రైతుల చుట్టూ కాదు.. గుండెల్లో మేకులు

6 Feb, 2021 01:34 IST|Sakshi

విశ్లేషణ

రైతుల సమస్య పరిష్కారం విషయంలో ప్రభుత్వ అహమే అడ్డొస్తోందని కార్పొరేట్‌ మీడియాకు, బీజేపీ శ్రేణుల్లో చాలామందికి కూడా తెలుసు. విధానం కాదు, కార్పొరేట్‌ వర్గాలకు చేసిన వాగ్దానాల అమలు కాదు. సాగుచట్టాల పవిత్రత కాదు.. రాజు అసలు తప్పు చేయడు అనే అహమే దీనికి కారణం. తప్పులు అంగీకరించి వాటినుంచి బయటపడటం ఇక్కడ జరగదు. దేశంలోని ప్రతి ఒక్క రైతూ ప్రభుత్వం నుంచి వ్యవస్థ నుంచి వేరుపడిపోయినా సరే దేశాధినేతది తప్పు కానేకాదు. ఇదే నిజమని తెలుస్తున్నా అతిపెద్ద పత్రికల్లో ఏ ఒక్కటీ కనీసం గుసగుసల రూపంలో కూడా దీన్ని వ్యక్తం చేయడం లేదు. మనమెందుకు దీన్ని గురించి మాట్లాడకూడదు అనే ఒక్క ట్వీట్‌కు వచ్చిన అమిత స్పందన కూడా పాలకుల అహాన్ని కరిగించడం లేదు.

లక్షలాదిమంది మానవులకు విద్యుత్, నీరు అందకుండా చేయడం, తద్వారా వారిని తీవ్రమైన ఆరోగ్య సమస్యల బారిన పడేయడం, పోలీసు, పారామిలటరీ బలగాలతో వారి చుట్టూ బ్యారికేడ్లు కట్టడం, ఎటూ పోనివ్వకుండా చేసి వారిని అత్యంత అనారోగ్య పరిస్థితుల్లోకి నెట్టడం, నిరసన తెలుపుతున్న రైతుల వద్దకు జర్నలిస్టులు వెళ్లడం అసాధ్యమయ్యేలా కాంక్రీట్, ఐరన్‌ బ్యారికేడ్లు నిర్మించడం, చలి వాతావరణంలో శరీర ఉష్ణోగ్రతలు పడిపోయి గత రెండు నెలలుగా 200 మంది రైతులు ప్రాణాలు కోల్పోవడం.. ఢిల్లీ శివార్లలో నెలకొంటున్న ఘోరపరిణామాల్లో ఇవి కొన్ని మాత్రమే..

ప్రపంచంలో మరెక్కడైనా ఇలాంటివి జరిగితే అనాగరికమైవిగానూ, మానవ హక్కులపై పెనుదాడిగా కనిపించేవి. కానీ మన ప్రభుత్వం, కులీన పాలకవర్గం వీటికి మించిన సమస్యల్లో తలమునకలవుతున్నాయి. భూమ్మీద అతి గొప్ప దేశంమైన భారత్‌ను అప్రతిష్ట పాలుచేయడానికి, అవమానించడానికి ప్రయత్నిస్తున్న రిహానా, గ్రేటా థన్‌బెర్గ్‌ అనే భయంకరమైన అంతర్జాతీయ ఉగ్రవాదుల కుట్రను వమ్ము చేయడం ఎలా అనే విచికిత్సలో మనం కూరుకుపోతున్నాం మరి. ప్రతిరోజూ ఢిల్లీ శివార్లలో ప్రజాస్వామ్యాన్ని చీల్చిపడేస్తున్న ఇలాంటి పరిణామాలును వ్యవస్థానుకూల వర్గాలు కూడా అమోదించలేదని మీరు భావించవచ్చు. 

తాము తీసుకొచ్చిన సాగు చట్టాలపై రైతులతో ఎలాంటి సంప్రదింపులూ జరపలేదనీ మన మంత్రులకు తెలుసు. వ్యవసాయం రాష్ట్రాల పరిధిలో ఉన్నప్పటికీ ఈ చట్టాల రూపకల్పనలో కేంద్రప్రభుత్వం రాష్ట్రాలతో ఎలాంటి సంప్రదింపులూ జరపలేదు. చివరకు ప్రతిపక్షాలతో కానీ, పార్లమెంటులో కానీ దీనిపై చర్చించడానికి పూనుకోలేదు. కేంద్ర ప్రభుత్వాధినేత ఏ విషయంలోనూ కేబినెట్‌తో చర్చించిన పాపాన పోలేదు. పంజాబ్‌లో దాదాపు ప్రతి కుటుంబంలోనూ కనీసం ఒకరు రైతు నిరసనకారులుగా మారిపోయారు. కొందరు ఇప్పటికే వారిలో కలిసే ప్రక్రియలో ఉంటున్నారు. ఫిబ్రవరి 14న జరుగనున్న పట్టణ స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులను నిలపడానికి కూడా బీజేపీ కొట్టుమిట్టాడుతోంది. ఈలోగా పంజాబ్‌లోని ఒక తరం యువత మొత్తంగా వేరుపడిపోయింది. భవిష్యత్తులో దీని ప్రభావాలు తీవ్రాతితీవ్రంగా ఉండబోతున్నాయి. 

