తప్పిన దారిని సరిచేయడం ఎక్కడ మొదలు పెట్టాలి?

4 Nov, 2023 09:29 IST|Sakshi

అభిప్రాయం 

అశో​కుడు నాటిన చెట్లు
చిన్నతనంలో సాంఘిక శాస్త్రంలో ‘అశోకుడు రోడ్ల పక్కన చెట్లు నాటించెను’ అని చదివేవాళ్ళం. అది నిజమేకానీ, అశోకుడు నాటించింది చెట్లు కాదు– మొక్కలు. ‘లీడర్‌’ కేవలం ‘పొలిటీషియన్‌’ మాత్రమే కాకుండా – ‘స్టేట్స్‌ మేన్‌’ కూడా అయితే, అతడి ఆలోచనలు ఇలా రాబోయే తరాల కోసం ఉంటాయి. ఏపీ రెండవ సీఎంగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులు ఇప్పటికే 26 జిల్లాల్లో పట్టణాలు–గ్రామా లకు విస్తరిస్తున్నాయి.

అభివృద్ధి అంటే..
అభివృద్ధి అన్నప్పుడు... ఇది సముద్రతీర రాష్ట్రం కనుక, క్రమంగా ‘కాస్మోపాలి టిన్‌’గా మారుతున్న మన జీవనశైలి వైపు ‘రాజ్యం’ ప్రత్యేక నిఘా దృష్టి కనుక పెట్టకపోతే, మనదైన సహజ సాంఘిక ప్రత్యేకతను మనం కోల్పోతాం. ఇప్పటికే అటువంటి క్షీణత మొదలయింది.అభివృద్ధి తెస్తున్న – ‘కాస్మోపాలిటన్‌’ జీవనం దేశమంతా అన్ని ఆర్థికస్థాయి సమాజాల్లోకి ముంచు కొస్తుంటే, వాటిని ఎదుర్కోవడానికి ఆయా సమాజాల పక్షంగా ప్రభుత్వాలూ, పౌరవేదికలూ అప్రమత్తం అవుతూనే ఉన్నాయి. అయితే, ఆర్థిక సంస్క రణల అమలును 1995 నాటికే ఆహ్వానించిన తెలుగునాట పరిస్థితి మిగతా వాటికి భిన్నమైనది.

తోసుకొచ్చిన హైటెక్‌ చదువులు
అప్పట్లో ఇక్కడ తొలివేటు సామాజిక శాస్త్రాల చదువుల మీద పడింది. నిజానికి 80వ దశకం మధ్యలోనే అన్ని గ్రూపులకు డిగ్రీ స్థాయిలో కొత్తగా మొదలయిన– ‘కల్చర్‌ అండ్‌ హెరిటేజ్‌’ పేపర్‌తో సహా ‘సోషల్‌ సైన్సెస్‌’ చదువుల్ని ప్రభుత్వం నీరు గార్చింది.వీటి స్థానాల్లోకి పిల్లలు ఫీజులు కట్టి చదివే ‘హైటెక్‌’ కోర్సులు వచ్చాయి. అలా కొత్త తరాలకు క్లాస్‌ గదిలోనే – ‘పౌరశాస్త్రాల స్పృహ’ లేకుండా చేయడం జరిగింది.

ఏవీ అంత తేలికగా రావు.. పొవు
ఇది కేవలం సోయలేనితనంతో జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే, అప్పట్లో– ‘టూరిజం తప్ప మరే ఇజం లేదు’ అని సాక్షాత్తూ ముఖ్యమంత్రి అనేవారు. సరే, మరి తప్పిన దారిని సరిచేయడం ఎక్కడ మొదలెట్టాలి? అప్పట్లో ‘మెక్రో ఫైనాన్స్‌’ వ్యాపారం చేసే చీకటిశక్తులు గ్రామీణ కుటుంబ ఆర్థిక వ్యవస్థ లోకి జొరబడి క్రమంగా అది – ‘కాల్‌ మనీ’ రాకెట్‌గా జుగుప్సాకరమైన రీతిలోకి రూపాంతరం చెందింది. ఇక బడుగుల నివాసాల మధ్య ‘బెల్ట్‌ షాపులు’ మాట అయితే సరేసరి. ఇటువంటివి ఊళ్ళల్లోకి ఏ ఒక్క రోజో వచ్చినవి కాదు. అలాగే, వీటి మూలాలను కుదుళ్లకంటా పెకళించడానికి అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది. అయినా ఇవి ఒక ఐదేళ్ల కాలంలో పైకి కనిపించి, మరో ఐదేళ్ల కాలంలో అదృశ్యమయేవి అంతకంటే కాదు.

కష్టకాలంలోనూ సంక్షేమం
రెండున్నర ఏళ్ల ‘కరోనా’ కాలాన్ని దాటుకుని పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలుతో నాలుగో ఏడాదికి చేరిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ వ్యాసంలో పైన చర్చించిన కంటికి కానని రుగ్మతలను గుర్తించి వాటిని ‘అడ్రెస్‌’ చేయడానికి అడుగులు వేస్తున్నది. ‘లీజర్‌ మేనేజ్మెంట్‌’ అనేది ఆరోగ్యకర సమా జాల్లో అత్యవసరమైన ప్రక్రియ. అందుకు పార్కుల నిర్మాణం వంటివి సాధారణంగా మనకు పైకి కనిపించేవి.

ఆడుదాం ఆంధ్ర..
అయితే, నైపుణ్యాభివృద్ధి, నివాస ప్రాంతాల సమీపాల్లోనే ఉపాధి లభ్యత ఆర్థిక అంశం అయితే, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు వంటివి ఊళ్ళల్లో ఆబాల గోపాలానికి ఉత్సాహం నింపుతూ ఒక బృందం (టీమ్‌) పాటవ నిర్మాణానికి దారి తీసే అంశాలు. ఇందుకోసం రాష్ట్ర క్రీడా, సాంస్కృతిక శాఖ– ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో నవంబర్‌ 15 నుండి డిసెంబర్‌ 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా– క్రికెట్, కబడి, వాలీబాల్, ఖోఖో, బ్యాడ్మింటన్‌ క్రీడల్లో అన్ని వయసుల యువతీ యువకులకు పెద్ద ఎత్తున పోటీలు నిర్వహించను న్నారు. ఇందులో గ్రామ స్థాయినుంచి రాష్ట్ర స్థాయి వరకు మూడు లక్షల మ్యాచ్‌లు నిర్వహిస్తారు.ఇందుకోసం గ్రామాల్లోని ప్రభుత్వ స్కూళ్ల కాలేజీల గ్రౌండ్స్‌ సిద్ధం చేస్తున్నారు. అందుకు ప్రభుత్వం నిధులు కేటాయించింది.

కొత్త నటుల కోసం డాటా బ్యాంక్‌
అలాగే రంగస్థల కళలను ప్రోత్సహిస్తూ ‘ఏపీ ఫిల్మ్‌ థియేటర్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌’ ఈ ఏడాది చివర ఉత్తమ నాటకాలకు – ‘నంది అవా ర్డులు’ ప్రదానం చేయబోతోంది. మన రాష్ట్రంలో షూటింగులు జరిగే సినిమా యూనిట్లకు స్థానికంగా నటులు కనుక అవసరమైతే, వారి వివరాలతో ఈ సంస్థ – ‘టాలెంట్‌ డాటా బ్యాంక్‌’ను సిద్ధంచేసింది. ఉదాహరణకు నెల్లూరు కృష్ణపట్నం పోర్టు వద్ద పనిచేస్తున్న సినిమా యూనిట్‌కు సబ్‌ ఇన్‌ స్పెక్టర్‌ పాత్రకు ఒక జూనియర్‌ నటుడు కావాలను కోండి. ఈ సంస్థ ‘వెబ్‌ సైట్‌’లోని ‘డేటా బ్యాంక్‌’లో వెతికితే, ఆ యూనిట్‌కు దగ్గర్లో ఆ పాత్ర పోషించే నటుల వివరాలు దొరుకుతాయి. ఈ ఆగస్టు నుంచి ఈ నటులకు సంస్థ ‘ఐ.డి. కార్డు’లను జారీ చేస్తు న్నది. ఇలా కొత్తవారికి అవకాశాలు అనేది మొదల యింది. 


జాన్సన్‌ చోరగుడి 
వ్యాసకర్త అభివృద్ధి, సామాజిక అంశాల వ్యాఖ్యాత 

మరిన్ని వార్తలు