విద్యార్థిని చెక్కే శిల్పి... ఉపాధ్యాయుడు

5 Sep, 2021 01:23 IST|Sakshi

సందర్భం

‘వ్యక్తిత్వాన్ని నిర్మించే, మనోబలాన్ని పెంచే, బుద్ధి వైశాల్యాన్ని విస్తరించే, ఒక మనిషిని తన కాళ్ల మీద తాను నిలబడేలా చేసే విద్య మనకు కావాలి’ అంటారు స్వామి వివేకానంద. ఒక బలమైన దేశా నికి నిజమైన మూలాధారం ఉపాధ్యా యులే. వారి ప్రయత్నాలే నూతన తరాల భవిష్యత్‌ను కాంతిమయం చేస్తాయి.

ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకొం టున్న సందర్భంలో డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను గౌరవంగా స్మరించుకుంటాం. దౌత్యవేత్త, పండితుడు, అన్నింటికీ మించి గొప్ప ఉపాధ్యాయుడు అయిన సర్వేపల్లి, దేశానికి రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. అందరినీ కలుపుకొని పోయేలా సమాజాన్ని మార్చేందుకు విద్య అనేది ముఖ్యమైన సాధనం అని ఆయన భావించారు. టీచర్‌ అంటే కేవలం తరగతి గదికే పరిమితమైన వారు కాదు. దానికి మించిన పాత్ర వాళ్లు పోషిస్తారు. బోధన అనేది నిరంతర ప్రక్రియ. ఉపాధ్యాయులు చురుగ్గా, సృజన శీలంగా, పట్టు వదలని విక్రమార్కుల్లా, ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకునేలా, కాలానుగుణంగా పాత చింతకాయ భావాలను వదిలేసేలా ఉండాలి. అప్పుడే వాళ్లు అత్యుత్తమమైన మానవ వనరులను సృష్టించగలరు. జీవితంలో ఎదురయ్యే ఆటు పోట్లను తట్టుకోగలిగేలా విద్యార్థులను తీర్చిదిద్దగలరు.

అత్యున్నత విద్యాసంస్థల్లో చదివినప్పటికీ, కఠినతరమైన పరీ క్షల్లో విజయులైనప్పటికీ కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారన్న వార్తలు చదివినప్పుడు ప్రాణం విలవిల్లాడు తుంది. అందుకే బోధన అనేది కేవలం పిల్లల మెదళ్లలో జ్ఞాన తృష్ణను రగిల్చేదిగా మాత్రమే మిగలరాదు; వారి హృదయాలలో ఒక సానుకూల భావనను నెలకొనేట్టుగా చేయాలి. గూగుల్‌ ఎన్న టికీ గురువుకు ప్రత్యామ్నాయం కాజాలదు!

ఉపాధ్యాయులు విద్యా ప్రపంచంలో వస్తున్న నూతన పరి ణామాలపట్ల వారు ఎరుకతో ఉండాలి. కోవిడ్‌–19 మహమ్మారి మనకు ఆన్‌లైన్‌ బోధన ప్రాధాన్యతను తెలియపర్చింది. అందుకే టీచర్లు సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న కొత్త సాధనాలైన కృత్రిమ మేధ, వస్తు అంతర్జాలం, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ, డిజిటల్‌ క్లాస్‌ రూమ్స్‌ లాంటి వాటిపట్ల సాధికారత కలిగివుండాలి. డిజిటల్‌ నాలెడ్జ్‌ బ్యాంకును సృష్టించాలి. మన చిన్నారుల ఐక్యూను విశే షంగా పెంచడం మన లక్ష్యం కావాలి. వచ్చే సమస్యలకు వాళ్లే పరిష్కారాలు ఇవ్వగలిగేట్టు చేయాలి. ఆలోచన, చర్చ, ప్రయోగం అనేవి బోధనా శైలిలో ముఖ్యాంశాలు కావాలి. అప్పుడు మాత్రమే మనం నాయకులను, శాస్త్రవేత్తలను సృష్టించగలం.

మెడికల్‌ సైన్స్, టెక్నాలజీ, మేనేజ్‌మెంట్, హ్యుమానిటీస్, సైన్స్‌లాంటి విద్యలోని ప్రతి రంగంలోనూ మనం శీఘ్రగతిన పురోగతి సాధించాం. ఐఐటీలు, ఐఐఎంలు, కేంద్ర, రాష్ట్ర విశ్వ విద్యాలయాలు ఈ రోజున విద్య గరపడంలో ఎంతో ముందు న్నాయి. అత్యున్నత విద్యా సంస్థల్లో 2019–20 సంవత్సరంలో 3.85 కోట్ల మంది ఉన్నారు. 2018–19లో ఈ సంఖ్య 3.74 కోట్లు. అంటే 11.36 లక్షల పెరుగుదల. పాఠశాల విద్యలో కూడా మనం ఎన్నో రెట్ల స్థిరమైన ప్రగతిని సాధించాం. ఉపాధి ఏర్పరుచుకు నేలా, ఉద్యోగాలు సృష్టించేలా మన విద్యార్థులు, యువతకు స్థిరమైన సాధికారతనిచ్చేలా చేయడంలో మన సామూహిక కృషి, పట్టుదలకు ఈ సంఖ్యలు ఉదాహరణ. 

మనం గమనించవలసింది నిరుద్యోగిత, పేదరికం, అసమా నతలు, ఆఖరికి వివక్షలాంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కోవడానికి విద్య అనేది ఆచరణీయ పరిష్కారం. అందుకే సమాజంలోని బల హీన వర్గాలైన ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల చదువుల విషయంలో అదనపు కృషి అవసరం. పేదరికంవల్ల ఈ వర్గాల నుంచి ఎంతోమంది పిల్లలు చదువులు మానుకుంటున్నారు. వాళ్లను మనం పాఠశాలల్లో ఉంచేలా చేయాలి.

సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛా విలువలతో కూడిన నవ భారతం నిర్మించడంలో, ఆత్మ నిర్భర్‌ భారత్‌ స్వప్నాన్ని నెరవేర్చడంలో నూతన విద్యా విధానం–2020 ప్రాము ఖ్యతగల పనిముట్టు కాగలదు. మన విద్యా విధానం ఒకే మూసలో పోసినట్టుండే యంత్రాలను తయారుచేసేట్టుగా కాకుండా, నైపుణ్యం, దూరదృష్టి, హేతువుతో కూడిన బహుముఖ ప్రజ్ఞను అలవర్చేదిగా ఉండాలి. అందుకే నూతన విద్యా విధానం విద్యాసంబంధ కార్యకలాపాలకూ, సాంస్కృతిక, వృత్తి సంబంధ నైపుణ్యాలకూ మధ్య గట్టి గీత గీయడం లేదు. ఆరవ తరగతి నుంచే శిక్షణతో కూడిన వృత్తి సంబంధ విద్య ప్రారంభమ వుతుంది. కనీసం ఐదో తరగతి వరకు వారి మాతృ, ప్రాంతీయ భాషల్లో బోధన ఉంటుంది. ఇరవై ఒకటో శతాబ్దపు విద్యా విధానం సౌలభ్యం, సమత, అందుబాటు, జవాబుదారీతనం అనే మూలసూత్రాల మీద నిర్మితమైంది.

ఉపాధ్యాయులు పిల్లలను ఒక మాతృమూర్తిలా సంరక్షిం చాలి. మామూలు ఉపాధ్యాయుడు కేవలం తరగతి గది పాఠా లతో మాత్రమే విద్యార్థితో సంబంధంలో ఉంటాడు. కానీ మంచి ఉపాధ్యాయుడు దానికి మించి పిల్లల మనసుల్లో ముద్రవేయ గలుగుతాడు. మాకు భౌతికశాస్త్రం బోధించిన రామయ్య సర్, తెలుగు బోధించిన శేషాచార్య నాకు ఇప్పటికీ గుర్తున్నారు. వాళ్లు అద్వితీయమైన ఉపాధ్యాయులు.

విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య సరైన భావమార్పిడికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. మార్కులు, గ్రేడ్లు మాత్రమే ముఖ్యం కాదని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. విలువలు, వ్యక్తిత్వం, పట్టుదల, వినయం కూడా అంతే ముఖ్యం. ఉపా ధ్యాయ వృత్తి గొప్పది. భారతరత్న డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ రాష్ట్రపతిగా పదవీ విరమణ అనంతరం కూడా బోధన కొనసా గించారు. బోధన అనేది ఉద్యోగం కాదు; ఉత్తమ మానవులను తీర్చిదిద్దే ఒక మతం. మన ఉపాధ్యాయులు ఈ గొప్ప ధర్మాన్ని వ్యాపింపజేసే ప్రవర్తకులు. మీ త్యాగాల వల్ల ఎవరూ విస్మరణకు గురికాని నవభారతం సాకారమయ్యే కొత్త యుగంలోకి ప్రవేశి స్తామని నా విశ్వాసం. ‘ఒక మనిషి వ్యక్తిత్వం, అంతర్వా్యప్తి, భవి ష్యత్‌ రూపొందించగలిగే బోధన అనేది చాలా పవిత్రమైన వృత్తి’ అన్న అబ్దుల్‌ కలాం మాటలతో దీన్ని ముగిస్తాను.

వ్యాసకర్త:బండారు దత్తాత్రేయ
 హరియాణా గవర్నర్‌
(నేడు ఉపాధ్యాయ దినోత్సవం) 

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు