సైన్స్‌ శిఖరం.. పీఎమ్‌ భార్గవ

22 Feb, 2021 14:04 IST|Sakshi

ఫిబ్రవరి 22న పీఎం భార్గవ జయంతి

శాస్త్రీయ ఆలోచనలు శాస్త్రవేత్తలందరికి ఉంటాయనుకోవడం పొరపాటు. తాము చేసిన పరిశోధనలకు దైవ సహకారం ఉందని బహిరంగంగా ప్రకటించుకునే శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. ఇస్రో ఉపగ్రహాలని అంతరిక్షములోకి పంపించే ముందు, తర్వాత కూడా విధిగా మన శాస్త్ర వేత్తలు పూజలు చేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్‌ నిల్వ చేసే పెట్టెలకు కూడా పూజలు చేసే వాటిని ఓపెన్‌ చేశారు. ఇలాంటి నేపథ్యంలో శాస్త్రీయ దృక్పథంని కల్గి ఉండటమే కాకుండా, సైన్స్‌ పరిశోధనల విషయంలో పాలకులు తీసుకునే నిర్ణయాలని ఎప్పటికప్పుడు సహేతుకంగా విమర్శించకల్గిన అతి కొద్దిమంది శాస్త్రవేత్తలలో పీఎమ్‌ భార్గవ ఒకరు.

భార్గవ వంటి వ్యక్తిత్వం కల్గిన శాస్త్రవేత్తలు నేడు అరుదుగా కనిపిస్తున్నారు. ఫిబ్రవరి 22, 1928న రాజస్థాన్‌లోని ఆజ్మీర్‌లో రామచంద్ర భార్గవ, గాయత్రి భార్గవ దంపతులకు జన్మించారు. ‘జన్యు ఇంజనీరింగ్‌’ అనే పదాన్ని ఉపయోగించిన మొట్టమొదటి వ్యక్తి ఆయనే. భారతదేశంలో ఆధునిక జీవశాస్త్రం వాస్తుశిల్పిగా ఆయన ప్రసిద్ధి చెందారు. 70లలో బయోటెక్నాలజీ విభాగం ఏర్పాటులో భార్గవ ముఖ్య పాత్ర పోషించారు. హైదరాబాద్‌ లోని సంభావన ట్రస్ట్, భోపాల్‌లో బేసిక్‌ రిసెర్చ్, ఎడ్యుకేషన్‌ అండ్‌ డెవెలప్మెంట్‌ సొసైటీ, న్యూఢిల్లీలోని మెడికల్లీ ఎవేర్‌ అండ్‌ రెస్పాన్సిబుల్‌ పీపుల్స్‌ వంటి పలు సంస్థలకు చైర్మన్‌గా కూడా ఆయన ఉన్నారు.

2005 నుండి 2007 వరకు నేషనల్‌ నాలెడ్జ్‌ కమిషన్‌ వైస్‌ ఛెర్మైన్‌గా కూడా పనిచేశారు. భార్గవ 100 వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి గౌరవాలను, అవార్డులను అందుకున్నారు. అలాగే 1986లో ఆయన ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్‌ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. 1998లో లెజియన్‌ డి హొన్నూర్‌తో తనను సత్కరించారు. ఇలా ఎన్నో కీర్తి పురస్కారాలను ఆయన అందుకున్నారు. జాతి గర్వించే స్థాయికి ఎదిగారు. ఆయన వివిధ సందర్భాలలో వేలాది ఉపన్యాసాలు ఇచ్చారు, 550 మంది ప్రముఖుల వ్యాసాల సంపుటి, ఆరు పుస్తకాలు కూడా వెలువరించారు.

హైదరాబాద్‌లో సెంటర్‌ ఫర్‌ సెల్యూలర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ సంస్థకి వ్యవస్థాపక డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ఈ సంస్థ వల్లే హైదరాబాద్‌ బయోటెక్నాలజీ రంగంలో అంతర్జాతీయంగా పేరు పొందింది. భారతదేశంలో జన్యుమార్పిడి పంటలని వేగంగా, ఎలాంటి శాస్త్రీయ పరిశోధన లేకుండా ప్రవేశ పెట్టడాన్ని వ్యతిరేకించారు. ఈ పంటలు అధిక దిగుబడినిస్తాయి గానీ, వాటిలో పోషక విలువలు ఉండవని తెలిపారు. 

జ్యోతిష్యం అశాస్త్రీయం అని ఆయన తెలిపారు. హైకోర్టులో వ్యాజ్యం కూడా వేశారు. భోపాల్‌ గ్యాస్‌ బాధితులకు అండగా నిలిచారు. దేశంలో పెరుగుతున్న అసహనానికి నిరసనగా ఆయన పద్మభూషణ్‌ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చారు. బయోటెక్నాలజీని వ్యాపారకోణంలో ఉపయోగించడానికి ఆయన అంగీకరించలేదు. ఆయనని ఆధునిక భారతదేశ జీవశాస్త్రపిత అని కూడా పిలుస్తారు. సైన్స్‌ ఫలాలు పేదవారికి అందాలనేది ఆయన ఆశయం. జనవిజ్ఞాన వేదిక లాంటి సైన్స్‌ ప్రచార సంస్థలతో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. ఆయన 2017 ఆగస్ట్‌ 1న తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం సైన్స్‌ ఉద్యమానికి తీరనిలోటు.

- ఎమ్‌. రామ్‌ప్రదీప్, జనవిజ్ఞానవేదిక, తిరువూరు 
మొబైల్‌: 94927 12836 

మరిన్ని వార్తలు