కేంద్ర ప్రభుత్వం సాధించిన అతి గొప్ప విజయం ఇదేమరి. సాంప్రదాయికంగా ప్రత్యర్థులుగా ఉండే రైతులు, కమిషన్‌ ఏజెంట్లతో సహా విభిన్న సామాజిక శక్తులను భారీ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఏకం చేసింది. పైగా కేంద్రం సిక్కులను, హిందువులను, ముస్లింలను, జాట్స్‌ని, జాట్లు కానివారిని మాత్రమే కాకుండా కాప్‌ పంచాయితీలను, ఖాన్‌ మార్కెట్లలో పనిచేసేవారిని కూడా ఒకటిగా చేసేసింది. నిజంగానే ఇది ముచ్చట గొలిపే విషయం. అయితే ఇది పంజాబ్, హరియాణాకు మాత్రమే పరిమితమని కొన్ని ప్రశాంత స్వరాలు రెండునెలలుగా చెప్పుకుంటూ  కాలం గడిపేస్తున్నాయి. 

తమాషా కలిగించే విషయం ఏమిటంటే, సుప్రీంకోర్టు గతంలో నియమించని ఒక కమిటీ పంజాబ్, హరియాణాలు భారత యూని యన్‌లో భాగమని చెప్పి ఉండటమే. కాబట్టి అక్కడేం జరిగినా అది మనందరినీ ప్రభావితం చేస్తుందని గ్రహించాలి. అయితే సంస్కరణలను ప్రతిఘటిస్తున్నది సంపన్న రైతులేనని కొందరు ఇప్పటికీ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇక దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, గత ఎన్‌ఎస్‌ఎస్‌ సర్వే ప్రకారం పంజాబ్‌లో ఒక సగటు కుటుంబం ఆదాయం రూ. 18,059లు. ఒక్కో రైతు కుటుంబంలో కనీసం అయిదుగురు సభ్యులుంటారు. అంటే తలసరి నెలవారీ ఆదాయం రూ. 3,450 లు అన్నమాట. అంటే సంఘటిత రంగంలో అత్యంత తక్కువ వేతనం పొందే ఉద్యోగి కన్నా రైతుల తలసరి ఆదాయం తక్కువ అన్నమాట.

హరియాణాలో ఒక్కో వ్యవసాయ కుటుంబంలో 5.9 మంది వ్యక్తులకు నెలవారీ ఆదాయం రూ. 14,434లు మాత్రమే. అంటే తలసరి రూ. 2,450లు మాత్రమే రైతు కుటుంబాలకు అందుతున్నాయి. అయితే ఇంత తక్కువ ఆదాయం కూడా చాలామంది భారతీయ రైతులకంటే అధిక స్థానంలో హరియాణా రైతులను ఉంచుతోంది. ఉదాహరణకు గుజరాత్‌ సగటు రైతుకుటుంబం ఆదాయం రూ. 7,926లు. ఇక్కడ కుటుంబంలో 5.2 మంది వ్యక్తులు ఉండొచ్చు. అంటే గుజరాత్‌ రైతు కుటుంబ తలసరి ఆదాయం రూ. 1,524లు మాత్రమే. భారతీయ రైతుకుటుంబాల సగటు నెలవారీ ఆదాయం రూ. 6,426లు (తలసరి ఆదాయం రూ. 1,300లు). పైగా ఈ సగటు నెలవారీ లెక్కలు కూడా రైతులకు అన్ని మార్గాల నుంచి వచ్చే ఆదాయ వనరులను కలిపే చెబుతుంటాయి.

