మిత్రభేదానికి బైడెన్‌ విరుగుడేమిటి?

29 Nov, 2020 01:37 IST|Sakshi

అమెరికా జాతీయ భద్రత సాకుతో గతంలో ట్రంప్‌ విదేశాల నుంచి వచ్చే విదేశీ ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై భారీ సుంకాలు విధించారు. దాంట్లో కూడా ఆస్ట్రేలియా, మెక్సికో, దక్షిణ కొరియా వంటి మిత్రదేశాలకు సుంకాల పెంపు నుంచి మినహాయించి, ఈయూ, జపాన్‌తో సహా ఇతర దేశాలను పన్నులపెంపు జాబితాలో చేర్చారు. ఇప్పుడు వాణిజ్య ప్రతిష్టంభనను సడలించాలంటే ఆ దేశాలకు కూడా మినహాయింపునివ్వడం లేదా సుంకాల పెంపు చట్టాన్ని రద్దుచేయడం తప్ప జో బైడెన్‌ ముందు మరో మార్గం లేదు.

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ వాణిజ్య ఉద్రిక్తతలను సడలించడంలో అమెరికా తన మిత్రదేశాలతో కలిసి పనిచేసేలా విధానాలు రూపొంది స్తానని, అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడేలా చైనాపై ఒత్తిడి పెంచుతానని ఎన్నికల ప్రచార సమయంలో నొక్కి చెప్పారు. ప్రపంచ వాణిజ్య సంస్థలో అనేక దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా నిలిచిన నేపధ్యంలో నాయకత్వ వివాదాన్ని పరిష్కరించేందుకు తగిన అవకాశం బైడెన్‌ ముందుంది. తన వాణిజ్య భాగస్వాములపై అధికభారం మోపుతూ ట్రంప్‌ పాలనాయంత్రాంగం ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై పెంచిన భారీ సుంకాలను కూడా బైడెన్‌ ఎత్తివేసే అవకాశముంది.

వచ్చే ఏడాది ప్రారంభంలో గ్రూప్‌–20 దేశాల అత్యవసర సమావేశానికి పిలుపునివ్వడం ద్వారా ప్రపంచ ఆర్థిక రంగాన్ని బైడెన్‌ నియంత్రించవచ్చు. వాతావరణ మార్పు ప్రత్యేక ప్రతినిధిగా మాజీ విదేశీమంత్రి జాన్‌ కెర్రీని నియమించడం ద్వారా, గతంలో ట్రంప్‌ కుదుర్చుకున్న కొన్ని అంతర్జాతీయ ఒప్పందాలను రద్దు చేయగలనన్న ఉద్దేశాన్ని ఈ వారం జో బైడెన్‌ ప్రకటించారు. ఇకపోతే ప్రపంచ వాణిజ్య సంస్థ కొత్త నేత ఎన్నికపై నెలకొన్న ప్రతి ష్టంభనను తొలగించడం బైడెన్‌ తీసుకునే చర్చల్లో ఒకటి.

అనేక దేశాలు సమర్థించిన నైజీరియా మాజీ ఆర్థికమంత్రి, ప్రపంచ బ్యాంక్‌ మాజీ ఉన్నతాధికారి ఎంగోజి ఒకాన్జో లెవెలా అభ్యర్థిత్వాన్ని ట్రంప్‌ పాలనాయంత్రాంగం గతంలో వ్యతిరేకించింది. ఒకాం జోకు ప్రపంచ వాణిజ్యంలో తగినంత అనుభవం లేదని ఆరోపిస్తూ ట్రంప్‌ యంత్రాంగం దక్షిణ కొరియా వాణిజ్య మంత్రి యో మ్యున్‌గీని బలపర్చింది. వీరిద్దరిలో ఎవరు ఎన్నికైనా ప్రపంచ వాణిజ్య సంస్థకు తొలిసారిగా ఒక మహిళ నాయకత్వం వహించినట్లు అవుతుంది. ఒకాంజో గెలిస్తే ఆఫ్రికా నుంచి డబ్ల్యూటీవోకు ఎంపికైన తొలి నేతగా కూడా చరిత్రకెక్కుతారు. నైజీరియా అభ్యర్థిని ఆమోదించడం ద్వారా బైడెన్‌ యంత్రాంగం ఈ అంశంపై ఏర్పడిన ప్రతిష్టంభనకు ముగింపు పలకవచ్చు.

అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల మధ్యవర్తిగా డబ్ల్యూటీవో పాత్రను పునరుద్ధరించే దశగా బైడెన్‌ తగు చర్యలను తీసుకోవడం ప్రారంభించాలని ఆయన సన్నిహిత బృందం సూచిస్తోంది. డబ్ల్యూటీవోలో న్యాయం లేదని ఆరోపించిన ట్రంప్‌ ఈ సంస్థ అప్పిలేట్‌ బాడీకి కొత్త న్యాయమూర్తుల నియామకాన్ని కూడా నిషేధించారు. కాగా డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న కీలక నిర్ణయాల్లో ప్రధానమైనది సుంకాల పెంపు. జాతీయ భద్రత పరిరక్షణ పేరుతో ట్రంప్‌ ఇతరదేశాలనుంచి దిగుమతి చేసుకునే ఉక్కుపై 25 శాతం, అల్యూమినియంపై 10 శాతం సుంకాలు విధించారు. జాతీయ రక్షణకు అత్యవసరమైన దేశీయ పరిశ్రమను కాపాడుకునేందుకు ఈ చర్యలు తప్పవని ట్రంప్‌ చెప్పారు. 

ట్రంప్‌ పెంచిన సుంకాలు అమెరికా ఉక్కు తయారీ సంస్థలకు మిశ్రమ ప్రయోజనాలు కల్పిచాయి. అయితే అమెరికా ఉత్పత్తిదారులను ఇవి మరోవిధంగా దెబ్బతీశాయి. ఇతర దేశాలు కూడా అమెరికానుంచి దిగుమతి చేసుకునే ఉక్కు ఉత్పత్తులపై ప్రతీకార చర్యలతో అధిక పన్నులు విధించడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఆస్ట్రేలియా, మెక్సికో, దక్షిణ కొరియా వంటి మిత్రదేశాలకు సుంకాల పెంపునుంచి మినహాయించిన ట్రంప్‌ ఈయూ, జపాన్‌తో సహా ఇతర దేశాలను పన్నులపెంపు జాబితాలో చేర్చారు.

జో బైడెన్‌ ప్రస్తుతం చేయవలసింది ఏమిటంటే విదేశీ ఉక్కు దిగుమతులపై సుంకాల పెంపును రద్దు చేయడమేనని రాక్‌ గ్రీక్‌ గ్లోబల్‌ అడ్వైజర్స్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మైఖేల్‌ స్మార్ట్‌ స్పష్టం చేశారు. అదేసమయంలో కొత్త పాలనా యంత్రాంగం వ్యాపారాన్ని ప్రోత్సహించే అధికార యంత్రాంగంతో ఎలా వ్యవహరించాలనే విషయాన్ని మొదటగా నిర్ణయించుకోవాల్సి ఉంది. ఏ వ్యాపార ఒప్పందాన్నైనా ఆమోదించడానికి ముందు దాన్ని కాంగ్రెస్‌కు సమర్పించే అధికారాన్ని వాణిజ్య అధికారులకు కల్పిస్తూ కొత్త చట్టం అవకాశం కల్పించింది. రిపబ్లికన్లు సెనేట్‌పై నియంత్రణను కలిగి ఉన్నందున, భవిష్యత్‌ వాణిజ్య ఒప్పం దాలలో కార్మికుల, పర్యావరణ రక్షణపై విభేదాలు కొనసాగనున్నాయి. 

కాబట్టి కొత్త వాణిజ్య అదికార యంత్రాంగాన్ని పునరుద్ధరించడంలో కచ్చితంగా ఘర్షణలు చోటు చేసుకుంటాయి. 
ఈ వాణిజ్య అధికారుల నియంత్రణ ప్రాతిపదికన ట్రంప్‌ యంత్రాంగం ప్రారంభించిన యునైటెడ్‌ కింగ్‌డమ్‌తో వాణిజ్య ఒప్పందంపై కూడా బైడెన్‌ చర్చలు కొనసాగించాల్సి ఉంది. పైగా కరోనా వైరస్‌ రికవరీపై అంతర్జాతీయ అజెండాను ఏర్పర్చడానికి వచ్చే సంవత్సరం ప్రారంభంలో జీ–20 దేశాల అత్యవసర సదస్సుకు పిలుపునివ్వాల్సిందిగా డెమాక్రాటిక్‌ పార్టీకి చెందిన పలువురు మాజీ అధికారులు బైడెన్‌ను కోరుతున్నారు.
-నికోలస్, సీనియర్‌ పాత్రికేయులు

మరిన్ని వార్తలు