటు చేస్తే 2070 నాటికి పర్యావరణ పరిరక్షణకు అవసరమైన కర్బన ఉద్గారాలకు అడ్డుకట్ట వేయా లన్న లక్ష్యసాధనకు చేరుకోవచ్చు. (చదవండి: ఎరువుల వెతలకు శాశ్వత పరిష్కారం!)

నవీన నాగరికతకు అనుగుణంగా పెరుగుతున్న మన ఇంధన అవసరాలను తీర్చుకునే క్రమంలోనే వాతావరణ మార్పులు పెరుగుతున్నాయి. బొగ్గు, చమురు, సహజ వాయువు వంటి శిలాజ ఇంధనాల వినియోగంతో వెలువ డుతున్న ఉద్గారాలు ప్రపంచాన్ని ప్రమాదపుటంచుకు చేరుస్తున్నాయి. ఈ ఉద్గారాలతో కేవలం ధరిత్రి మాత్రమే, కాదు ఇంధన విపణి కూడా ఉడికిపోతోంది. ఈ ధరల పెరుగుదలతో అయినా హరిత, స్వచ్ఛ ఇంధన భవిష్యత్తు దిశగా మనం ప్రయాణిస్తామా అన్న సందేహం తలెత్తు తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఉక్రెయిన్‌ రష్యా యుద్ధం చమురు సరఫరాలకు విఘాతం కలిగిస్తోందని చెప్పక తప్పదు. దీనితోనయినా మనం స్వచ్ఛ ఇంధన భవిష్యత్తు దిశగా అడుగులు వేయాలన్న ఆకాంక్ష అందరిలోనూ వ్యక్తమవుతోంది. (చదవండి: వ్యవసాయరంగంలో నిశ్శబ్ద విప్లవం)

- కేవీ రమణమూర్తి 
సీనియర్‌ పాత్రికేయులు

మరిన్ని వార్తలు