జనాభా పెరుగుదల కలిసొచ్చేనా?

3 May, 2023 02:51 IST|Sakshi

విశ్లేషణ

చైనాను అధిగమించి, ఇండియా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలిచింది. చాలా దేశాల్లో జనాభా తగ్గిపోతున్న నేపథ్యంలో యువశక్తితో కూడిన భారత్‌ కొంత ఈర్ష్య  పుట్టించేదే. ఇదంతా కూడా యువజనానికి సరైన వేతనాలున్న ఉద్యోగాలు, ఉత్పత్తి అవకాశాలు ఉన్నాయని అనుకున్నప్పుడే. సమస్య మొత్తం ఇక్కడే ఉంది.

ఉద్యోగాల్లో వ్యవసాయ రంగ భాగస్వామ్యం ఏకంగా 43 శాతం. చైనాలో ఇది  25 శాతమే. యువజనం ఉత్పాదకత పెరగాలంటే వారు గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు రావాల్సి ఉంటుంది. భారత్‌ వ్యవసాయ సంబంధిత ఉద్యోగాలను 15 శాతం వరకూ తగ్గించాలనుకుంటే రాగల 25 ఏళ్లలో కనీసం 9.3 కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించాల్సి ఉంటుంది.

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరించింది! ఈ క్రమంలో మనం చైనాను అధిగమించామని ఐక్యరాజ్యసమితి జనాభా డ్యాష్‌ బోర్డ్‌ అంచనా వేసింది. 2011 తరువాత దేశంలో జనాభా లెక్కల నిర్వ హణ జరగలేదు కాబట్టి ఐరాస అంచనాలపై మనం ఆధారపడాల్సి వచ్చింది. కోవిడ్‌ కారణంగా 2021లో నిర్వహించాల్సిన జనాభా లెక్క లను వాయిదా వేసిన విషయం తెలిసిందే. అధికారిక జన గణన ఎప్పుడు జరుగుతుందో ఇప్పటివరకూ ఎలాంటి సూచనా లేదు. 

జనాభా పెరిగిపోతోందంటే ఒకప్పుడు ఎంతో ఆందోళన వ్యక్తమ య్యేది. కానీ ప్రపంచంలోని చాలా దేశాల్లో జనాభా తగ్గిపోతున్న నేప థ్యంలో యువశక్తితో కూడిన భారత్‌ను కొంత ఈర‡్ష్యతో చూసే సందర్భం! ఐరాస లెక్కల ప్రకారం, దేశ జనాభా సగటు వయసు 28 ఏళ్లు. జనాభాలో సగం కంటే ఎక్కువ మంది వయసు ముప్ఫై ఏళ్ల లోపే. ఉద్యోగం లేదా పని చేసే వయసు 15 – 64 ఏళ్లనుకుంటే అలాంటివాళ్లు 92.5 కోట్ల మంది ఉన్నారు. వీళ్లు ఉత్పత్తి, వినియోగం, ఆదా కూడా బాగా చేయగలరు. అదే సమయంలో వయోవృద్ధుల సంక్షే మానికి పెట్టాల్సిన ఖర్చు తక్కువ.

ఇక్కడ మనమో విషయం గుర్తుంచుకోవాలి. పైన చెప్పుకున్న అంచనాలన్నీ ఇతర అంశాలతో ముడిపడి ఉన్నవే. దేశంలోని యువ జనానికి సరైన వేతనాలున్న ఉద్యోగాలు, ఉత్పత్తి అవకాశాలు ఉన్నా యన్నది వీటిల్లో ఒకటి. ఉద్యోగాల ద్వారా వారికి తినేందుకు తగినంత ఆహారం, వినోదాలు అందుతున్నాయనీ, ఆరోగ్యం బాగుందనీ, పనికొచ్చే విద్యతో లాభాలు చేకూరాయనీ అనుకోవాలి.

సమస్య మొత్తం ఇక్కడే ఉంది. ఉద్యోగాల్లో వ్యవసాయ రంగ భాగస్వామ్యం ఏకంగా 43 శాతం. చైనాలో ఇది  25 శాతమే. అమెరికాలో రెండు శాతం కంటే తక్కువ మంది ఉద్యోగాల కోసం వ్యవసాయంపై ఆధార పడుతున్నారు. ఒకవేళ భారత్‌ వ్యవసాయ సంబంధిత ఉద్యోగాలను 15 శాతం వరకూ తగ్గించాలనుకుంటే రాగల 25 ఏళ్లలో కనీసం 9.3 కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించాల్సి ఉంటుంది.

ఉద్యోగాల కల్పన జరగాలి
యువజనం ఉత్పాదకత పెరగాలంటే వారు గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు రావాల్సి ఉంటుంది. నగరీకరణ ఫలితంగా నగరాల మౌలిక సదుపాయాలపై ఒత్తిడి పడుతుంది. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితిని గమనిస్తే తయారీ రంగం బలహీనతలు కొట్టొచ్చినట్టు కని పిస్తాయి. మేకిన్ ఇండియా, ఉత్పాదకతతో ముడిపడిన ప్రోత్సాహ కాలు (పీఎల్‌ఐ) వంటి పథకాలతో అధిగమించే ప్రయత్నం జరిగినా సాధించింది కొంతే. భారత ఆర్థిక వ్యవస్థ మొత్తమ్మీద తయారీ రంగం వాటా 14 శాతం మాత్రమే. చైనాలో ఇది దాదాపు 30 శాతం. 

ఉద్యోగాల విషయానికి వస్తే గత ఏడాది జూలైలో పార్లమెంటులో అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానమిస్తూ, 2014– 22 మధ్య కాలంలో ప్రభుత్వానికి 22.05 కోట్ల దరఖాస్తులు వచ్చాయనీ, వీటిల్లో నియామక ఉత్తర్వులు అందుకున్నది కేవలం 7.22 లక్షలు లేదా 0.3 శాతం మాత్రమేననీ తెలిపింది. ప్రస్తుతం దేశంలోని యువతకు ఉద్యోగాలు లేకపోవడమే కాదు... నిరాశా నిస్పృహలతో వాటి కోసం ఎదురు చూసే సహనాన్నీ కోల్పోయినట్లు కనిపిస్తోంది. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం, దేశ యువ జనాభాలో 30.7 శాతం అటు చదువుకోడం లేదు... ఇటు ఉద్యోగమూ చేయడం లేదు. అలా గని ఏదైనా శిక్షణ పొందుతున్నారా అంటే అదీ లేదు!

గత ఏడాది అక్టోబరులో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం... దేశంలో మునుపటి కంటే ఎక్కువ మంది పిల్లలు బడుల్లోకి చేరుతున్నారు. వదిలిపోయేవారు తక్కువ య్యారు. బోధన నాణ్యత, ఉపాధ్యాయుల సంఖ్యలు గత దశాబ్ద కాలంలో పెరిగాయి. అయితే ప్రాథమిక విద్యా రంగం చాలా సవాళ్లను ఎదుర్కొంటోందనీ, గ్రామీణ ప్రాంతాల్లో సాక్షరతను వృద్ధి చేయడం, అంకెలకు సంబంధించిన నైపుణ్యాన్ని పెంచడం వీటిల్లో కొన్ని మాత్రమేననీ తెలిపింది. 

ప్రాథమిక విద్యాభ్యాసం సమస్యలు ఒకవైపు అలా ఉండగా... ఉన్నత విద్య పరిస్థితి ఏమంత బాగోలేదు. కొత్త కాలేజీలు బోలెడన్ని పుట్టుకొస్తున్నా, విద్యారంగం పరిశ్రమ స్థాయికి చేరుకున్నా చాలా మంది పట్టభద్రుల నైపుణ్యాల స్థాయి తక్కువగా, కొన్ని సందర్భాల్లో అస్సలు లేకుండా పోయినట్లు బ్లూమ్‌బెర్గ్‌ విడుదల చేసిన ఒక నివేదిక తెలిపింది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటకు ఇవి స్పీడ్‌ బ్రేకర్లే. 

