సత్సంబంధాలతోనే ప్రయోజనం

23 Oct, 2021 01:03 IST|Sakshi

భారత్‌–చైనా సంబంధాలలో ఎన్ని ఘర్షణలు చోటు చేసుకుంటున్నా, ఇరుదేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలను వీలైనంతవరకు కొనసాగించడమే ఉత్తమం. ‘హిందీ– చీనీ భాయి భాయి’ అనే నినాదం స్థానంలో ‘హిందీ–చీనీ బైబై’ అనే నినాదానికి ప్రాచుర్యం ఇస్తున్న వారు ఈ ప్రపంచం మొత్తంగా పరస్పరాధారితం అనే వాస్తవాన్ని మర్చిపోతున్నారు. ప్రపంచీకరణ ఏదో ఒక రూపంలో దేశాలన్నింటికీ ఏకం చేసింది. ఈ నేపథ్యంలో దేశాల నడుమ పొర పొచ్చాలు ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రజల పాలిట శాపాలు కారాదు. ఇరు దేశాల ప్రజల అవసరాలు తీర్చడంలో అవి అడ్డంకులు కారాదు. ఈ ఎరుకతో పరస్పరం ప్రతి దేశం మరో దేశంతో పూర్తి సంయమనంతో అన్నింటా పాటించగలిగితే అది ఇరు దేశాల ప్రజల అభివృద్ధికి, అవసరాల్లో ఆదుకోవడానికి ఎంతైనా దోహదకారి అవుతుంది.

స్వతంత్ర దేశంపై మరొక దేశం దురాక్రమణ ఆక్షేపణీయం. దాన్ని ఆయా రీతులలో అన్నివిధాలా  ఎదుర్కోవలసిందే. మన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవలసినదే. కానీ దాని పేరుతో సమస్త సంబంధాలను విచ్ఛిన్నం చేసుకోనవసరం లేదు. సాకు దొరికింది కదా అని గతంలోని వాటిని తవ్వి తలకెత్తుకుని ఆడిపోసుకోనవసరం లేదు. మానవీయ సంబంధాలకు ఈపేరుతో ఉద్వాసన పలకనవసరం లేదు. దేశాల మధ్య పరస్పర సంబంధాలను కాదనటం, కాలదన్నటం అనైతికం. ఇది అమాయక ప్రజలలో దాగున్న భావోద్వేగాలను రెచ్చగొట్టడం తప్ప మరొకటి కాదు. 

ఇందుకు తాజా తార్కాణం మన దేశం చైనాతో 2021లో విదేశీ వాణిజ్యం 100 బిలియన్లు డాలర్లు దాటుతూ ఉండటం. ఇంత పెద్ద స్థాయిలో పరస్పర వాణిజ్యం జరగడం ఇదే తొలిసారి. చైనా ప్రభుత్వ కస్టమ్స్‌ పాలనా విభాగం డేటా ప్రకారం చైనా భారత్‌ మధ్య వాణిజ్యం ఈ తొమ్మిది నెలల్లో గతంలో కన్నా 49 శాతం వృద్ధితో  90.3 బిలియన్లకు చేరింది. చైనా నుండి మన దిగుమతులు గతంలోకన్నా 51.7 శాతం వృద్ధితో 68.4 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఇదే కాలంలో మన ఎగుమతులు 42.5 శాతం పెరుగుదలతో 21.9 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. మన రెండు దేశాల విదేశీ వాణిజ్యం కరోనా ముందు కాలం నాటి కన్నా గణనీయంగా పెరగడం గమనార్హం. ఈ గణాంక వివరాలు దేశాల నడుమ వాణిజ్య సంబంధాలకు సంకేతం. 

మన దేశం నుంచి చైనాకు ముఖ్య ఎగుమతులు– ఇనుప ఖనిజం, కాటన్, ఇతర ముడిసరుకులు ముఖ్యమైనవి. మన దిగుమతుల్లో ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ యంత్రాలు, యంత్ర పరికరాలు, మందులు, వాటికి సంబంధించిన మూలకాలు వగైరా గత రెండేళ్లలో ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. ఒక దేశ అభివృద్ధి ప్రపంచ అవసరాలను తీర్చటంతో కూడా ముడిపడి ఉంటుందని స్పష్టమవుతోంది. వీటిని ఏ రూపంలో ఆటంకపరచినా అదివిశ్వ మానవాళి ప్రయోజనాలకు ద్రోహం చేసినట్లే అవుతుంది.

దేశాల నడుమ పరస్పర సత్సంబంధాలు ఏ విధంగా పరస్పర ప్రయోజనకారులో తాజా గణాంకాల వివరాలు తెలుపుతున్నాయి. ‘హిందీ – చీనీ బై బై’ అంటే ఇవన్నీ ఎలా సాధ్యం? సాధ్యం కాకుంటే ఇక్కడ అక్కడ ప్రజ లంతా ఏమయ్యేవారు? వారి అత్యవసరాలు/ ప్రయోజనాలు ఎలా తీరేవి? నెరవేరేవి? చైనా నుంచి యంత్రాలు, పరికరాలు, ఎలక్ట్రిక్‌ ఉత్పత్తులు, మందులకు సంబంధించిన ఎగుమతులు రెట్టింపుకంటే ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఆ దేశం నుండి రాకుంటే ఇక్కడి కోట్లాది మంది ప్రజలు ఏమై ఉండేవారు? 

భారత్‌– చైనా సంబంధాల పట్ల విషం చిమ్ముతున్న వారు ఒకవిషయం గుర్తించాలి. పరస్పర సంబంధాల విచ్ఛిన్నానికి చిన్న కారణం చాలు. వీటిని గుర్తించి గౌరవించి పాటించడమే వ్యక్తుల, వ్యవస్థల– విజ్ఞత, వివేకం, విచక్షణలకు కొలబద్ధలు. అవి ఎల్ల వేళలా అందరికీ, అందునా జనజీవనంలో ఉన్నవారికి మరింతగా ఉండాలని ఆశిద్దాం. 
– బి. లలితానంద ప్రసాద్‌
విశ్రాంత ఆచార్యులు ‘ 92474 99715

మరిన్ని వార్తలు