కోవిడ్‌ భయం.. జోష్‌ మాయం.. | Sakshi
Sakshi News home page

కోవిడ్‌ భయం.. జోష్‌ మాయం..

Published Tue, Dec 26 2023 5:06 AM

- - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: దేశవ్యాప్తంగా కోవిడ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. నగరంలోనూ ఆ ప్రభావం కనిపిస్తోంది. ఓ వైపు నూతన సంవత్సర వేడుకలకు నగరం సిద్ధమవుతున్న వేళ.. మరోవైపు తరుముకొస్తున్న మహమ్మారి అటు నగర వాసులతో పాటు న్యూ ఇయర్‌ ఈవెంట్ల నిర్వాహకులనూ ఆందోళనకు గురి చేస్తోంది.

వేడుకలు.. వ్యాప్తికి వేదికలు..

నగరంలో న్యూ ఇయర్‌ వేడుకలు ఏటా అట్టహాసంగా జరుగుతాయి. గ్రేటర్‌ పరిధిలోని 3 కమిషనరేట్ల పరిధిలో కలిపి అధికారికంగా అనుమతి పొందినవే ఏటా దాదాపుగా 7వేల ఈవెంట్లు ఉంటాయి. వీటిలో అత్యధికం పబ్స్‌, క్లబ్స్‌, ఫంక్షన్‌ హాళ్లు, బార్లు, లాంజ్‌లు, రిసార్ట్స్‌, కాఫీ షాప్‌లు ఉంటాయి. ఇవన్నీ పెద్దగా వెంటిలేషన్‌ లేని ఎయిర్‌ కండిషన్డ్‌ వాతావరణంలో జరిగే కార్యక్రమాలు కావడంతో సాధారణ ఫ్లూ నుంచి కోవిడ్‌ వంటి వ్యాధుల వ్యాప్తికి కూడా అవకాశాలు ఎక్కువ. దీన్ని దృష్టిలో ఉంచుకునే గతంలో అమలు చేసిన మాస్క్‌లు, శానిటైజేషన్‌ వంటి నిబంధనలు ఇప్పటికే తప్పనిసరి చేశారు. సోషల్‌ డిస్టెన్స్‌ లాంటి నిబంధనలు విధించినా అవి పాటించడం కష్ట సాధ్యమే.

అన్ని నగరాల్లోనూ అలర్ట్‌...

దేశవ్యాప్తంగా ప్రస్తుతం కోవిడ్‌ యాక్టివ్‌ కేసుల సంఖ్య వేలల్లోకి చేరింది. దీంతో కేంద్రం పలు రాష్ట్ర ప్రభుత్వాల్ని అప్రమత్తం చేసింది. అందులో కేరళ, కర్ణాటకతో పాటు తెలంగాణ కూడా ఉంది. కొచ్చి, బెంగళూర్‌, ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో ఇప్పటికే న్యూ ఇయర్‌ వేడుకలపై కోవిడ్‌ ప్రభావం పడింది. అక్కడి ప్రభుత్వాలు వేడుకలపై పలు రకాల ఆంక్షల్ని విధించాయి. దీంతో నగరంలోనూ ప్రభుత్వం, అధికారులు న్యూ ఇయర్‌ వేడుకల కోసం ప్రత్యేకంగా కోవిడ్‌ ప్రొటోకాల్‌ను సిద్ధం చేసే అవకాశం కనిపిస్తోంది. నగరంలో వేగంగా కాకపోయినా స్థిరంగా కోవిడ్‌ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. సోమవారం వరకు మొత్తం 45 కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. ఏదేమైనా.. నూతన సంవత్సర వేడుకల సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత నగరవాసులపై కూడా ఉంది.

న్యూ ఇయర్‌ వేడుకలకు దూరమేనా!

Advertisement
Advertisement