దేశం ఎదుర్కొంటున్న ఇంకో ముఖ్యమైన సవాలు పనిచేసే వారిలో మహిళల సంఖ్యను పెంచడం. అంతర్జాతీయ కార్మిక సంస్థ లెక్కల ప్రకారం దేశంలో పని చేస్తున్న లేదా పనికోసం ఎదురు చూస్తున్న (లేబర్‌ఫోర్స్‌ పార్టిసిపేషన్  రేట్‌ లేదా ఎల్‌ఎఫ్‌పీఆర్‌) వారు 52 శాతం. మహిళలు అతితక్కువగా (22 శాతం) ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతూండటం ఇందుకు కారణం.

ఎక్కువమంది భాగస్వాములయ్యే అమెరికాలో ఇది 73, చైనాలో ఇది 76 శాతం. వాస్తవానికి ఈ పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉండవచ్చుననీ, ఎల్‌ఎఫ్‌పీఆర్‌ 40 శాతానికి తగ్గిపోయిందనీ సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్  ఎకానమీ చెబుతోంది. మహిళల విషయానికి వస్తే అది కేవలం 19 శాతమేనని తేల్చింది. ఇది సౌదీ అరేబియా (31) కంటే తక్కువ కావడం గమనార్హం.

సమస్యల జాబితా ఇక్కడితో ఆగిపోలేదు. ఆరోగ్యంపై దేశం పెడుతున్న ఖర్చు ప్రపంచంలోనే అత్యల్పం. నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే (2019– 21) చెబుతున్న దాని ప్రకారం, దేశంలో ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న వారిలో 35 శాతం మంది తమ సామర్థ్యానికి తగ్గట్టుగా ఎదగడం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం దేశంలో ప్రతి పదివేల మంది పౌరులకు కేవలం ఐదు ఆసుపత్రి బెడ్లు ఉన్నాయి. చైనాలో ఈ సంఖ్య 43. అలాగే 15–49 మధ్య వయస్కులైన మహిళల్లో సగం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. 

ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు ప్రయత్నిస్తోందన్న దానికి నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, రోడ్లు, రైల్వే వ్యవస్థలు కొంతవరకూ నిదర్శనంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రజా సేవల విష యంలో మరింత ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరముంది. ఆరోగ్యం, విద్య వంటి రంగాలకు నిధుల కేటాయింపులు తక్కువగా ఉండటం మానవ వనరులపై దుష్ప్రభావం చూపుతుంది. ఇది కాస్తా ఉత్పాదకత తగ్గేందుకు, కార్మికులు, ఉద్యోగాలు చేసే వారిలో నైపుణ్యాల లేమికి దారి తీస్తుంది.

జపాన్ , చైనా వంటి దేశాలు తమ జనాభాల కారణంగా ఎదిగేందుకు ఇవే కారణమన్నవి ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. భారత్‌ కూడా వీటి ఆధారంగానే వృద్ధి పథంలో అగ్రస్థానానికి చేరాలని ఆశిస్తోంది. అయితే జనాభా తీరు తెన్నుల వల్ల వచ్చే లాభాలు వాటంతటవే రావు. సుస్థిర ఆర్థికాభివృద్ధి కావాలంటే వినూత్నమైన విధానాలు, సమర్థమైన అమలు అత్యవ సరమవుతాయి. 

చైనా విషయాన్నే తీసుకుంటే... కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేయడమే కాకుండా, తయారీ రంగంలో సూపర్‌ పవర్‌గా ఎదుగుతోంది. అయితే ప్రస్తుతం చైనా జనాభా తగ్గుముఖం పడు తోంది. దీంతో ఆ దేశం ఎదుర్కొనే సవాళ్లూ కూడా మారిపోతాయి. ఈ సవాళ్లలో ప్రధానమైంది తగ్గిపోతున్న కార్మిక శక్తి ఉత్పాదకతను వేగంగా పెంచాల్సిన అవసరం ఉండటం. చైనాకు కొన్ని లాభాలూ ఉన్నాయి. జనాభా తక్కువగా ఉండటం వల్ల పర్యావరణంపై దుష్ప్ర భావం తక్కువగా ఉంటుంది. నిరుద్యోగిత తగ్గి వేతనాలు పెరిగేందుకు దోహదపడవచ్చు.

మనోజ్‌ జోషి 
డిస్టింగ్విష్డ్‌ ఫెలో, అబ్జర్వర్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో) 

మరిన్ని వార్తలు