మేలుకోకపోతే ఆహార సంక్షోభమే!

8 Jun, 2022 13:08 IST|Sakshi

ఈ ఏడాది భూతాపం వల్ల ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ దిగుబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయనీ, అందువల్ల రానున్న రోజుల్లో ఆహార సంక్షోభం తలెత్తవచ్చుననీ ఐక్యరాజ్య సమితి వెలువరించిన నివేదిక సమీప భవిష్యత్తులో మానవాళి భవిష్యత్తు మనుగడ పట్ల ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. భూ ఉష్ణాన్ని రాబోయే 10 ఏళ్లల్లో కనీసం 2 డిగ్రీలు తగ్గించాలని దాదాపు 8 ఏళ్ల క్రితం పారిస్‌లో రూపొందించిన ‘వాతావరణ విధాన పత్రం’ ఓ చిత్తు కాగితంగా మారిన ఫలితంగానే ఈ సమస్య ముంచుకొచ్చింది. 

ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగే శిఖరాగ్ర సదస్సులలో చేసే తీర్మానాలకు సభ్యదేశాలు కట్టుబడకుండా వాటిని ఉల్లంఘించడం ఓ రివాజుగా మారింది. ఉమ్మడి ప్రయోజనాలను తాకట్టుపెట్టి సొంత ప్రయోజనాలకే అగ్ర దేశాలు మొగ్గుచూపడం వల్ల ప్రపంచంలో జీవ వైవిధ్యం, వాతావరణ సమతుల్యత అదుపుతప్పాయి. వ్యవసాయ రంగానికి చేటు చేసే గ్రీన్‌హౌస్‌ వాయువులు వాతావరణంలో మితి మీరిన మోతాదులో పెరిగిపోయాయి. భూమి మీద పర్యావరణ సమతుల్యత కాపాడడానికి అనేక రకాలైన మొక్కలు, జీవులు, జంతువులు, పక్షులు, సూక్ష్మజీవులు నిర్దిష్ట సంఖ్యలో ఉండాలి. చిన్న, పెద్ద వృక్ష సంతతి కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ప్రాణవాయు వును సృష్టిస్తాయి. బ్యాక్టీరియా నీటిలోని లవణ సాంద్రతను కాపాడు తుంది. నదీ ప్రాంతాల అడవులు వరదల్ని నిరోధించి నీటి ప్రవాహ వేగాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. వాతావరణంలో ఉండవలసిన ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్‌ డయాక్సైడ్‌ పరిమాణాలను సమపాళ్లలో నియంత్రించే శక్తి జీవ వాతావరణానికి ఉంటుంది. అయితే నత్రజని, మీథేన్, క్లోరోఫోరో కార్బన్లు తదితర గ్రీన్‌హౌస్‌ వాయువులు వాతావరణంలోకి ప్రవేశించి పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఉష్ణోగ్రతలు అనూ హ్యంగా పెరిగిపోయి, అకాల వర్షాలు పడుతున్నాయి. కాలం కాని కాలంలో తుఫానులు సంభవిస్తున్నాయి.

గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలలో కోతకు సంబంధించి లక్ష్యాల సాధనలో అగ్రదేశాలు దారుణంగా విఫలం అయ్యాయి. 1997లో వాయు ఉద్గారాలను అంతకుముందుకంటే దాదాపు 5 శాతం తగ్గించు కోవాలని లక్ష్యంగా ఏర్పరచుకొన్నారు. దానినే ‘క్యోటో ప్రోటోకాల్‌’గా పిలుచుకోవడం జరిగింది. అగ్రదేశాలైన అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా తదితర దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలకు విఘాతం కలుగుతుందనే సాకుతో తమ పారిశ్రామిక ఉత్పత్తుల నియంత్రణపై జాగ్రత్తలు పాటించలేదు. ఆ తర్వాత పర్యావరణంపై జరిగిన ‘కోపెన్‌ హాగన్‌’ సదస్సు, పారిస్‌లో జరిగిన ‘కాప్‌’ సదస్సులలో సైతం పాత కథే పునరావృతం అయింది. ప్రస్తుత పర్యావరణ సంక్షోభానికి ఏదో ఒక్క దేశమే కారణమని చెప్పలేనప్పటికీ ఆ దుష్ఫలితాలు భారత్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. మన దేశానికి సంబంధించినంత వరకూ అంతర్జాతీయ పరిస్థితులతోపాటు దేశంలో రసాయనిక ఎరు వులు, క్రిమిసంహా రకాలు, డీడీటీల వాడకం; గనుల తవ్వకం... రోడ్డు, రైలు మార్గాల నిర్మాణం వంటి అవసరాల కోసం భారత్‌లో జీవ వైవిధ్యాన్ని సమూలంగా నాశనం చేయడం జరుగుతోంది. ఫలితంగా ఏటా సగటున 10 నుంచి 15 మీటర్ల వరకు హిమనీ నదాలు కరిగిపోతున్నట్లు వివిధ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ‘అంటార్కిటికా’పై శాస్త్రీయ పరిశోధన జరిపిన కమిటీ వెలువరించిన నివేదిక... 2100 సంవత్సరం నాటికి సముద్ర మట్టాలు 1.4 మీటర్లు పెరిగే ప్రమాదం ఉందనీ... దానివల్ల తీరప్రాంత నగరాలైన చెన్నె, ముంబయి, కోల్‌కతా వంటి నగరాలతోపాటు ఇతర సముద్ర తీర ప్రాంతాలూ మునగడం ఖాయమనీ స్పష్టం చేసింది.

ఉష్ణోగ్రత ఒక డిగ్రీ పెరిగితే వరి, గోధుమ, చెరకు వంటి పంటల దిగుబడి 15 శాతం మేర తగ్గిపోతుందని పలు శాస్త్రీయ నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ (ఇంట ర్నేషనల్‌ రైస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌) విశ్లేషణ ప్రకారం... వరి వెన్ను పుష్పించే సమయంలో వాతావరణ ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్‌ దాటినట్లయితే, ఆ వెన్ను పనికి రాకుండా పోతుంది. ‘యూనివర్సల్‌ ఎకొలాజికల్‌ ఫండ్‌’ నివేదిక ప్రకారం ధాన్యం, గోధుమల ఉత్పత్తిలో ప్రపంచంలో ద్వితీయ స్థానాన్ని ఆక్రమిస్తున్న భారత్‌లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగితే రాబోయే దశాబ్దాల కాలంలో వ్యవసాయ దిగుబడుల్లో రమారమి 20 శాతం క్షీణత నమోదవుతుంది. ఉత్పత్తులు ఆ మేరకు తగ్గుతూ ఉంటే వ్యవసాయం గిట్టుబాటుగాక రైతాంగం ఇతర వృత్తులకు తరలిపోయే ప్రమాదం త్వరలోనే ఏర్పడవచ్చు. ఒకవైపు జనాభా గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో అందుకనుగుణంగా ఆహార ధాన్యాలలో వృద్ధిని కాపాడుకోలేనట్లయితే, అది ఆహార సంక్షో భానికి దారి తీస్తుంది. ఒక అంచనా ప్రకారం... కరోనా వంటి ఉత్పాతం, అదేవిధంగా మలేరియా, టీబీ, ఎయిడ్స్‌ వంటి ప్రాణాం తక వ్యాధుల బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య కంటే ఆకలి చావులతో చనిపోతున్న వారి సంఖ్యే అధికంగా ఉండవచ్చు. ప్రతి యేటా ప్రపంచ వ్యాప్తంగా పోషకాహార లోపంతో చనిపోతున్న 5 ఏళ్ల లోపు పిల్లల సంఖ్య 50 లక్షలుగా ఉన్నదని గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 9 మందిలో ఒకరికి ఆహార భద్రత ఇప్పటికే లేదు. ఇంత నాగరిక సమాజంలో కూడా ఆకలి చావులు సంభవించడానికి కారణం అందరికీ ఆహార భద్రత కల్పించే ప్రణాళికలు లోపించడమే. 

