‘గురు’ వాగ్గేయకారుడు నారాయణతీర్థులు

20 Jul, 2021 13:49 IST|Sakshi

నేడు శ్రీ నారాయణతీర్థుల జయంతి

యక్షగాన సంప్రదాయానికి, భజన సంప్రదాయానికి మనదైన కూచిపూడి నృత్యానికి పూనికగా, భూమికగా నిలిచినవాడు నారాయణతీర్థుడు. సిద్ధేం ద్రయోగికి పథనిర్దేశం చేసిన గురువర్యుడు. త్యాగయ్య గురువు శొంఠి వెంకటరమణయ్య కూడా నారాయణతీర్థుడిని గురువుగా తన గుండెలో నిలుపుకున్నారు. లీలాశుకుని, జయదేవుని, నారాయణతీర్ధుని కృతులను ఆలకిస్తే, శ్రీకృష్ణతత్వం సర్వం బోధపడుతుందని మాస్టర్‌ ఎక్కిరాల కృష్ణమాచార్య పలుమార్లు చెప్పారు. ఈ ముగ్గురు మహనీయులలో నారాయణతీర్థుడు అచ్చమైన మన తెలుగువాడు. ఎందరో వాగ్గేయకారులకు, నాట్యాచారులకు పరమగురువుగా ప్రబోధం చేసినవాడు. 

నారాయణతీర్థుడు అనగానే గుర్తుకు వచ్చేది ‘తరంగాలు’. ‘కృష్ణం కలయ సఖి సుందరం’, ‘బాల గోపాలకృష్ణ పాహి పాహి..’ వంటివి నృత్య ప్రదర్శనలలో తరచూ మనకు వినిపించే గీతాలు. ‘శరణం భవ కరుణాం మయ’, ‘ఆలోకయే శ్రీ బాలకృష్ణం’, ‘గోవర్ధన గిరిధర’ మొదలైన కీర్తనలు యావత్తు దక్షిణభారతంలోనే బహుళ ప్రచారంలో ఉన్నాయి. దరువులు, జతులతో సాగే ఈ గాన సంప్రదాయం విలక్షణమైంది. ఇది పూర్తిగా మనది. బాలగోపాల మా ముద్ధర.. తరంగాన్ని రాత్రంతా పాడుతూ, ఆడుతూ తాదాత్మ్యం చెందుతూ వేడుక చేసుకొనే సంప్రదాయం నిన్నమొన్నటి వరకూ ప్రకాశం జిల్లా అద్దంకి సీమలో ఉండేది. ఇప్పటికీ అద్దంకి, ఒంగోలు ప్రాంతంలో తరంగగానం చేసేవారు ఎందరో ఉన్నారు. దివిసీమలోని శ్రీకాకుళం, కూచి పూడి ప్రాంతాలలోనూ తరంగగాయకులు ఉన్నారు.

అక్షరాస్యులు, నిరక్షరాస్యులు సైతం ఒళ్లు మరచి నృత్యం చేస్తూ, భక్త్యావేశంతో పాడే ఈ సంప్రదాయం తమిళ, కన్నడిగులను కూడా విశేషంగా ఆకర్షించింది. ముఖ్యంగా, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణాతీరంలో తరంగ సంప్రదాయం వందల ఏళ్ళు విలసిల్లింది. తరంగాలను ‘శ్రీకృష్ణ లీలా తరంగిణి’ పేరుతో నారాయణతీర్థుడు రచించారు. ప్రతి కీర్తనకు ముందు శ్లోకం ఉంటుంది. ఇది ఒక ప్రత్యేకత. మధ్య మధ్యలో గద్యాలు, దరువులు, జతులు ఉంటాయి. 

కీర్తనలన్నీ సంస్కృతంలో రాసినా, తెలుగు వింటున్నంత తేటగా ఉంటాయి. సంగీతం, సాహిత్యం, నృత్యాత్మకం ముప్పేటలుగా ముడివేసుకొని సాగే ఈ కీర్తనలు రస, భావ భక్తిబంధురాలు. ఇటువంటి మహాసృష్టి చేసిన నారాయణతీర్థుడి స్వగ్రామం గుంటూరు జిల్లా మంగళగిరి దగ్గర కాజా. వీరి పూర్వనామం తల్లావజ్జుల గోవిందశాస్త్రి. 

ఆంధ్రదేశంలోని కృష్ణాతీరంలో పుట్టి, తమిళనాడులోని కావేరీ నదీ పరీవాహక ప్రాంతంలోని తిరుపుందుర్తిలో యోగ మార్గంలో సజీవ సమాధి అయ్యారు. వీరు క్రీ.శ 1600–1700 సంవత్సరాల మధ్య జీవించినట్లుగా తెలుస్తోంది. పుణ్య దినాల్లో జన్మస్థలమైన కాజా లోనూ, తుది పయనం చేసిన తిరుపుందుర్తిలోనూ ప్రతి ఏటా పెద్దఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. ఈ రెండు ప్రదేశాలలోనే కాక, యావత్తు దక్షిణాదిలో సంగీత ప్రియులు, భక్తులు శ్రీనారాయణతీర్ధుని స్మరిస్తూ తరంగ గానం చేస్తూ నీరాజనాలు పలుకుతారు. తరంగ కాలక్షేపం గొప్ప ఆచారంగా తెలుగునాట ప్రసిద్ధి. ఎందరినో తరింపజేసి, ఎందరో శిష్యప్రశిష్యులను సంపదగా పొందిన నారాయణతీర్థుడు పరమ భాగవతోత్తముడు. నారాయణతీర్థుడు తీర్చిదిద్దిన సంప్రదాయాన్ని నిలబెట్టడమే మనం ఆ మహావాగ్గేయకారునికి ఇచ్చే నిజమైన నివాళి. 


- మాశర్మ 

వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు