నెహ్రూ హిందువు కాదంటారా?

9 May, 2023 00:39 IST|Sakshi
భారత మాజీ ప్రధాని వాజ్‌పేయి, తొలి ప్రధాని నెహ్రూ, ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ సర్‌సంఘ్‌చాలక్‌ గోల్వాల్కర్‌

విశ్లేషణ

నెహ్రూ నిజంగానే హిందువులకు వ్యతిరేకిగా ఉన్నారా? ఆయన జీవితాన్ని తరచి చూసిన ఏ సత్యాధ్యయనమైనా వంచనాపూరితమైన ఈ దుష్ప్రచారాన్ని బహిర్గతం చేస్తుంది. రామాయణ, మహాభారత, భగవద్గీతల పట్ల నెహ్రూకు ఉన్న ప్రీతి, గౌరవ ప్రపత్తులకు సాక్ష్యాల వెల్లువలు ఆయన రచనల్లో కనిపిస్తాయి. గుడిలో ప్రదక్షిణాలు చేసే హిందువు కాదు నెహ్రూ. కానీ హిందూ ఆధ్యాత్మికత, మార్మికతలపై ప్రగాఢమైన ఆసక్తులతో పెరిగారు. హిమాలయాలు, గంగానది భారతీయ నాగరికతకు ఉయ్యాలలు అని నెహ్రూ చేసిన అభివర్ణన మనల్ని వాటి దివ్యత్వంలో ఓలలాడిస్తుంది. దురదృష్టవశాత్తూ నెహ్రూ హిందువని సంఘ్‌ పరివార్, కాంగ్రెస్‌ రెండూ మరిచిపోయాయి.

తప్పుడు సమాచారానికి విస్తృత ప్రచారం కల్పించడంలో బీజేపీలోని కేంద్రీకృత సోషల్‌ మీడియా కమ్యూనికేషన్‌ వ్యవస్థ ఎంతో సమర్థంగా పని చేస్తుంటుందని ఢిల్లీ కాలేజీలో పాఠాలు చెబుతుండే నా మిత్రుడొకరు అన్నారు. ‘‘ఢిల్లీ నుంచి పంపిన సమాచారం వేలాది వాట్సాప్‌ గ్రూపుల ద్వారా దేశం మొత్తానికి చేరుతుంది. ఉదాహరణకు, నేనొకసారి బిహార్‌లోని నా గ్రామస్థులు కొందరిని...‘విద్య వల్ల నేను ఆంగ్లేయుడిని, సంస్కృతి వల్ల మహమ్మదీయుడిని, యాదృచ్ఛికంగా మాత్రమే హిందువును’ అని ఒక నాయకుడు చెప్పుకున్నారని అంటారు. ఆ నాయకుడెవరో మీకు తెలుసా?’ అని అడిగాను. ఆ ప్రశ్నకు తటాలున వచ్చిన సమా ధానం: ‘నెహ్రూ’! 

భారతదేశ తొలి ప్రధాని నెహ్రూ అంటే గిట్టని హిందూ జాతీయవాద రాజకీయ పార్టీ ‘హిందూ మహాసభ’ 1950లో తొలి సారి, ‘‘నెహ్రూ విద్య చేత ఆంగ్లేయుడు. సంస్కృతి చేత మహమ్మ దీయుడు. యాదృచ్ఛికంగా మాత్రమే హిందువు’’ అని విమర్శించింది. తదనంతర కాలంలో ఆ మాటను నెహ్రూను ద్వేషించేవారంతా నెహ్రూకే ఆపాదించి, స్వయంగా ఆయనే తన గురించి ఆ విధంగా చెప్పుకొన్నట్లు ప్రచారంలోకి తెచ్చారు.

గత ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ, ‘‘యాదృచ్ఛికంగా మాత్రమే తాము హిందువులమని చెప్పుకున్న వారి వారసులు తమను తాము హిందువులమని చెప్పు కోకూడదు’’ అని రాహుల్‌ గాంధీపై చురకలు వేయడంతో ఉద్దేశ పూర్వకమైన ఆ ఆపాదింపునకు పునరుద్ధరణ జరిగినట్లయింది.
 
సుసంపన్న భారత ఆనవాళ్లు
నెహ్రూ నిజంగానే హిందువులకు వ్యతిరేకిగా ఉన్నారా? ఆయన జీవితాన్ని తరచి చూసిన ఏ సత్యాధ్యయనమైనా వంచనాపూరితమైన ఈ దుష్ప్రచారాన్ని బహిర్గతం చేస్తుంది. నెహ్రూ రాసిన ‘గ్లింప్సెస్‌ ఆఫ్‌ వరల్డ్‌ హిస్టరీ’ (1934), ‘యాన్‌ ఆటోబయాగ్రఫీ’ (1936), ‘ద డిస్క వరీ ఆఫ్‌ ఇండియా’ (1946) మూడూ ప్రభావశీలమైనవి. డిస్కవరీ ఆఫ్‌ ఇండియా కారాగార వాసంలో రాసిన ఒక క్లాసిక్‌. (బ్రిటిష్‌ వాళ్లు ఆయన్ని 14 సార్లు జైలుకు పంపారు.

3,259 రోజులు కటకటాల వెనుక గడిపారు.) ఆయన ప్రసంగ సంకలనాలు, వ్యాసాలు, లేఖలు (పక్షానికొకసారి ముఖ్యమంత్రులకు ఆయన రాసిన లేఖలే ఐదు భారీ సంపుటాలు అయ్యాయి!) ... ఇవన్నీ కూడా ఇస్లాం, ఇతర బాహ్య ప్రభావాల చేత సుసంపన్నమైనదిగా నెహ్రూ భావించిన భారతదేశం తాలూకూ ప్రాచీన హిందూ నాగరికత సార్వత్రికత, సమగ్రతలతో నిండి ఉన్నవే.

రామాయణ, మహాభారత, భగవద్గీతల పట్ల నెహ్రూకు ఉన్న ప్రీతి, గౌరవ ప్రపత్తులకు సాక్ష్యాల వెల్లువలు ఆయన రచనల్లో కనిపి స్తాయి. వేదాలు, ఉపనిషత్తులు, తదితర గ్రంథాలలోని మన రుషుల జ్ఞానం, భక్తియుగంలోని సాధువులు, కవులు, సంఘ సంస్కర్తలు; రామకృష్ణ పరమహంస, స్వామీ వివేకానంద, మహర్షి అరబిందో, ఆధునిక కాలంలో జాతీయతా భావం మేల్కొనేందుకు దోహదపడిన ఇతర హిందూ తాత్విక మహర్షుల గొప్పదనాన్ని నెహ్రూ రచనలు దర్శింపజేస్తాయి.

ఇక తన గురువు, హిందూ మతబోధనలతో జీవిత మార్గాన్ని ఏర్పరచిన మహాత్మాగాంధీపై ఆయనకున్న గురి ఎంతటిదో తెలిసిందే. నెహ్రూ తన చివరి సంవత్సరాలలో ఉపనిషత్తులపై చర్చించడానికి తరచు తనను కలిసేందుకు వచ్చేవారని భారత రాష్ట్రపతి (1962–67), హిందూ తాత్వికతపై ప్రశంసలు పొందిన అనేక పుస్తకాలకు రచయిత అయిన ఎస్‌.రాధాకృష్ణన్‌ ఒక సందర్భంలో వెల్లడించారు. 

ఆలోచనల ప్రతిధ్వనులు
నెహ్రూ ప్రాపంచిక దృక్పథానికి, ఆయన కాలం నాటి కొందరు జనసంఘ్‌ హిందూ నాయకుల దృష్టి కోణానికి మధ్య స్పష్టమైన సారూప్యాన్ని కూడా మనం చూడవచ్చు. ఉదాహరణకు, బీజేపీ తన సైద్ధాంతిక మార్గదర్శిగా పరిగణించే పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రంథం ‘ఇంటెగ్రల్‌ హ్యూమనిజం’... పెట్టుబడిదారీ, కమ్యూనిస్టు వ్యవస్థలను విడిచిపెట్టి భారతదేశం సమగ్ర అభివృద్ధి మార్గాన్ని అనుసరించాలన్న నెహ్రూ ఆలోచనను ప్రతిధ్వనిస్తుంది.

నెహ్రూ మాదిరిగానే దీన్‌దయాళ్‌ కూడా మన ప్రాచీన సంస్కృతిలో మంచిది ఏదో దానిని తీసుకుని, అందులోని చెడును రూపుమాపడానికి సంసి ద్ధమవడాన్ని గర్వంగా భావించాలని చెప్పారు. ఆయన ఇలా రాశారు: ‘‘మనం మన ప్రాచీన సంస్కృతిలోని ప్రత్యేకతను గుర్తించకపోలేదు. అలాగని మనం పురావస్తు శాస్త్రజ్ఞులం కాలేము. విస్తారమైన ఈ పురావస్తు మ్యూజియానికి సంరక్షకులం కావాలన్న ఉద్దేశం కూడా మనకు లేదు. మన సమాజంలో విలువలను, జాతీయ ఐక్యతను పెంపొందించడానికి అవసరమయ్యే కొన్ని సంస్కరణలైతే చేయాలి. అందుకోసం కొన్ని సంప్రదాయాలకు స్వస్తి చెప్పాలి’’.