వాస్తవానికి, ఆహారం పొందడం మానవుని హక్కుగా ప్రపంచం లోని దాదాపు అన్ని దేశాలూ గుర్తించాయి. ప్రజలందరికీ ఆహార ధాన్యాలు అందుబాటులో ఉంచడం తమ బాధ్యతగా ప్రభుత్వాలు స్వీకరించాలనీ, ఆకలి రహిత సమాజాన్ని ఆవిష్కరించాలనీ ఐక్యరాజ్యసమితి చాలా కాలం క్రితమే పిలుపునిచ్చింది. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలలో ఒకటైన ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ ఏర్పరుచుకొన్న లక్ష్యాలలో ప్రధానమైనది 2050 నాటికల్లా ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ దిగుబడులు 50 శాతం మేర పెంచాలన్నది! అప్పుడే పెరుగుతున్న జనాభాకు ఆహార భద్రత చేకూరుతుంది. కానీ, ఈ లక్ష్యాల సాధనకు శరవేగంగా విస్తరిస్తున్న వాతావరణ మార్పులు ప్రతిబంధకాలుగా మారాయి. (క్లిక్‌: అధికారులు ‘ఛాన్స్‌’ తీసుకోవడం లేదు!)

ఈ నేపథ్యంలో భారత్‌ వీలయినంత మేర అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవిస్తూనే... ఇంకోవైపు వాతావరణ, ఆహార సంక్షోభ సమస్యను తనకు తానుగానే పరిష్కరించుకోవడానికి తగిన వ్యూహాలతో కార్యాచరణ రూపొందించుకొనడమేగాక, చిత్తశుద్ధితో అమలు చేయగలగాలి. పర్యావరణంపై రైతాంగానికి అవగాహన కల్పించడం ద్వారా దేశంలో పంట నష్టాలను గణనీయంగా తగ్గించ వచ్చు. దేశంలో ఉన్న 7 వాతావరణ జోన్లకు అనుగుణంగానూ, అదే విధంగా రుతుపవనాల గమనం ఆధారంగానూ పంటల సాగు జరగాలి. ఇందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని రైతాం గానికి కచ్చితమైన సమాచారాన్ని అందించాలి. పర్యావరణానికి సంబంధించి దేశీయ వ్యవసాయ రంగానికి ఎదురవుతున్న సవాళ్లపై విస్తృతమైన చర్చలు, గోష్ఠులు నిర్వహించి నిపుణల సలహాలు, సూచనలు స్వీకరించి వాటిని ఆచరణలోకి తేవాలి. జీవ వైవిధ్య పరిరక్షణ కోసం సహజ అటవీ సంపదను కాపాడుకోవాలి. రసాయనిక, క్రిమి సంహారక మందుల వాడకాన్ని నియంత్రించాలి. వాతావరణంలో ప్రవేశించే కర్బన ఊద్గారాలను తగ్గించడానికి బొగ్గుకు ప్రత్యామ్నాయంగా ‘సౌరశక్తి’ని విస్తృతంగా వినియోగంలోకి తేవాలి. వ్యవసాయ రంగంలో డీజిల్‌ వినియోగాన్ని మరింత తగ్గించాలి. తరుముకొస్తున్న వాతావరణ ఆహార సంక్షోభాన్ని నివారించడానికి బహుముఖమైన కార్యాచరణతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా సమన్వయంతో కృషి చేయాలి.  (క్లిక్‌: పాలనలో టెక్నాలజీ కొత్తేమీ కాదు!)


- డాక్టర్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు 
శాసన మండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్‌

మరిన్ని వార్తలు