‘ప్రైవేటు’తో అంబేడ్కర్‌ ఆశయాలకు గండి  

17 Apr, 2021 01:20 IST|Sakshi

సందర్భం

భారతరత్న బాబాసాహెబ్‌ డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ జన్మదినోత్సవం అంటే ఆ మహనీయుని ఆశయాలను మననం చేసుకొని అంకితం కావలసిన జాతీయ వేడుక. అంబేడ్కర్‌ ఆశయాల్లో ప్రభుత్వరంగ సంస్థల నిర్వహణ చాలా ముఖ్యమైంది. సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయాన్ని సాధించాల్సిన భారత దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ రంగ సంస్థలు వెన్నెముక వంటివి. వాటిని నాశనం చేయడానికి కేంద్రం లోని  బీజేపీ ప్రభుత్వం పూనుకుంది. ఆర్థిక వ్యవస్థలో సరళీకరణ విధానాన్ని చేపట్టిన కేంద్ర ప్రభుత్వాలు 1991 నుండి డిజిన్వెస్టుమెంటు పేరుతో కొన్ని ప్రభుత్వరంగ సంస్థల్లోని ప్రభుత్వ వాటాలను 24 శాతం, 49 శాతం, 74 శాతం చొప్పున ప్రైవేట్‌ కార్పొరేట్‌ కంపెనీలకు అమ్ముకొంటూ వస్తున్నాయి. ఇప్పుడు 100 శాతం వాటాలను, మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలనే స్వదేశీ విదేశీ మల్టీ నేషనల్‌ కంపెనీలకు అప్పనంగా అప్పగించడానికి మోదీ ప్రభుత్వం తెగబడింది. 2021–22 కేంద్ర బడ్జెట్‌ని సమర్థిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ 2021 ఫిబ్రవరి 24న ఒక వెబినార్‌లో సందేశం యిస్తూ ‘ప్రభుత్వం బిజినెస్‌ చేయకూడదు, బిజి నెస్‌ సంస్థలను మోనిటర్‌ చేయడం, వాటికి అవసరమైన వసతులు, సదుపాయాలు సమకూర్చడం వరకే ప్రభుత్వం పరిమితం కావాలి’ అని చెప్పుకొచ్చారు. ప్రధాని వ్యాఖ్య  భారత ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసిన బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయానికి అశనిపాతం వంటిది. 


1944 ఆగస్టు 24న కలకత్తాలో చేసిన ప్రసంగంలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి విద్య, పరిశ్రమలకు ప్రథమ ప్రాధాన్యత ఉండాలని అంబేడ్కర్‌ చెప్పారు. ప్రైవేట్‌ సంస్థల దోపిడీ నుంచి రక్షణ కోసం పరిశ్రమలు, వ్యవసాయం ప్రభుత్వరంగంలో ఉండాలని రాజ్యాంగ రచనా కమిటీలో అంబేడ్కర్‌ గట్టిగా వాదించారు. భారత సమాఖ్య తన రాజ్యాంగ సూత్రాల్లో క్రింది చట్టపరమైన అంశాలు ప్రకటించాలని ప్రతిపాదించారు. కీలక పరిశ్రమలు, కీలకంగా ప్రకటించబోయే పరిశ్రమలూ ప్రభుత్వ నియంత్రణలో ఉండాలి. ప్రభుత్వమే వాటిని నడపాలి. మౌలిక పరిశ్రమలైన వాటిని ప్రభుత్వ నియంత్రణలో ఉంచాలి.