నెహ్రూకు, ఆర్‌ఎస్‌ఎస్, జనసంఘ్, మోదీ–పూర్వపు బీజేపీ లలోని నెహ్రూ విమర్శకులకు మధ్య తీవ్రమైన కొన్ని విభేదాలు ఉండొచ్చు. వాటిని దాచేయలేం. కానీ ఇప్పుడు నెహ్రూపై మనం చూస్తున్న క్రూర, విషపూరితమైన దూషణలు అప్పుడు లేవు. 1964 మేలో ఆయన మరణించినప్పుడు పార్లమెంటులో అటల్‌ బిహారీ వాజ్‌పేయి... ‘‘తన ముద్దుల యువరాజు దీర్ఘ నిద్రలోకి కనురెప్పలు వాల్చడంతో భరతమాత శోక సముద్రంలో మునిగిపోయింది’’ అని ఘనంగా నివాళులు అర్పించారు.

నెహ్రూను శ్రీరామచంద్రుడితో పోలుస్తూ, ‘‘వాల్మీకి గాథలో కనిపించే గొప్ప భావనలు మనకు పండిట్‌జీ జీవితంలో లభిస్తాయి’’ అన్నారు. ‘‘రాముడిలా నెహ్రూ కూడా అసాధ్యమైన, అనూహ్యమైన వాటికి రూపకర్త. ఆయన వ్యక్తిత్వ బలం, ఆ చైతన్యం, మనోస్వేచ్ఛ; ప్రత్యర్థికి, శత్రువుకు సైతం స్నేహ హస్తం చాచే గుణం, ఆ పెద్ద తరహా, ఆ గొప్పతనం బహుశా భవి ష్యత్తులో కనిపించకపోవచ్చు’’ అని నివాళులు అర్పించారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ రెండవ చీఫ్‌ ‘గురూజీ’ గోల్వాల్కర్‌... నెహ్రూ దేశభక్తిని, మహోన్నతమైన ఆదర్శవాదాన్ని కొనియాడుతూ, ఆయనకు ‘భరత మాత గొప్ప పుత్రుడి’గా హృదయపూర్వక అంజలులు ఘటించారు. భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థకు బలమైన పునాది వేసినందుకు ఎల్‌.కె. అద్వానీ తరచు నెహ్రూను ప్రశంసించేవారు. 2013లో ఆయన తన బ్లాగులో, ‘‘నెహ్రూ లౌకికవాదం హైందవ పునాదులపై ఆధార పడి ఉంది’’ అని విశ్లేషించారు. 

అలాగే, తీవ్ర మనో వేదనతో నెహ్రూ అకాల మరణం చెంద డానికి కారణం అయిన (1962 చైనా దురాక్రమణ యుద్ధంలో) భారత్‌ పరాజయం తర్వాత నెహ్రూ ఆర్‌ఎస్‌ఎస్, జనసంఘ్‌లను తిరిగి అంచనా వేయడం ప్రారంభించారనేందుకు కొన్ని ఆధారాలు ఉన్నాయి. తన మరణానికి కొద్ది వారాల ముందు జర్నలిస్టుల బృందంతో జరిపిన సంభాషణలో కమ్యూనిస్టు అనుకూల వార్తా పత్రిక అయిన ‘ది పేట్రియాట్‌’ ప్రతినిధి జనసంఘ్‌ను ‘జాతీయ వ్యతిరేక పార్టీ’ అనడంతోనే నెహ్రూ ఆ ప్రతినిధిని వారించారు. ‘‘కాదు, జనసంఘ్‌ దేశభక్త పార్టీ’’ అని బదులిచ్చారు. 

దురదృష్టవశాత్తూ నెహ్రూ హిందుత్వాన్ని జనసంఘ్, కాంగ్రెస్‌ రెండూ మరిచిపోయాయి. బదులుగా అవి తమ మధ్య ఉన్న వ్యత్యా సాన్ని నిరంతరంగా ఆరున్నరొక్క రాగం తీస్తున్నాయి. ఏదేమైనప్పటికీ భారతీయ నాగరికతను యుగయుగాలుగా నిలబెట్టిన ప్రత్యేక లక్షణం ‘సమన్వయాన్ని సాధించగల సామర్థ్యం’, ‘వ్యతిరేకతల్ని పరిష్కరించు కోవడం’, ‘ఒక కొత్త కలయిక’ అని వారు గుర్తుంచుకోవాలి. రెండు ధ్రువాలుగా విడిపోతున్న నేటి ప్రమాదకర కాలానికి... జాతి ప్రయోజ నాల కోసం ‘సంవాదం’ (సంభాషణ) ద్వారా ‘సమన్వయం’ సాధించిన నెహ్రూ ఆదర్శప్రాయులు. 

సుధీంద్ర కులకర్ణి 
వ్యాసకర్త మాజీ ప్రధాని వాజ్‌పేయి సహాయకులు
(‘ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ సౌజన్యంతో) 

మరిన్ని వార్తలు