అందమైన నరకం ఆఫ్ఘనిస్తాన్

16 Aug, 2021 05:01 IST|Sakshi

విస్తీర్ణం 6.52 లక్షల చదరపు కిలోమీటర్లు 

జనాభా (2019) 3.22 కోట్లు 

ఆధిపత్య మతం సున్నీ ఇస్లాం  85%

అక్షరాస్యత సుమారు 43%

‘తాలిబ్‌’ అంటే పష్తో భాషలో విద్యార్థి అని అర్థం. పాక్‌ మదర్సాల్లో చదువుకునే స్టూడెంట్‌ మిలీషియా తాలిబన్లుగా రూపాంతరం చెందింది. తమ పాలనలో ఉన్న ప్రాంతాల్లో కఠినమైన ఇస్లామిక్‌ షరియా చట్టం అమలు చేయడం, తమ భూభాగాలపై పాశ్చాత్య బలగాలను తరిమికొట్టడం వీరి ప్రాథమిక లక్ష్యాలు. 

ఏవి తల్లీ? నిరుడు కురిసిన హిమ సమూహములు? అన్న మహాకవి శ్రీశ్రీ భావంలోని బాధ అఫ్గానిస్తాన్‌కు సరిగ్గా సరిపోతుంది. సింధునాగరికత పరిఢవిల్లిన ప్రాంతాల్లో ఒకటిగా పేరుపొంది, రుగ్వేద కాలంలో సువాసనల భూమిగా ప్రాముఖ్యత వహించి, మహాభారత యుద్ధం నాటికి మహాసామ్రాజ్యంగా నిలిచిన గాంధార భూమి క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోతూ వచ్చింది. ఒకప్పటి సుభిక్ష సామ్రాజ్యం ఆధునిక యుగం వచ్చేసరికి అగ్రరాజ్యాల చదరంగంలో పావుగా మారింది. స్థిరమైన పాలన లోపించడంతో మతఛాందస మూకలకు నిలయమైంది. పౌరహక్కుల హననం, నిత్య యుద్ధాలతో అఫ్గాన్‌ అలసిపోయింది. (చదవండి: అఫ్గానిస్తాన్‌లో ఆ ఆరుగురు కీలకం)

ఇరవైఏళ్ల తర్వాత అమెరికా సేనలు అటు మొహం తిప్పగానే ఇటు తాలిబన్లు తలెగరేశారు. వారి ధాటికి తట్టుకోలేక అధ్యక్షుడు ఘనీ అధికారాన్ని తాలిబన్లకు అప్పగించారు. ఈ నేపథ్యంలో గతంలో తాలిబన్ల కారణంగా అటు అఫ్గాన్‌లు, ఇటు ఇతర దేశాలు అనుభవించిన ఇబ్బందులు గుర్తొచ్చి ప్రపంచ దేశాలు ఉలిక్కిపడుతున్నాయి. అఫ్గాన్‌ రక్త చరిత్రకు కారణాలేంటి? ప్రపంచ భవితవ్యానికి, ఈ ప్రాంతానికి లింకేంటి? చూద్దాం!  

అశ్వకన్, అస్సాకన్‌ అనే పేరు నుంచి అఫ్గాన్‌ అనే పేరు ఉద్భవించింది. ఈ ప్రాంత నైసర్గిక స్వరూప రీత్యా ఇక్కడ ఎక్కువగా అశ్వాలపై సంచారం ఎక్కువగా ఉండేది. ఈ అశ్వికుల తెగలు నివసించే ప్రాంతం కనుక క్రమంగా అఫ్గానిస్తాన్‌గా మారింది. ఇక్కడ పాలించిన వారందరూ తమను అఫ్గాన్లుగానే చెప్పుకున్నారు.  ప్రత్యేకించి పష్తో భాష మాట్లాడేవారికి ‘అఫ్గాన్‌’ పదం వర్తిస్తుంది. ఈ భాష ఇక్కడి స్థానిక భాష. 

