ప్రజాభవన్‌ వద్ద కారు బీభత్సం, బారికేడ్లను ఢీ కొట్టి..

26 Dec, 2023 05:06 IST|Sakshi
ప్రమాదానికి కారణమైన కారు

కారులో మాజీ ప్రజాప్రతినిధి కుమారుడు ?

పంజగుట్ట, సాక్షి: అర్ధరాత్రి తర్వాత అతివేగంగా వచ్చిన ఓ కారు ప్రజాభవన్‌ ముందు ఉన్న బారికేడ్లను ఢీ కొనడంతో కారుతోపాటు బారికేడ్లు ధ్వంసమైన సంఘటన పంజగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెలుగులోకి వచ్చింది. వివరాలివీ... ఆదివారం తెల్లవారు జామున(2.45 గంటల సమయంలో) సోమాజిగూడ రాజీవ్‌ సర్కిల్‌ నుంచి ప్రజాభవన్‌ మీదుగా బేగంపేట వెళుతున్న బీఎండబ్య్లూ కారు అతి వేగం కారణంగా అదుపుతప్పి ప్రజాభవన్‌ ముందు ఉన్న బారికేడ్లను ఢీ కొట్టింది.

ఈ ఘటనలో కారు ధ్వసం కావడమే కాకుండా బారికేడ్లు కూడా ధ్వంసమయ్యాయి. సెక్యూరిటీ సిబ్బంది కారుతో పాటు డ్రైవ్‌ చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని పంజగుట్ట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ప్రమాదానికి గురైన కారులో మాజీ ఎమ్మెల్యే కుమారుడితో పాటు మరో ముగ్గురు యువకులు ఉన్నట్లు సమాచారం. మరో ముగ్గురు యువతులు కూడా కారులో ప్రయాణించినట్టు సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. పంజగుట్ట పోలీసులు డ్రైవింగ్‌ చేస్తున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించి అతడిని డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్ట్‌ చేసేందుకు తీసుకెళ్తుండగా.. అతను మరో కారు ఎక్కి అక్కడి నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. 

తప్పించారా.. ? తప్పించుకున్నాడా..?
ట్రాఫిక్‌ పోలీసుల ఫిర్యాదుతో.. పంజాగుట్ట పోలీసులు నిర్లక్ష్యంగా కారు నడిపిన అబ్దుల్‌ ఆసిఫ్‌(27)పై కేసు నమోదు చేశారు. అయితే ప్రమాద సమయంలో బోధన్‌కు చెందిన మాజీ ప్రజాప్రతినిధి తనయుడు కారు నడిపినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేసు నమోదు సమయంలో అసలు నిందితుడిని తప్పించి మరొకరి పేరు చేర్చినట్టు సమాచారం. పంజాగుట్ట పోలీసులు మాత్రం.. డ్రైవింగ్‌ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని వైద్యపరీక్షల నిమిత్తం ట్రాఫిక్‌ పోలీసులకు అప్పగించినట్టు చెబుతున్నారు. వాస్తవాలు ఏమిటనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వమని.. నగర సీపీ శ్రీనివాస్‌రెడ్డి పంజాగుట్ట పోలీసులను ఆదేశించినట్టు తెలిసింది

>
మరిన్ని వార్తలు