ఇక సంపన్నరైతులే నిరసన చేస్తున్నారనే వాదన అసంగతం. ఢిల్లీ సరిహద్దుల్లో రెండు సెల్సియస్‌ డిగ్రీలకంటే తక్కువ ఉష్ణోగ్రతలో ట్రాక్టర్ల ట్రాలీల్లో నిద్రిస్తున్నవారు,  అయిదారు డిగ్రీల చలిలో స్నానం చేస్తున్నవారు.. ఈ భారతీయ సంపన్నరైతులు నా ప్రశంసలకు మరిం తగా నోచుకుంటున్నారు. వీరు మనం ఊహించిన దానికంటే కఠిన పరిస్థితులను తట్టుకోగలుగుతున్నారు. ఈలోగా రైతులతో చర్చించడానికి సుప్రీంకోర్టు నియమించిన కమిటీ తనలో తాను చర్చించుకోవడం ఇప్పటికీ సాధ్యం కావడం లేదు. నిరసన తెలుపుతున్న రైతులను బెదిరించడానికి, రెచ్చగొట్టడానికి చేసే ప్రతి ప్రయత్నమూ వారికి మద్దతునిచ్చే వారి సంఖ్యను పెంచుతోంది. రైతుల విశ్వసనీయతను దెబ్బతీయడానికి ఉద్దేశించిన ప్రతి చర్యా వ్యవస్థానుకూల మీడియాలో గొప్పగా ప్రచారం పొందుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం వ్యతిరేక ఫలితాలను పొందుతోంది. భయపెట్టే అంశం ఏమిటంటే రైతులకు అధిక మద్దతు లభించే కొద్దీ ప్రభుత్వం మరింత నిరంకుశంగా, పైశాచికంగా వారిపై దాడులు  పెంచడానికి సిద్ధమైపోతోంది.

రైతుల సమస్య పరిష్కారం విషయంలో ప్రభుత్వ అహమే అడ్డొస్తోందని కార్పొరేట్‌ మీడియాకు, బీజేపీ శ్రేణుల్లో చాలామందికి కూడా తెలుసు. విధానం కాదు, కార్పొరేట్‌ వర్గాలకు చేసిన వాగ్దానాల అమలు కాదు. సాగుచట్టాల పవిత్రత కాదు.. రాజు అసలు తప్పు చేయడు అనే అహమే దీనికి కారణం. తప్పులు అంగీకరించి వాటినుంచి బయపడటం ఇక్కడ జరగదు. దేశంలోని ప్రతి ఒక్క రైతూ ప్రభుత్వం నుంచి వ్యవస్థ నుంచి వేరుపడిపోయినా సరే దేశాధినేతది తప్పు కానేకాదు. ఇదే నిజమని తెలుస్తున్నా అతిపెద్ద పత్రికల్లో ఏ ఒక్కటీ కనీసం గుసగుసల రూపంలో కూడా దీన్ని వ్యక్తం చేయడం లేదు.

మనమెందుకు దీన్ని గురించి మాట్లాడకూడదు అనే ఒక్క ట్వీట్‌కు వచ్చిన అమిత స్పందన కూడా పాలకుల అహాన్ని కరిగించడం లేదు. మనమెందుకు దీనిపై మాట్లాడకూడదు అంటూ రిహానా చేసిన ఆ ఏకవాక్య ప్రకటన ఏ ఒక్కపక్షాన్నీ బలపర్చలేదు. ఐఎమ్‌ఎఫ్‌ చీఫ్‌ ఎకనమిస్ట్, కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ ఇద్దరూ నేరుగా సాగు చట్టాలను బలపరుస్తూనే రైతులకు సేఫ్టీ యంత్రాంగాలను అందించాలని సన్నాయి నొక్కు నొక్కారు. పొగతాగే వారి సిగరెట్‌ ప్యాకెట్లపై ఉండే అధికారిక హెచ్చరికకు మించిన విలువ వారి అభిప్రాయాలకు ఉండదనుకోండి. మొత్తం మీద ఆ అమెరికన్‌ పాప్‌ సింగర్, ఒక 18 ఏళ్ల స్కూల్‌ గర్ల్‌ కమ్‌ పర్యావరణ కార్యకర్త ఇప్పుడు దేశానికే ప్రమాదకర వ్యక్తులైపోయారు. వారిపై కఠిన చర్యలు తీసుకునే పనిలో మన ఢిల్లీ పోలీసులు మునిగిపోయారు. మన దేశంపై వీరు జరిపిన కుట్రకు అంతర్జాతీయ మూలాలనే కాకుండా గ్రహాంతరాల్లో మూలాలను కూడా వెతికి పట్టుకునే క్రమంలో ఢిల్లీ పోలీసులకు అవహేళనలు ఎదురైతే నేను దాంట్లో భాగమై ఉండను. 

పి. సాయినాథ్‌ 
వ్యాసకర్త పీపుల్స్‌ ఆర్కైవ్‌ ఆఫ్‌ రూరల్‌ ఇండియా సంస్థాపకులు
(ది వైర్‌ సౌజన్యంతో)

మరిన్ని వార్తలు