భారతీయ జ్యోతిశ్శాస్త్రవేత్త వరాహమిహిరుడు క్రీ.శ. 6వ శతాబ్దంలో ఈ ప్రాంతంవారిని అవగాన అని తన బృహత్సంహితలో ప్రస్తావించాడు.  1919 లో దేశానికి పూర్తి స్వాతంత్య్రం వచ్చిన తరువాత అధికారికంగా ’అఫ్గానిస్తాన్‌’ అనే పదాన్ని ప్రామాణికం చేసి 1923లో రచించిన రాజ్యాంగంలో పొందుపరిచారు. 

1919 మూడో ఆంగ్లో అఫ్గాన్‌ యుద్ధానంతరం ఈ ప్రాంతం స్వాతంత్య్రం పొందింది. పిమ్మట చాలాకాలం అమానుల్లాఖాన్‌ తదితరుల నేతృత్వంలో రాజరికం నడిచింది.  


అఫ్గానిస్తాన్‌ ప్రాంతంలో మానవ నివాసం ప్రాచీన శిలా యుగం నాటి నుంచి ఉంది. సింధు నాగరికత ఈ ప్రాంతంలో ప్రబలిందనేందుకు షోర్తుగై ప్రాంతంలో తవ్వకాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గాంధార రాజ్య పతనానంతరం జొరాష్ట్రియన్‌ మతం ఇక్కడ ప్రబలింది. ఆ కాలంలో దీన్ని అరియానా అని పిలిచేవారు. తర్వాత కాలంలో మౌర్యులు, కుషాణులు, మంగోలులు, అరబ్బులు, బ్రిటిష్‌వారు ఈ ప్రాంతాన్ని పాలించారు. అరబ్బుల దండయాత్రల అనంతరం ఇతర మతాలు దాదాపు క్షీణించి ముస్లింల ప్రాబల్యం పెరిగింది.  ఆధునికయుగంలో 1747లో అహ్మద్‌ షా దురానీ తొలిసారి కాందహార్‌ రాజధానిగా అఫ్గాన్‌ సామ్రాజ్యాన్ని ఏర్పరిచాడు. 1776లో రాజధాని కాబూల్‌కు మారింది.  తొలి ఆంగ్లో అఫ్గాన్‌ యుద్ధానంతరం ఈ ప్రాంతం కొంతకాలం బ్రిటీష్‌ పాలనలో ఉంది.  

1973లో జహీర్‌షాపై జరిగిన తిరుగుబాటు అనంతరం రిపబ్లిక్‌గా మారింది. 1978 తిరుగుబాటు తర్వాత సోషలిస్టు రాజ్యం రూపాంతరం చెందింది. కానీ తిరుగుబాట్లు అధికం కావడం, రష్యాతో ముజాహిద్దీన్ల యుద్ధంతో అస్థిరత నెలకొంది. 1994లో ఆవిర్భవించిన తాలిబన్లు 1996 నాటికి అఫ్గానిస్తాన్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. వీరిపై 2001లో అమెరికా దాడులు జరిపి ఊచకోత కోసింది. అమెరికా అండతో పౌర ప్రభుత్వం ఏర్పాటైంది. రెండు దశాబ్దాలు అమెరికా, మిత్రదేశాల రక్షణలో అఫ్గాన్‌లో ప్రజాస్వామ్యం చిగుర్లు వేయడం ఆరంభించింది.  

2004లో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన హమీద్‌ కర్జాయ్‌ అధ్యక్షుడయ్యారు. 2014లో అష్రాఫ్‌ ఘనీ అధ్యక్షుడిగా ఎన్నికై ఆదివారం దాకా పాలించారు. ఇరవైఏళ్ల తర్వాత అమెరికా బలగాల ఉపసంహరణ చేపట్టడం అఫ్గాన్‌కు అశనిపాతంగా మారింది. అమెరికా సేనలు అటు మొహం తిప్పగానే ఇటు తాలిబన్లు తలెగరేశారు. ఒక ప్రాంతం తర్వాత మరో ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ రాజధాని కాబూల్‌లోకి వచ్చేశారు.  

మరిన్ని వార్తలు