దొరను ఢీకొన్న ధీర.. ఐలమ్మ

10 Sep, 2020 00:55 IST|Sakshi

వంగి దండాలు పెట్టే రోజుల్లో సివంగిలా గర్జించింది. ఆమె కొంగు నడుముకు చుడితే దొరతనం తోకముడిచింది. ఆమె కొడవలి చేతబడితే పీడితజనం కడలిలా తరలివచ్చారు. ఆడదని అలుసుగా చూసిన కంట్లో నలుసు అయింది. ఆమె తెగింపుతోనే వెట్టిచాకిరీ ముగింపునకు వచ్చింది. దొరను ఢీకొన్న ధీర. నడీడులో గడీలను గడగడలాడించింది. ఎత్తిపట్టిన చేతిలో ఎర్రజెండా అయింది. ఆమె ఎవరో కాదు వీరనారి చాకలి ఐలమ్మ. ఆశయమే ఆశగా శ్వాసించింది. సాహసంతోనే సహవాసం చేసింది. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాగి పోరులో మమేకమైంది. భూమిలేకపోతే జిందగీ లేదని రక్తతర్పణం చేసిన బందగి దారిలో నడిచింది. పోరుదారిలో అయినవాళ్లను పోగొట్టుకొని అందరికీ అయినదానిలా నిలిచింది. సంగంల చేరితే సంగతి చెప్తానన్న దొరకు ఏ గతీ లేకుండా చేసింది. ‘బాంచెన్‌ నీ కాల్మొక్తా’ అన్న జనం చేత బందూకు చేతబట్టించింది. వెట్టిచాకిరీ చేసేవారు అలగా జనం కాదు, సహస్రవృత్తులు చేసే సకలజనం అని చాటి చెప్పింది.

1895లో సద్దుల బతుకమ్మ నాడు బట్టలుతికే చాకలి దంపతులు ఓరుగంటి మల్లమ్మ, సాయిలు నాలుగో సంతానంగా జన్మించింది ఐలమ్మ. తల్లిదండ్రులది ఉమ్మడి వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురం. తన 11 ఏట పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో లగ్గమైంది. ఆమెకు ఐదుగురు కొడుకులు, ఒక కూతురు. దొర ఇంట ఊడిగం, ఊరిజనం బట్టల ఉతుకుడు. ఇదే వారి జీవనాధారం. దీంతో కుటుంబం గడవడం గగనమయ్యేది. ఎదిగి వచ్చిన కొడుకులతో ఎవసాయం చేయాలనుకుంది. పాలకుర్తికి పక్కనే ఉన్న మల్లంపల్లి దొర కుటుంబానికి చెందిన ఉత్తంరాజు జయప్రదాదేవి వద్ద 40 ఎకరాల భూమిని మఖ్త(కౌలు)కు తీసుకుంది. అదే విస్నూరు దేశ్‌ముఖ్‌ రాపాక రామచంద్రారెడ్డికి కంటగింపు అయింది. 

తనకు వ్యవసాయమే ముఖ్యమని, దొర గడీలో వెట్టిచేయను పో అని గట్టిగా చెప్పింది. అప్పుడే వెట్టిగొట్టాలు చేయవద్దని పిలుపునిచ్చిన ఆంధ్రమహాసభ(సంగం)లో 1944లో చేరింది. కష్టజీవులను చేరదీసి కట్టుబాట్లను సవాల్‌ చేసింది. ఆడది ముందుబడి తన ఆధిపత్యాన్ని వెనుకబడేసిందని రామచంద్రారెడ్డి రగిలిపోయాడు. దీంతో ఐలమ్మపై దొర కక్ష పెంచుకున్నాడు. కౌలుకు తీసుకున్న భూమిలో కాపుకొచ్చిన పంటను కాజేయాలని పన్నాగం పన్నాడు. గూండాలను పురమాయించారు. ఐలమ్మ సంగపోళ్ల అండతో గూండాలను తరిమికొట్టి తన పంటను ఒడుపుగా ఇంటికి చేర్చింది. ‘అప్పుడు ఐలమ్మ అడ్డం తిరిగి కొంగునడుముకు చుట్టి కొడవలి చేతబట్టి సివంగి వోలె గర్జించిన తీరు నా కళ్లలో ఇప్పటికీ కదలాడుతోంది’ అని తెలంగాణ సాయుధ పోరాట యోధుడు భీంరెడ్డి నర్సింహారెడ్డి తన ఆత్మకథ ‘భూమిక’లో రాసుకున్నాడు. ఐలమ్మ పోరాటక్రమంలో ఓ కొడుకును పోగొట్టుకుంది. మరో ఇద్దరు కొడుకులు, భర్త జైలు పాలయ్యారు. నల్లగొండలోని జైలులో వారిని కలిసేందుకు ఐలమ్మ ఒంటరిగా 100 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి వచ్చేది.

ఆ మగువ తెగువ.. దిగువ జనానికి స్ఫూర్తి
ఐలమ్మ తెగువ.. సామాజికంగా దిగువ ఉన్న జనానికి ప్రేరణ, స్ఫూర్తినిచ్చింది. పల్లెపల్లెన ఉద్యమం అలలు అలలుగా ఎగిసిపడింది. పల్లెపట్టున దొరపట్టు తప్పింది. బందగి రక్త తర్పణంతో ఎరుపెక్కిన పోరుజెండా, ఐలమ్మ సాహసంతో సాయుధపోరు దారి చూపింది. ఐలమ్మను గడీకి పిలిపించుకొని... ‘నిన్ను ఇక్కడ చంపితే దిక్కెవరు’ అని ప్రశ్నించిన దొరకు ఖతర్నాక్‌ జవాబిచ్చింది. ‘నీకు ఒక్కడే కొడుకు, నాకు నలుగురు కొడుకులు. నన్ను చంపితే నా కొడుకులు నిన్ను బత్కనీయరు. నీ గడీల గడ్డి మొలస్తది’ అని హెచ్చరించింది. ఐలమ్మ అన్నట్లే గడీల గడ్డిమొలిచింది. దొరల ఆధిపత్యం నేలమట్టమైంది. నైజాం వ్యతిరేక పోరాటానికి ఊపిరిలూదిన ఐలమ్మ 1985 సెప్టెంబర్‌ 10న ఊపిరి వదిలింది.
నీలం వెంకన్న, పాత్రికేయుడు
ఈ–మెయిల్‌ : neelamvenkanna75@ gmail.com

మరిన్ని వార్తలు