అంబేడ్కర్‌ సూచనలకు అనుగుణంగా 1948లో బాంబే ప్లాన్‌ పేరుతో మొదటి పారిశ్రామిక తీర్మానం చేశారు. 1950లో ప్రణాళికా సంఘం ఏర్పర్చారు. 1951లో ఇండస్ట్రియల్‌ డెవలప్మెంట్‌ అండ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ తీసుకొచ్చారు. 1969లో 14 పెద్ద ప్రైవేట్‌ బ్యాంకులను, 1980లో మరో 6 బ్యాంకులను జాతీయం చేశారు. 1951లో 5 ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే ఉండగా 2019 మార్చి నాటికి 348కి పెరిగి, దాదాపు రూ. 16.41 లక్షల కోట్ల పెట్టుబడులను కలిగి ఉండేవి. 2018–19లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలే రూ. 25.43 లక్షల కోట్లు ఆదాయాన్ని సంపాదించాయి, రాష్ట్రాల ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార రంగ సంస్థల్లో అత్యధికం 1990 వరకు లాభాలు గడించాయి. 1990–91 ప్రపంచ ఆర్థిక మాంద్యంలో అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలినా భారత ఆర్థిక వ్యవస్థ నిలబడడానికి ప్రభుత్వరంగ సంస్థలే ఆధారం. దేశ స్వావలంబనకు, ప్రజా సంక్షేమానికి పట్టుకొమ్మలుగా అలరారుతున్న సంస్థలను ‘ఆత్మ నిర్భర భారత్‌‘ పేరుతో అంతం చేయడానికి మోదీ ప్రభుత్వం పూనుకుంది.

కష్టపడి సంపాదించి సంసారాన్ని పోషించుకుంటూ భవిష్యత్‌ తరాల కోసం ఆస్తులను పోగేయడం చేతగానివారు తాతలు కూడబెట్టిన సంపదను తెగనమ్ముకొంటూ బడాయిగా బతుకుతుం టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న పని అదే. తొలి ప్రధాని జవహర్‌ లాల్‌ నుంచి దేవేగౌడ వరకు నడిచిన ప్రభుత్వాలన్ని ప్రభుత్వ రంగ సంస్థల స్థాపనకు ప్రాధాన్యమిచ్చాయి. ఆ తర్వాతి ప్రధాన మంత్రుల ఏలుబడిలో ప్రభుత్వ సంస్థల్లోని పెట్టుబడుల వాటాలను అమ్ముకోవడం మొదలైంది. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను స్థాపించక పోగా 338 సంస్థలను టోకుగా ప్రైవేట్‌ కార్పొరేట్‌ కంపెనీలకు దోచి పెట్టడానికి చర్యలు చేపట్టింది. దీంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కుదించుకుపోయి దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల అభివృద్ధి హరించుకు పోతుంది. రిజర్వేషన్లు డొల్లగా మారిపోతాయి. 

30 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగులుగా  25 లక్షల మంది పనిచేసేవారు. నూతన ఆర్థిక విధానాల నేపథ్యంలో..  ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయకపోవడం, డిజిన్వెస్టుమెంటుతో పోస్టులు రద్దు కావడం వలన ఉద్యోగుల సంఖ్య 75% పైగా తగ్గిపోయింది. ఎల్‌ఐసీ, బ్యాంకులు, కోల్‌ మైన్స్, రక్షణ రంగ సంస్థలు, ఎయిర్‌ లైన్స్, హైవేస్, రైల్వేస్, ఎలక్ట్రానిక్‌ ఇండస్ట్రీ వంటి సంస్థల్లో లక్షల మంది ఉద్యోగులున్నారు. వారిలో రిజర్వేషన్ల అమలు వలన సగానికంటే ఎక్కువమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ తరగతుల వారు వున్నారు. ఇప్పుడు మోదీ ప్రభుత్వ నిర్వాకం వలన ప్రభుత్వ రంగ సంస్థలు ఎగిరిపోవడంతో అందరి ఉద్యోగాలతో పాటు బలహీన వర్గాల ఉద్యోగాలు రద్దవుతున్నాయి. ఫలితంగా.. సామాజిక న్యాయం సమసిపోతుంది, అంబేడ్కర్‌ ఆశయం అంతమవుతుంది.


వ్యాసకర్త: నాగటి నారాయణ
రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు
94903 00577

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు