నంబర్‌ లేకుంటే కటకటాలే!

15 May, 2023 12:26 IST|Sakshi

హైదరాబాద్: నెంబర్‌ ప్లేట్‌ ట్యాంపరింగ్‌పై రాచకొండ ట్రాఫిక్‌ పోలీసులు దృష్టి సారించారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం సమయాల్లో స్పెషల్‌ డ్రైవ్‌ చేపడుతున్నారు. నెంబర్‌ ప్లేట్‌ సరిగా లేకపోయిన, కనిపించకుండా ప్లేట్‌ను వంచినా, మాస్క్‌ వేసినా, అస్పష్ట నెంబర్‌ ప్లేట్‌తో నడిపినా, ట్యాంపరింగ్‌ చేసినా కేంద్ర మోటారు వాహన చట్టంసెక్షన్‌ 192 కింద కేసులు నమోదు చేస్తున్నారు. చార్జిషీట్లు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు రాచకొండ పరిధిలో 49 వేలకు పైగా నెంబర్‌ ప్లేట్‌ టాంపరింగ్‌ కేసులు నమోదయ్యాయి.

పునరావృతమైతే అంతే..
కొత్త వాహనాలు 30 రోజుల్లోగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని రాచకొండ జాయింట్‌ సీపీ సత్యనారాయణ తెలిపారు. నెంబర్‌ ప్లేట్‌ ట్యాంపరింగ్‌తో తొలిసారి చిక్కిన వాహనదారులు వెంటనే వాటిని సరిచేసుకోవాలని, ఇదే తప్పు పునరావృతం ఐతే కిమినల్‌ కేసులు నమోదు చేసి, కోర్టులో హాజరుపరుస్తామని హెచ్చరించారు.

ఆరుగురికి జైలు శిక్ష..
నెంబర్‌ ప్లేట్‌ ట్యాంపరింగ్‌ చేస్తూ రెండోసారి పట్టుబడిన ఆరుగురు నిందితులకు న్యాయస్థానం జరిమానా, జైలు శిక్ష విధించింది. వీరిలో అత్యధిక మందికి రూ.5 వేల వరకు జరిమానా విధించారు. అలాగే మూడు నుంచి ఐదు రోజుల వరకు జైలు శిక్ష కూడా విధించారు. ఇకపై నెంబర్‌ప్లేట్లు లేని వాహనాలు నడిపే వారందరిపై కేసులు నమోదు చేసి చార్జిషీట్లు నమోదు చేస్తామని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. వాహనదారులు ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా మూల్యం చెల్లించక తప్పదని పేర్కొన్నారు. నెంబర్‌ ప్లేట్‌ లేని వాహనాల వల్ల నేరాలకు ఆస్కారం ఉంటుందని, అలా జరగకుండా చూడాల్సిన అవసరం ఉందంటున్నారు.

మరిన్ని వార్తలు