ఇక రాష్ట్ర రహదారులపై ఫాస్టాగ్‌

22 Feb, 2021 14:09 IST|Sakshi

రాజీవ్‌ రహదారిపై మార్చి మొదటి వారం నుంచి..

అద్దంకి-నార్కెట్‌పల్లి రోడ్డుపై ఏప్రిల్‌ నుంచి అమలు

ట్యాగ్‌ లేకుంటే రెట్టింపు ఫీజు చెల్లించాల్సిందే..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రహదారులపై కూడా ఫాస్టాగ్‌ అందుబాటులోకి వస్తోంది. ప్రస్తుతం జాతీయ రహదారులు, ఔటర్‌ రింగురోడ్డుపై మాత్రమే ఫాస్టాగ్‌తో నగదు రహిత చెల్లింపు విధానం అమలవుతోంది. గత 15వ తేదీ నుంచి అన్ని జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాలలో అన్ని గేట్లను పూర్తిగా ఫాస్టాగ్‌తో అనుసంధానించిన విషయం తెలిసిందే. గతేడాదిలోనే ఒక గేట్‌ మినహా మిగతావి ఫాస్టాగ్‌ పరిధిలోకి వచ్చాయి. కానీ, రాష్ట్ర రహదారులపై మాత్రం ఇంకా నగదు చెల్లింపు విధానం కొనసాగుతోంది. ఇక మార్చి ఒకటో తేదీ నుంచి హైదరాబాద్‌-రామగుండం రాజీవ్‌ రహదారిపై ఇది అమలులోకి రానుంది.
 
ప్రస్తుతానికి ఒక రహదారిపైనే.. 
రాష్ట్రంలో టోల్‌ప్లాజాలున్న రాష్ట్ర రహదారులు రెండు. మొదటిది హైదరాబాద్‌-రామగుండం రాజీవ్‌ రహదారి కాగా, రెండోది నార్కెట్‌పల్లి-అద్దంకి (పాత ఎన్‌హెచ్‌-5) రోడ్డు. ఇందులో రాజీవ్‌ రహదారిపై దుద్దెడ, రేణికుంట, బసంత్‌నగర్‌ల వద్ద మూడు ప్లాజాలున్నాయి. ఈ మూడింటినీ ఒకే కాంట్రాక్టర్‌ నిర్వహిస్తున్నారు. వీటిల్లో ఫాస్టాగ్‌ విధానాన్ని మార్చి ఒకటి నుంచి అమలులోకి తేవాలని భావిస్తున్నారు. నార్కెట్‌పల్లి-అద్దంకి రహదారిపై మూడు టోల్‌ప్లాజాలున్నాయి. ఇందులో మాడుగులపల్లి వద్ద ఉన్న ప్లాజా తెలంగాణలో ఉండగా, మిగతా రెండు ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో ఉన్నాయి. మాడుగులపల్లి టోల్‌ప్లాజా వద్ద ఫాస్టాగ్‌ వ్యవస్థ ఏర్పాటైంది. కానీ, మిగతా రెండుచోట్ల కాలేదు. ఈ మూడు ప్లాజాలు కూడా ఒకే కాంట్రాక్టర్‌ పరిధిలో ఉన్నాయి. దీంతో మూడింటిని ఒకేసారి ప్రారంభించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నార్కెట్‌పల్లి-అద్దంకి రోడ్డుపై మాత్రం మార్చి చివరికిగానీ, ఏప్రిల్‌ మొదటి వారంలోగాని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారు. 

సిస్టం ఏర్పాటుపై స్పష్టత లేక.. 
రాష్ట్ర రహదారులపై టోల్‌ప్లాజాల వద్ద ఫాస్టాగ్‌కు సంబంధించిన సెన్సార్లు, ఇతర ఆటోమేటిక్‌ వ్యవస్థ, దాని సాఫ్ట్‌వేర్‌ కొనుగోలు ఖర్చు విషయంలో ప్రభుత్వానికి-కాంట్రాక్టర్లకు మధ్య స్పష్టత రాలేదు. ఈ రోడ్ల ఒప్పందాలు 2010లో జరిగాయి. అప్పటికీ ఫాస్టాగ్‌ విధానంపై అవగాహన కూడా లేదు. ఇప్పుడు ఆ వ్యవస్థ ఏర్పాటుకు ఒక్కోప్లాజా వద్ద దాదాపు రూ.70 లక్షలు ఖర్చవుతుంది. ఇందులో కేంద్రం ఏర్పాటు చేసిన నోడల్‌ ఏజెన్సీ రూ.20 లక్షలకు మాత్రమే రీయింబర్స్‌ చేస్తోంది. మిగతా ఖర్చును కాంట్రాక్టర్‌ భరించాల్సి ఉంది. కానీ.. మొత్తం ఖర్చును రీయింబర్స్‌ చేయాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు. రీయింబర్స్‌మెంట్‌పై తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు, ముందైతే ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించటంతో ప్రస్తుతానికి కాంట్రాక్టరే వ్యయాన్ని భరిస్తున్నారు.  

ట్యాగ్‌ లేకుంటే రెట్టింపు ఫీజు 
ఫాస్టాగ్‌ లేకుండా టోల్‌గేట్‌లోకి వస్తే రెట్టింపు రుసుము చెల్లించే పద్ధతి ప్రస్తుతం జాతీయ రహదారులపై అమలవుతోంది. ఇదే పద్ధతి ఇక రాష్ట్ర రహదారులపై (ఫాస్టాగ్‌ ప్రారంభం అయినప్పటి నుంచి) అమలులోకి రానుంది. ప్రస్తుతానికి రహదారులపై 75 వాహనాలకు మాత్రమే ట్యాగ్‌ ఉంటోంది. మిగతావారు అప్పటికప్పుడు ట్యాగ్‌ కొనటమో, రెట్టింపు ఫీజు చెల్లించి వెళ్లటమో చేస్తున్నారు. ఇప్పుడు ఆ రోడ్లమీద దూసుకుపోయే వాహనదారులు కూడా అప్రమత్తం కావాల్సిందే. ఫాస్టాగ్‌ నుంచి మినహాయింపు ఉన్న వాహనాల కోసం ఒక అత్యవసర మార్గం తప్ప మిగతావాటిల్లో కచ్చితంగా ఫాస్టాగ్‌ ఉండాల్సిందే.

చదవండి:

వాహనదారులకు కేంద్రం తీపికబురు

వాట్సాప్‌కు దీటుగా స్వదేశీ సందేశ్ యాప్

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు