యుగకర్త చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

8 Aug, 2020 04:29 IST|Sakshi

నేడు చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి  150వ జయంతి

‘కవనార్థంబుదయించితిన్, సుకవితా కార్యంబు నా వృత్తి’ అని చెప్పుకున్నాడు చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి. చెప్పినట్లుగానే తెలుగునాట కవితా కల్యాణం చేయించి, జీవితాన్ని తరింపజేసుకున్న మహాకవి చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి. ఈయన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ తొలి ఆస్థానకవి. 1949లో, సాక్షాత్తు ప్రభుత్వ యంత్రాంగం మద్రాస్‌ నుండి తరలి విజయవాడ వచ్చి, ఈ పదవిని అందించింది. అంతటి ఘన చరిత్ర చెళ్లపిళ్లది. తిరుపతి వేంకటకవులుగా జగత్‌ ప్రసిద్ధులైన ఈ జంటలో అగ్రజుడు చెళ్లపిళ్ల. ఈ మహాకవి పుట్టి నేటికి 150 ఏళ్ళు పూర్తయ్యాయి. 1870, ఆగస్టు 8వ తేదీన తూర్పు గోదావరి జిల్లా కడియంలో జన్మించాడు. తల్లిదండ్రులు చంద్రమ్మ, కామయ్య. అతి సాధారణ కుటుంబ నేపథ్యం నుండి వచ్చి, తన  గళానికి, కలానికి ఎదురులేదని నిరూపించుకున్నాడు.

చిన్ననాడు చూసిన తాళపత్ర గ్రంథాలు చెళ్లపిళ్లపై అపురూపమైన ముద్ర వేశాయి. వీరి విద్యాభ్యాసం చాలా గ్రామాల్లో సాగింది. కాశీ కూడా వెళ్ళాడు. పాండిత్యంతో పాటు వివిధ సారస్వత అంశాలు గ్రహించి వచ్చాడు. కవితా జీవితంలో అవధానకవిగా నానా రాజ సందర్శనం చేసి అఖండ యశస్సు పొందాడు. ఎంతమంది దగ్గర విద్యాభ్యాసం చేసినా, చర్ల బ్రహ్మయ్యశాస్త్రినే ప్రధాన గురువుగా భావించాడు. వేంకటశాస్త్రిగా ప్రసిద్ధుడైన ఇతని అసలు పేరు వేంకటాచలం. జంటకవిత్వానికి, అవధాన విద్యకు, పద్యనాటకాలకు వీరు తెచ్చిన మోజు అంతా ఇంతా కాదు. తదనంతర జీవితంలో లబ్ధ ప్రతిష్టులైన ఎందరో కవి, పండితులు చెళ్లపిళ్ల శిష్యులే కావడం విశేషం. బందరు హైస్కూల్‌లో అధ్యాపకుడుగా పనిచేయడం చెళ్లపిళ్లకు బాగా కలిసొచ్చిన అంశం. విశ్వనాథ సత్యనారాయణ, వేటూరి ప్రభాకరశాస్త్రి, పింగళికాటూరి, వేలూరి శివరామశాస్త్రి వంటివారెందరో బందరులో స్కూల్లో ఈయన దగ్గర చదువుకున్నారు. వీరికి శిష్యగణం, శత్రుగణం, భక్తగణం అన్నీ ఎక్కువే. ఎవరినైనా సరే ఎదిరించాలి, గెలవాలి,  గుర్తింపు తెచ్చుకోవాలి, అనే  పట్టుదల చెళ్లపిళ్లకు మొదటి నుండీ ఉంది. గురువు శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి, శిష్యులు వేంకటరామకృష్ణకవులతోనూ విభేదాలు వచ్చాయి. సాటి కవులు, సంస్థాన పండితులు, దివాన్లతోనూ వివాదాలు వచ్చాయి. సంచలనాత్మకమైన యుద్ధం కొప్పరపు సోదరకవులతో జరిగింది. ఈ వివాదాలు ఆధునిక సాహిత్య చరిత్రలో సుప్రసిద్ధం. చెళ్లపిళ్ల గుంటూరుసీమ అనే గ్రంథమే రాయాల్సి వచ్చింది. లక్కవరం జమిందార్‌ రాజా మంత్రిప్రగడ భుజంగారావు బహద్దూర్‌ కలుగజేసుకొని, ఈ  వివాదాలకు ముగింపు పలికారు. వివాదాలు ఎలా ఉన్నా, అద్భుతమైన పద్యాలు తెలుగునాట సందడి చేశాయి.

చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి అనంత ప్రతిభామూర్తి. అద్భుతమైన ధారణ ఈయన సొత్తు. పద్య పఠనం పరమాద్భుతం. సంగీతజ్ఞానం కూడా మెండుగా ఉండేది. పద్యం ఎత్తుకోగానే అనేక రాగాలు అవలీలగా వచ్చి చేరేవి. శ్రీ రాగంలో ఎక్కువగా పాడేవారని చెబుతారు. ఉపన్యాసాలు సురగంగా ప్రవాహాలు. సందర్భోచితమైన శ్లోకాలు, పద్యాలు, పిట్టకథలు, సామెతలతో చెళ్లపిళ్ల ప్రసంగం చేస్తుంటే.. ప్రేక్షకులు మంత్రముగ్ధులై పరవశించేవారు. ‘మంచి కవిత్వం అంటే ఏమిటి’ అనే అంశంపై  విశాఖపట్నంలో రాజా విక్రమదేవ వర్మ ఇంట్లో, చెళ్లపిళ్ల 5 గంటలపాటు అనర్గళమైన ప్రసంగం చేశారు. ఆద్యంతం నాటకీయ ఫక్కీలో సాగిన ఆ ప్రసంగం అనన్య సామాన్యం. దీనికి ప్రత్యక్ష సాక్షి శ్రీశ్రీ. అద్భుతమైన ప్రసంగాన్ని అందించడంతో పాటు, విక్రమదేవ వర్మ నుండి చెళ్లపిళ్ల మూడువేల రూపాయలు కూడా అందుకున్నారు. ఆ రోజుల్లో మూడువేలంటే, ఈరోజుల్లో లక్షలు. వేంకటశాస్త్రికి ధిషణ, ధిషణాహంకారం, లౌక్యం అన్నీ ఎక్కువే. అదే సమయంలో మెత్తని మనస్సు కూడా. తన ఎద ఎల్ల మెత్తన, శిష్యులన్న ఎడదం గల ప్రేముడి చెప్పలేని మెత్తన అని అందుకే విశ్వనాథ అన్నాడు. 

చెళ్లపిళ్ల జంటకు కొప్పరపు సోదరకవులతో కొంత కాలం వివాదాలు నడిచినా, తదనంతరం, చెళ్లపిళ్ల దగ్గరుండి కొప్పరపుకవుల కుమారులతో అవధానాలు చేయించాడు. వానలో తడవని వారు, చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి కవితాధారలో మునగనివారు తెలుగు జగాన లేరు. అంతటి ఆకర్షణ, చమత్కారభరితమైన శైలి  చెళ్లపిళ్ల సొత్తు. తొలి రోజుల్లో, సంస్కృత సమాస చాలనా జ్వలితమైన కవిత్వం వ్రాసినా, తర్వాత కాలంలో తెలుగుకవిత్వం వైపు మళ్లారు. ఎన్నో కావ్యాలు, శతకాలు, అనువాదాలు, నాటకాలు రాశారు. పాండవ ఉద్యోగ విజయాలు అజరామరమైన ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. ఎందరో పద్యనటులు తెలుగునేలపై పుట్టుకువచ్చారు. ఎందరో కళాకారులకు అన్నం పెట్టి, అనంతమైన ఖ్యాతిని అందించిన ఆధునిక పద్యనాటక రాజాలు ఈ పాండవ ఉద్యోగ విజయాలు. సంప్రదాయ పద్య కవిత్వ ప్రక్రియలోనే, భారత కథలను వాడుకభాషలో రాసి, వాడుకభాషను శిఖరంపై  కూర్చోపెట్టిన ఘనత వీరిదే. తద్వారా, వాడుకభాషకు వీరు చేసిన సేవ అనుపమానం. 

అతి సామాన్యులకూ తెలిసే స్థితిలో నా కవిత్వం ఉంటుందని చెప్పుకున్న చెళ్లపిళ్ల, ఆ మాట అక్షరాలా నిలబెట్టుకున్నాడు. ఇదొక భాషాపరమైన విప్లవం. చెళ్లపిళ్లది ఎంతటి ధారాశుద్ధి బంధురమైన పద్య కవిత్వమో, అంతటి చక్కని వచన రచనం కూడా. చెళ్లపిళ్లవారి రచనలు చదవడం ప్రారంభిస్తే, చివరి అక్షరం వరకూ ఆగకుండా చదివిస్తాయి. అంతటి ఆకర్షణా శిల్పం ఆ రచనలో ఉంటుంది. కథలు– గాథలు, దీనికి చక్కని ఉదాహరణ. తిరుపతి కవిజంటలో మీసాలు పెంచింది కూడా ఈయనే. తెలుగు పద్యాన్ని ఏనుగుపై ఊరేగించాడు. పద్యాలను ప్రబంధాల కౌగిళ్ళ నుండి బయటకు తెచ్చి, ప్రజల నాలుకలపై నర్తనం చేయించాడు. ‘ఏనుగునెక్కినాము, ధరణీంద్రులు మొక్కగ నిక్కినాము’ అంటూ పద్యపౌరుషంతో జీవించిన యుగపురుషుడు చెళ్లపిళ్ల. తెలుగుపద్య జెండాపై నిలిచిన కవిరాజు, యుగకర్త చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి. 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్, కొప్పరపు కవుల మనుమడు

మాశర్మ

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా